ప్రజా పాటల సేనాని… సుద్దాల హనుమంతు

లక్ష్యాన్నే పదునైన ఆయుధంగా మలచుకొని, నిత్యచైతన్యాన్ని ఇంధనంగా మార్చుకొని ఎన్నెన్నో ఉద్విగ్న భరితమైన అగ్ని కణాల వంటి పాటలను వెలకట్టలేని నిధులుగా అందించిన కవి యోధుడు సుద్దాల హనుమంతు. పాడుకో వడానికి అనువుగా ఉండే పాటల్ని రాసి ప్రజలతో పాడిరచి ప్రజాస్వామ్య భావజాలాన్ని వారి హృదయాలలో నాట్లుగా వేసిన ధీశాలి. కవై, కళాకారుడై, జానపద నిర్దేశకుడవడం వల్ల హనుమంతులోని విలక్షణత, ఎదిరింపు, తెగింపు ఆయన నైజం కనుక ఆయన కలం ఒలికిన, గళం పలికిన ప్రతిపాటా అన్యాయంపై, దోపిడీలపై తిరుగుబాటు బావుటా ఎగరేసింది. హేతువాదిగా తన మార్గాన్ని మలచుకొని విభిన్నతలను తన సాహిత్యంలో కనబరిచారు. సరళమైన నిత్య వ్యవహారిక పదాలు ఆయనకు నేస్తాలు కనుకే ఆ పాటలు ప్రజల గుండెలపై గంతులేశాయి. తాను ఏదో కావాలన్న తత్త్వం కన్నా అన్యాయం మాసిపోయి సమానత్వ సమాజానికి పోరు తొవ్వి నీళ్ళు పోసి పచ్చని మొక్కను ఎదిగించి పూలు పూయించాలన్నదే ఆయన తపన. చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్ల సుద్దులు, పిట్టల దొర, యక్షగానం వంటి కళా రూపాలతో ప్రజల్లో ఆలోచనల ధైర్యాగ్నిని పుట్టించిన పాటల బడబాగ్ని హనుమంతు. పాటను రాయడమే కాదు రాగంతో ఆకట్టుకునేలా పాడడం, అభినయించడం ఆయనకే సొంతమైన ప్రత్యేకత.

మనిషి మనుగడకు ఆధారమవ్వాల్సిన మట్టిని ఆ మనుష్యులకు దూరం చేసి వారి మీదే పెత్తనం చేస్తూ బానిసలుగా మార్చుకొని వారితో గొడ్డు చాకిరీ చేయించి ఆకలి అని అడిగినందుకు మోకాళ్లు, మోచేతుల్ని చితగొట్టి తాళ్లతో కట్టేసి గుండాలతో లాల్‌ ఖానాకు గొరగొరా ఈడ్చుకెళ్లి ఒక పెద్ద బండను వీపుపై ఎక్కించి ఎర్రటి ఎండలో సాయంత్రం వరకు నిలిచోబెట్టి రాయి క్రిందపడితే చింత బరికెలతో దెబ్బలు కొట్టిన నిజాం జవాన్ల అమానవీయ తీరుపై నిరసన గళం వినిపించిన హనుమంతు ఇంత గంజి పొయ్యిమన్నందుకే ఇంత పాపమా అని సూటిగా, ధీటుగా ప్రశ్నించారు. 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తీసుకొచ్చిన గస్తే నిషాన్‌ తిర్పాన్‌ వంటి నిర్భంద చట్టాలు, పల్లెల్లో ఎక్కడ చూసినా వెట్టిచాకిరితో దౌర్జన్యాలు, పండిన పంటలపై 4 రకాల శిస్తుల వసూలు, పంటలు పండకపోయినా కౌలు బాకీ వసూలు చేసే దోపిడీ, భూమి సాగుపై ప్రాంసరీ నోటు రాసి తీసుకున్న డబ్బుపై వసూలు చేసే వడ్డీ దోపిడీ, ధాన్యం కొనుగోలులో దొర గడీలో కొలత కుండ మార్చి మరో కుండ పెట్టి కొలిచి రైతును నిట్టనిలువుగా చేసే నాగుదోపిడి… దున్నడానికి దుక్కెడు భూమి లేక, తినడానికి బువ్వ, ఉండటానికి గుడిసె లేక ఆకలో అని ప్రజలంటుంటే…

 

జుట్టు పన్ను, పెండ్లి పన్ను, సమర్త పన్ను, రోలు పన్ను, రోకటి పన్ను అంటూ ప్రజల్ని పన్నులతో చిత్రహింసలు పెడుతూ వెట్టి చాకిరీలోకి నెట్టేస్తుంటే.. ఒకరో ఇద్దరో కాదు తెలంగాణలోని మాల, మాదిగ, మంగళ, కుమ్మరి, కమ్మర, కంసలి, గొల్ల, బైండ్ల, సాలె, పంబాల, తుంబళ్ల, ఎరుకల, చాకలి, బ్యాగరి, వడ్రంగి, నీరుడు, ఏర్పులజోగు, పోతరాజు, కోమిటి, బ్రాహ్మణ వంటి దాదాపు 24 కులాలు వెట్టిలో బతుకులు తెల్లార్చు కుంటుంటే.. దొరా కాళ్లు మొక్కుతూ నీ బాంచను.. ఒలిశన్ని రోజులాయె ఇంత గంజి తాగి అని జవాను పాదాలపై పడిన ఎండిన డొక్కలను నిర్లక్ష్యంగా తన్ని ఆరే బద్మాష్‌ అరంజాదే నఖ్రేకర్తా అంటూ వెట్టి కోసం వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్తున్న అకృ త్యంపై ఎర్రబడి పాటై ప్రశ్నించి నిలదీసిన ధైర్య వంతుడు హనుమంతు. పాటను ఈటెగా మలిచి బక్కచిక్కిన దేహాలకు చైతన్యాన్ని ప్రేరకంగా అందించి ధిక్కార స్వరాన్ని వినిపించిన అతను ప్రజాక్షేత్ర యోధుడు. బానిస ప్రజా విముక్తికై, సమ సమాజ స్థాపనకై , భూమికై, భుక్తికై, స్వాతంత్య్ర సముపార్జనకై విజయ ఢంకాగా మారి తెలంగాణ సాయుధ పోరాట మహోద్యమానికి బాటలు వేసిన పాట సుద్దాలది. రైతులు పస్తులుండే దశ నుంచి ప్రశ్నించే దశకు, రైతు కూలీలు నిరంకుశ వ్యవస్థపై తిరగబడడానికి ఆయన పాట బాసటగా నిలిచింది. ప్రజలతో మమేకమై వారికి అండగా నిలుస్తూ జీవన శైలికి మార్పులను సంతరించి పెట్టిన ఆయనే ఒక గొప్ప సృజనశీలి.

        ఎన్నో ఆశలతో చమటోడ్చి
               దున్నుకున్న బంజరు భూమి
               కన్నుగుట్టి మాయలు బన్ని
               తన్ని గుంజుకునే భూస్వామి
               అన్నా నీవు కన్న కలలు
               అన్ని వ్యర్థమాయె గదో వ్యవసాయ కూలీ

అంటూ భూస్వామ్యంలో దొరల ఆగడాలను, వ్యవసాయ కూలీల పరిస్థితిని హనుమంతు చెప్పారు. రణభేరి మ్రోగింది తెలుగోడా, ఈ నిజాం ఎవడురా లెమ్ము తెలుగు వీరుడా రణమ్ము చేయ లెమ్మురా అని సమర శంఖం ఊదుతారు. నిజాముతో ప్రతి బజారులో మా ధ్వజం ఎర్రనిది ఎగరేస్తాం అని నిర్భయంగా చెప్పారు. ఆత్మ విశ్వాసం నిండుగా, మెండుగా కలిగిన యోధునిగా హన్మంతు ఈ పాటలో కనిపిస్తారు. పల్లెల్లో బీద పిల్లలు చాలీచాలని జీతం తీసుకుంటూ యజమానుల వేధింపులను భరిస్తూ బడికి దూరమై బ్రతుకు భారం చేసుకుని కుములుతున్న పరిస్థితిపై ఆయన కట్టిన పల్లెటూరి పిల్లగాడా పాట ఓ కన్నీటి మూట.

  చాలిచాలని చింపులంగి
సగము ఖాళీ చల్లగాలి
గోనె చింపు కొప్పెర కొట్టావా ఓ పాలబుగ్గల జీతగాడ
దానికి చిల్లులెన్నో లెక్కపెట్టావా
నీకు జీతం నెలకు కుంచెం
తాలుపరిపిడి కల్తిగ్రాసం
కొలువగా సేరు తక్కువ వచ్చిందా ఓ పాలబుగ్గల జీతగాడ
తలచుకుంటే దుఃఖ మొచ్చిందా  

అని జీతగాని జీవితం వెలుగులేనిదన్న నగ్న సత్యాన్ని చెబుతూ నీకు చేతి కర్రే తోడయ్యిందా అని హనుమంతు చెప్పలేనంత ఆవేదన చెందారు. దొడ్డికీవే దొరవైపోయావా అంటూ పాలబుగ్గల జీతగాడి కోసం బాధపడ్డారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనల్ని బలంగా రేకెత్తింపజేశారు. అర్ధాకలి బాధలు తీరాలంటారు. ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సాధిస్తాం… వేయ్‌ వేయ్‌ వేయ్‌రా దెబ్బకు దెబ్బ వేయ్‌వేయ్‌.. వెట్టి చాకిరి విధానమో రైతన్నా ఎంత చెప్పినా తీరదో కూలన్నా… జోహార్లు జోహార్లు జోహార్లు అమర వీరులారా మీకు జోహార్లు… అవునంటావా ఇది కాదంటావా మరి ఏమంటావో… పెత్తనమా దొరతనమా… మంటలు మంటలు దేశమంతటా ఆకలి మంటలు… వారెవ్వా వహ్వారెవ్వా కన్నుల్లో ధగధగ, కడుపుల్లో భుగభుగ… జాగరతో జాగరత హెచ్చరికో హెచ్చరికా, ఓ కార్మిక కర్షక సోదరులారా జాగరతోయ్‌ జాగరతా… రావోయి రావోయి భాయీ వ్యవసాయ కూలీ, ఎవరికి నీపై జాలిరాదాయెనోయి… ఇదే రామరాజ్యమా ఇదే ప్రజాస్వామ్యమా నిదానించి మదిని గాంచి యదార్థమ్ము పలుకుమా నా తెలుగు బలగమా… సంఘం వచ్చిందిరో రైతన్నా మనకు బలం చాలా తెచ్చిందిరో కూలన్నా, మనకు బలం సంఘం వచ్చింది, దొంగల దోపిడి దొరల దుమ్ము దులిపి వేసింది…

అవునంటారా ఇది కాదంటారా ఏమంటారోయ్‌ చిందొర ఓ పెద్దొరా… ఎన్నాళ్ళీ కష్టకాలం మన గోడు నేడు వినేవారెవరన్నా… దొరలు భూస్వాములు రైతన్నా దెబ్బలాటకు దిగిరి కూలన్నా… ఎందుకు భయపడెదవులే, స్వర్ణ సమయం వచ్చునులే, అరుణారుణుడు దహియించుకునేలా అంధకారమిక నిలవదులే… దిగుదిగు నాగన్నా దిగరా నాగన్నా… మూడు శిరసులవాడ కోడె నాగన్నా, ఎన్నడెరుగని శిష్టాచారం హెచ్చబోదు ఇక మా సంసారం, ఉన్న ఆస్తి ఊడిపోయే బేరం, అన్నాయని వెలిబుచ్చి విచారం, కొన్ని గ్రామముల కల్లు కార్మికులు వొల్లమనరి మామ్‌లా… గాంధీ తాతా తాతా శాంతి దూతానేతా… ఇలాంటి ఎన్నెన్నో ఆణిముత్యాల లాంటి పాటల్ని ఊటెల్లా ప్రయోగించిన ఉద్‌ మశీలి హనుమంతు. పదికాలాలు నిలిచే పాటల్ని ఏనాడో రాసిన హనుమంతు గుండె నిండా ఉన్నది సామాజిక దృక్పథమే. చదివింది రెండో ఫారమే అయినా ప్రజా జీవిత పాఠశాలలో లెక్కకట్టలేనన్ని విశ్వవిద్యాలయాల స్థాయి డాక్టరేట్లకు మించిన పాటల సాహిత్యాన్ని అలవోకగా సృష్టించారు హనుమంతు. ఆకలితో అలసిపోయి, వేదనతో వేగిపోయిన ప్రజలకు ధైర్యాన్ని నూరిపోసిన పాట ఆయనది.

వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కవిగాయక కళాకారుడై ప్రజల సమస్యలకు పరిష్కారం వెతకడమే తన ఉద్యోగంగా భావించి చివరి ఊపిరి వరకు అలాగే గడిపిన త్యాగశీలి. సద్దికూడుతో సద్దుమణుగుతున్న పల్లెల బతుకులకు తన పాటలను చుట్టకుదురుగా అందించిన హనుమంతులోని ఏదీ దాచక నిర్భయంగా చెప్పే తత్వం ఆనాటి హీనమైన దైన్యాన్ని వాస్తవంగా కళ్లముందుంచగలిగింది. సామాజికాంశాలతో మానవీయ సంబంధాలను ముడివేసిన పాటలు హనుమంతువి. కత్తికి ప్రాణమే పదునన్నట్టుగా సత్యాల్ని ప్రాణమని భావించి పాటల్ని ప్రజానీకానికి అందించిన ప్రజాకవి హనుమంతు తాటి గజ్జెల కాలిబోడు, తప్పటడుగుల నడకతీరులను, గుంపు తరలే వొంపు వెతలను అక్‌రీకరించి మువ్వెత్తున గళమెత్తిన మానవీయ, మాననీయ కవి. హనుమంతు పాటల పరిమళం నిరంతర పరివ్యాప్తం. నా కవిత్వంలో నేను దొరుకుతాను అని తిలక్‌ అన్నట్టు తన పాటలో అణువణువునా తనదైన ముద్రతో హనుమంతు కనిపిస్తారు.
– డా. తిరునగరి శ్రీనివాస్‌,                            

   9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *