ప్రజల ఆకాంక్షలకు ‘ప్రజాతంత్ర’ నిరంతర ప్రతిబింబం

  • నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రికను ఆదరించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి
  • ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
సుబేదారి, ప్రజాతంత్ర, జనవరి 20 : తెలంగాణ ఉద్యమ గడ్డపై ప్రజల గొంతుకగా ప్రజాతంత్ర దినపత్రిక నిలుస్తోంద‌ని హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.   ప్రజాతంత్ర నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను-2026ను హనుమకొండ సర్క్యూట్ హౌస్‌లో మంగళవారం  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్రికా రంగంలో ప్రజాతంత్ర తనదైన ముద్ర వేసిందని కొనియాడారు.
1997 డిసెంబర్ లో వరంగల్ లో తెలంగాణ రాష్ట్ర డిక్లరేషన్ కాలం నుంచి నేటి వరకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రజాతంత్ర దినపత్రిక నేడు ప్రజా ఆదరణతో అభివృద్ధి దిశలో పయనిస్తోందని అన్నారు. స్వ‌రాష్ట్ర‌ ఉద్యమ సమయంలో ప్రజాతంత్ర పత్రిక ఎనలేని కృషి చేసిందని, తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ కోసం నిరంతరం పాటుపడాలని, తెలంగాణ ప్రజలు ప్రజాతంత్ర పత్రికను మరింతగా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. ప్ర‌జాతంత్ర దిన‌ప‌త్రిక విస్త‌ర‌ణ‌కు ప్ర‌భుత్వ ప‌రంగా త‌న‌వంతు కృషి చేస్తామ‌ని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యులు, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు ప్రజల పక్షాన నిలబడి నిరంతరం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రిక ప్రజాతంత్ర పత్రిక అని, ప్రజలు దీనిని మరింతగా ఆదరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఈవీ శ్రీనివాస్, 53వ డివిజన్ కాంగ్రెస్ నేత ఎర్ర మహేందర్, రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుణ‌హ‌రి శేషు, సుబేదారి పోలీస్ స్టేషన్ సీఐ  రంజిత్,  ప్రజాతంత్ర దినపత్రిక బ్యూరో చీఫ్ వి.నారాయణ రెడ్డి, ప్రజాతంత్ర సీనియర్ పాత్రికేయులు మండువ ర‌వీంద‌ర్ రావు,  డాక్టర్ ఆర్‌.ఆదిరెడ్డి, ఎన్‌. బుచ్చిరెడ్డి, డాక్టర్ ఎస్‌.రాజన్న, ఇ.రామ్మోహన్, డాక్టర్ హరి కుమార్, ప్రజాతంత్ర డెస్క్ ఇన్‌చార్జ్ పొడిశెట్టి కిరణ్‌, డెస్క్ జ‌ర్న‌లిస్టులు పి.కిర‌ణ్ రెడ్డి, వనం శ్రీకాంత్, ఎండి. షాబుద్దీన్, కామిశెట్టి రాజు, ఫొటోగ్రాఫ‌ర్‌ బి.శ్రీనివాస్‌, కాంగ్రెస్ నేత క‌ల్లూరి ప‌వ‌న్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *