“భారత్ నిజంగా వికసించాలంటే.. మన చిన్నరుల తరానికి జీవితాన్ని సరైన క్రమంలో ప్రారంభించే అవకాశాన్ని కల్పించాలి. ఆట విలాసం కాదు… నేర్చు కోవడానికి పునాది. దేశంలోని ప్రతి చిన్నారి నేర్చుకునేందుకూ, ఎదగడానికీ, వికసించేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది. చిన్నారి పౌరుల పోషణతోనే దేశ నిర్మాణం ఆరంభం అవుతుంది.”
ఆటల ఆధారంగా నేర్పే విద్యతోనే దేశ భవిష్యత్తు –
వికసిత్ భారత్ ను సాకారం చేసుకోవాలంటే ముందు మనిషి జీవితం మొదలయ్యే చోట నుంచే ప్రారంభించాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల నవ్వుల్లో, వారు పాడే గేయాల్లో… మన దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. రేపటి పౌరులను తీర్చిదిద్దడంలో అంగన్‌వాడీలే తొలి మెట్టు. చిన్నారుల్లో దాగున్న ప్రతిభను గుర్తించి, దానిని సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలో దేశ అభివృద్ధి ప్రగతిలో చిన్నారులకు అధిక ప్రాధ్యానత లభిస్తుంది. విశ్వవిద్యాలయాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఒక చిన్నారి అడుగు పెట్టే తొలి తరగతి అయిన అంగన్‌వాడీలకూ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జాతీయ ప్రాధాన్యతలను మోదీ తిరగరాశారు. నేడు భారత్‌లో ఆటలు కేవలం కాలక్షేపం కాదు, ఇది ఒక విధానం. వాటి ఫలితాలు కూడా మన కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బాలల అభివృద్ధిపై గత పదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం తన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుంది. ఇందుకు నిదర్శనమే 2020లో తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం. బాలల మెదడు అభివృద్ధిలో 85 శాతం ఆరు సంవత్సరాలకంటే ముందే జరుగుతుందని ఇది గుర్తించింది. తెలివైన, ఆరోగ్యమైన, ఉత్పాదకతతో కూడిన రేపటి దేశ భవిష్యత్తును నిర్మించాలంటే మనం పెట్టుబడి పెట్టాల్సింది అత్యంత ముఖ్యమైన దశ అయిన తొలి ఆరు సంవత్సరాల్లోనే. శాస్త్రీయ ఆధారాలు కూడా దీనికి మద్దతిస్తున్నాయి. సీఎంసీ వెల్లూరులోని క్ట్రిస్టియన్ మెడికల్ కాలేజీలోని క్లినికల్ ఎపిడెమియాలజీ విభాగం నిర్వహించిన ఓ అధ్యయనంలో – 18 నుంచి 24 నెలలపాటు నిర్మాణాత్మకమైన సంరక్షణను, విద్యను (ఈసీసీఈ) పొందిన పిల్లల తెలివి తేటలు అంటే ఐక్యూ గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. 5 సంవత్సరాల వయస్సులో 19 పాయింట్లు వరకు, తొమ్మిది సంవత్సరాల వయస్సులో కూడా ఐక్యూ 5 నుంచి 9 పాయింట్లు పెరిగినట్లు గుర్తించారు.
అభివృద్ధి చెందుతున్న భారత్‌కు ఇది అత్యంత కీలకం. ఈ పరిశోధన ఫలితాలు దేశంలోని వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం- ఈసీసీఈ కార్యక్రమంలో పాల్గొన్న అయిదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు 67 శాతం అధిక ఐక్యూ, మెరుగైన సామాజిక నైపుణ్యాలు, విద్యా బుద్దుల్లో గణనీయమైన పురోగతి చూపించారు. నోబెల్ గ్రహీత డాక్టర్ జేమ్స్ హెక్‌మన్ చెప్పినట్లు.. ‘ఎంత త్వరగా ప్రారంభిస్తే, అంత మంచిది, అంత ఎక్కువ లాభం’. ఆయన పరిశోధనల ప్రకారం.. బాల్య దశలోనే పెట్టుబడులు పెట్టడం ద్వారా 13 శాతం నుంచి 18 శాతం వరకు లాభాల్ని అందివస్తాయి. ఇది విద్య లేదా ఉద్యోగ శిక్షణలోని ఏ ఇతర దశలకన్నా కూడా ఎక్కువ అని ఆయన నిర్వహించిన పరిశోధనలో తేలింది.
ఈసీసీఈకి ఆర్థిక, సామాజిక ప్రాధాన్యత ఉందని గుర్తించిన కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘పోషన్ భీ- పఢాయి భీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాలను శక్తిమంతమైన ప్రారంభ విద్యా కేంద్రాలుగా మార్చే పని జరుగుతోంది. దేశ చరిత్రలో తొలిసారి అంగన్వాడీ కార్యకర్తలకు ఈసీసీఈలో భాగంగా క్రమపద్దతిలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో స్థానిక, స్వదేశీ వస్తువులను ఉపయోగించి పిల్లలతో ఆటలతో కూడిన విధానాలపై దృష్టి సారిస్తున్నారు. బోధనాభ్యాస సామగ్రి కోసం బడ్జెట్టు కేటాయింపులు కూడా గణనీయంగా పెరిగాయి. పత్రి నెల ఈసీసీఈ దినోత్సవాలను ఏర్పాటు చేయడం ద్వారా నేడు అంగన్‌వాడీలు పోషణ కేంద్రాలు మాత్రమే కాకుండా ప్రతి చిన్నారికీ తొలి పాఠశాలగా మారాయి. జీవితంలోని అత్యంత కీలక దశ అయిన ఇక్కడే వారి ఆసక్తి, సృజనాత్మకత, సమగ్ర అభివృద్ధికు పునాది పడుతుంది.
ఈ మార్పునకు దిశానిర్దేశం చేయడానికి మహిళా, శిశు సంరక్షణ మంత్రిత్వశాఖ ‘ఆధారశిల’ను ప్రవేశపెట్టింది. ఇది 3 నుంచి 6 సంవత్సరాల వయస్సున్న పిల్లల సంరక్షణ, విద్య కోసం రూపొందించిన జాతీయ పాఠ్య ప్రణాళిక.. ఆధారశిల పిల్లల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. మేధోపరమైన వృద్ధిని మాత్రమే కాకుండా భావోద్వేగ, శారీరక, సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పాఠ్య ప్రణాళిక క్రమబద్ధమైన ఆటల ఆధారంగా నేర్చుకోవడాన్ని అనుసరిస్తుంది. దీనివల్ల పిల్లలు సురక్షిత, ఉత్సాహపూరిత వాతావరణంలో నేర్చుకుంటూ, అభివృద్ధి చెందే అవకాశాన్ని పొందుతారు. పిల్లలు సహజంగానే ఆటలపట్ల ఆకర్షితులవుతారు. పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రతి చోటును ఆనందం, అన్వేషణకు ఒక వేదికగా మార్చుతారు. ఈ సమయంలో పిల్లలకు సరైన వాతావరణం కల్పిస్తే అది జీవితాంతం నేర్చుకోవడానికి పునాది అవుతుంది. పోషణ్ భీ- పఢాయి భీ కార్యక్రమం ఈ స్పూర్తిని పెంపొందిస్తుంది. సురక్షిత, క్రమబద్దమైన, ఉత్సాహవంతమైన పరిసరాల్లో మార్గదర్శకత్వాన్ని అందించే ఆటల ద్వారా పిల్లలు అభివృద్ధి చెందేందుకు ఇది సహకరిస్తుంది.
బాల్య సంరక్షణ, విద్య (ఈసీసీఈ) దేశ భవిష్యత్తును రూపొందించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. పోషణ్ భీ- పభాయి భీ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలు పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, బాల్య విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రోజూ 30 నిమిషాల ఆటతో ఆధారశిల 5+1 వారపు ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భాష, సృజనాత్మకత, నైపుణ్యాలు, సామాజిక జీవనాన్ని పెంచే నిర్మాణాత్మక కార్యకలాపాలు ఉంటాయి. పోషకాహారాలతో కూడిన భోజనం, విశ్రాంతి సమయం అనంతరం బయట ఆడుకోవడం, విలువలను పెంచే సంభాషణలతో రోజు ముగుస్తుంది. ఈ విధంగా మన దేశ చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే దిశగా అంగన్‌వాడీలు అభివృద్ధి చెందుతున్నాయి. నిర్మాణాత్మక, సాధారణ ఆటల సమతుల్యత ఎంతో కీలకం. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం పాఠశాల ప్రవేశ వయస్సును ఆరు సంవత్సరాలకు పెంచిన నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. నిర్మాణాత్మక ఈసీసీఈ ద్వారా పిల్లలు శారీరకంగా, మానసికంగా పాఠశాలకు వెళ్లేందుకు సిద్దమవుతారు.
దేశవ్యాప్తంగా తల్లిదండ్రులలో అంగన్‌వాడీలపై నమ్మకం పెరుగుతోంది. ఇది ఆనందించదగ్గది. ఒకప్పుడు అంగన్‌వాడీలు కేవలం పోషకాహార కేంద్రాలుగా భావించిన కుటుంబాలు.. ఇప్పుడు వాటిని తమ పిల్లల విద్యా ప్రయాణంలో తొలి మెట్టుగా చూస్తున్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి చిన్నారికీ- పుట్టుక నుంచీ ఒక మంచి అవకాశాలను అందించాలి. జననం నుంచి మూడేళ్ల వయస్సు వరకున్న దశకు ప్రాధాన్యతనిస్తూ..మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘నవచేతన’ అనే జాతీయ మార్గదర్శక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది చిన్నారుల మేధోపరమైన ఎదుగుదలకు రూపొందించిన కార్యక్రమం. తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఆటల ఆధారంగా వయస్సుకు తగిన కార్యకలాపాల ద్వారా ఇంటి వద్దే చిన్నారి మేధో వికాసానికి సహాయపడుతోంది. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. ఉన్నత స్థాయి కుటుంబాల్లోని పిల్లలకు తల్లిదండ్రులు బొమ్మలు, పుస్తకాలు కొని ఇవ్వవచ్చు.
కానీ తక్కువ వనరులు కలిగిన పేద కుటుంబాలకు ఇవన్నీ అందుబాటులో ఉండకపోవచ్చు. పేద పిల్లల కోసం సమానావకాశాలను కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. నవచేతన, పోషణ్ భీ, పఢాయి భీ వంటి కార్యక్రమాల ద్వారా మేం ఈ అంతరాన్ని తొలగిస్తున్నాం. దేశంలోని ప్రతి మూలనున్న చిన్నారి తొలిదశ నుంచే అభివృద్ధికి అవసరమైన ప్రేరణ, సంరక్షణ పోషణ లభించేలా చూస్తున్నాం. భారత్ నిజంగా వికసించాలంటే.. మన చిన్నరుల తరానికి జీవితాన్ని సరైన క్రమంలో ప్రారంభించే అవకాశాన్ని కల్పించాలి. ఆట విలాసం కాదు… నేర్చుకోవడానికి పునాది. దేశంలోని ప్రతి చిన్నారి నేర్చుకునేందుకూ, ఎదగడానికీ, వికసించేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది. చిన్నారి పౌరుల పోషణతోనే దేశ నిర్మాణం ఆరంభం అవుతుంది.





