కథలు అన్నీ చివరి మజిలీగా ‘కంచి’కి పోవు. కొన్నికథలని చదివాక అవి ఎటుపోకుండా పాఠకుడి మనసులో ఇంకిపోతాయి. సందర్భాన్ని బట్టి అవి మళ్ళీమళ్ళీ మననానికి వస్తాయి. అలా మననానికి వచ్చిన ప్రతిసారి పాఠకుడు ‘ఎంత బాగా రాశాడీ రచయిత’ అని అనుకోకుండా ఉండలేడు. బద్రి నర్సన్ కథా సంకలనం ‘దారి తెలిసిన మేఘం’ చదివాక పాఠకులు సరిగ్గా ఇవే భావాలకు లోను అవుతారు. మాయా అంజెలో అనే అమెరికన్ రచయిత్రి ‘మనలో చెప్పకుండా మిగిలిపోయే కథ కన్నా పెద్దబాధ మరేమీలేదు’ అంటారు.
ప్రసిద్ధ కథకులందరూ ఒక కథకు బీజం పడినాక ‘ప్రసవించే దాకా’ ఇలానే అనుభూతిస్తారు. వ్రాసిన కథను చదువరులు భావోద్వేగాన్ని, ఆలోచనాస్థితిని బట్టి ఆ కథ మంచి చెడులను నిర్ణయిస్తారు. బాగుండడం, బాగాలేకపోవడం అన్నది చదువరి మానసికస్థితి నిర్ణయిస్తుంది. వ్రాయడమే రచయిత వంతు. దూషణ, భూషణ, తిరస్కారాలపై రచయితకు పట్టింపు అవసరం లేదు. సంధించి విడిచిన బాణం మాదిరి రచన ఏ గమ్యం చేరినా పర్వాలేదు. స్థితప్రజ్ఞత తప్ప రచయితకు మరోమార్గం లేదు.
బద్రి నర్సన్ కథల్లో ఎందరికో నచ్చిన కథ ‘ఎంగిలి’. ఈ కథలో ఊపు ఉంది, తూగు ఉంది. కూరలమ్మ పార్వతి, వెంకటేశ్వర్లు మధ్యన ఏదో అనిర్వచనీయమైన అనుబంధముంది. అది వెంకటేశ్వర్లు భార్య కాంతంకు పార్వతి భర్త మల్లేష్ కు అర్థం కానిది. చేయని తప్పుకు ఇరువైపులవాళ్లు వీళ్ళను దోషులుగా నిలబెట్టారు. ఇద్దరూ మౌనంగా శిక్షను భరించారు. వెంకటేశ్వర్లు కంటే పార్వతి ఒక ఆకు ఎక్కువే చదివింది. ఆ నిరూపణ రచయిత కథ చివర చెప్పాక వెంకటేశ్వర్లే కాదు, పాఠకుడు కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనై తేరుకోవడానికి కొంచెం సమయం తీసుకుంటాడు.
మనిషిని మనిషి చంపడం అనాగరికం, అనైతికం. ‘ఈ శిక్ష మాకొద్దు’ కథలో ఇస్మాయిల్ అనువంశికంగా ‘తలారి’ బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. బ్రతుకుదెరువుకై మనిషి ఎంతటి పైశాచిక వృత్తి అయినా స్వీకరించాక తప్పదని ఈ కథలో వివరించబడింది. కథ ముగింపులో సూచించిన పరిష్కారం రచయిత ప్రోటోగానిస్ట్ మానసికస్థితిని తెలుపుతుంది. రచయిత ఈ కథలో మెదడుతో కాక గుండెతో ఆలోచించారు. మరో మంచి కథ ‘దారి తెలిసిన మేఘం’. స్వేచ్ఛగా విహరించగలిగే మేఘాలకు ఏటేపు పయనించాలో తెలుసును. ఒక్కోసారి కులాలు, మతాలు అడ్డు రావచ్చును. తాత్కాలికంగా ఆ మేఘాలకు అడ్డుకట్ట పడినా జీవిత గమ్యం కోసం సుజన తనకు తెలిసిన దారి వెంటే పయనించింది.
అతి సామాన్య సంఘటనల్లోంచే అసామాన్య కథలు, సన్నివేశాలు సృష్టించగల నేర్పు బద్రి నర్సన్ కు ఉందని ఈ కథలు నిరూపిస్తున్నాయి. ఆ నేర్పు ‘మరక మంచిదే’ లో మరింత ద్యోతకమౌతుంది. ‘కూటి విద్యలు’ కథ ద్వారా గోపాలామూర్తి మనకు కొత్త విద్యలు సూచిస్తాడు. చావు అనగానే ఏదో ఉద్విగ్నత మనిషిని జయించి నిర్వేదానికి గురి చేస్తుంది. ‘భూమ్మీద ప్రతి జీవి పోయేదే’ అన్న తెలివిడి మనలో మూసుకుపోయిన తలుపుల్ని తెరిచి చల్లని గాలులు, వెచ్చని వెలుగులుని ప్రసరింపచేస్తాయని ‘చావునీడ’ కథ చెబుతుంది. ఇవేకాదు, సంపుటిలోని మిగతా కథలన్నీ మనచుట్టూ చోటు చేసుకుంటున్న సామాజికాంశాలనే ప్రతిఫలించాయి. సామాన్య సంఘటనలే, సన్నివేశాలే ‘మాన్యత’ పొంది మంచి కథలుగా మారాయి. అందుకే ఈ కథలు కంచికి కాక పాఠకుడి మనసులో ఇంకిపోతాయి.
-కూర చిదంబరం





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల