• మెరుపు తీగెలు

పువ్వులు కొమ్మనుండి వేరుపడ్డామని కుమిలిపోలేదు!

దేవుని శిరస్సెక్కి కూర్చున్నామని ఆనంద పడిపోలేదు!

దండలో గుచ్చిన పువ్వులు నొప్పిని మర్చిపోయి దేవుని దేహం మీద దొర్లాడాయి! అందుకు దారానికి కృతజ్ఞత చెప్పుకోకపోయినా దేవునికి కృతజ్ఞత చెప్పుకున్నాయి!

సూది దిగలేదని దారం తమని అదుపు చెయ్యని విడివిడి పువ్వులు విచ్చలవిడిగా దేవుని శిరసుమీదా తామే సిరిపాదంమీదా తామే అని అనుకోలేదు!

ఆ గుడికి వచ్చిన భక్తులు మాత్రం యెన్నో యెన్నెన్నో కోరుకున్నారు!

ఆ భక్తుల కోరికలు విని దేవుడు యేమనుకున్నాడో తెలీదు కాని పువ్వులు గుసగుసగా నవ్వుకున్నాయి! అలా నవ్వి కదిలిపోయాయేమో వొకదాన్ని వొకటి తోసుకున్నాయి! ఆ తోపులాటలో శిరసు మీది పువ్వులు పాదాల మీద పడ్డాయి! అలా పడ్డవాటిలో మరికొన్ని పాదాల మీంచి జారి నేలమీద పడి బేలచూపులు చూశాయి!

అయితే అలా అప్పుడప్పుడూ దేవుని తలమీది నుంచి వొక్కో పువ్వూ నేలరాలుతుంటే ‘అబ్బా… మేం అనుకున్నది జరుగుతుంది’ అని ఆత్మతృప్తితో భక్తులు అనుకొని వెళ్ళడం గమనించాయి! పిచ్చి ప్రశ్నలు వెయ్యొద్దని పెద్దలు చెప్పినా, ‘అందులో వింతేముంది? భూమికి ఆకర్షణశక్తి వుంది కాబట్టి…’ అని పిల్లలు. నిజమే, పువ్వులు నేలరాలాయి గాని యెందుకో నింగిలోకి దూసుకెళ్ళలేదు?!

‘పువ్వై పుట్టి పూజేచేసి పోనీ రాలిపోని- పువ్వుగా ప్రాణాలు పోనీ- తావిగా నన్నుండి పోనీ’ అని పూలన్నీ మురిసిపోయాయి. ఆ మురిపాన్ని పెంచుతూన్నట్టు పూజారి యిచ్చిన పూలను అందుకున్న ఆడవాళ్ళు కళ్ళకు అద్దుకొని సిగలో తురుముకుంటుంటే, మగాళ్ళు చెవిలో పెట్టుకుంటున్నారు. రాలిన పూరేకులను పసివాళ్ళ తలలమీద అక్షితలుగా చల్లుతున్నారు. ‘ఏమి మా భాగ్యము?’ అని పువ్వులు గర్వంతో కులికాయి. దేవుడు అన్నీ గమనిస్తున్నట్టే వున్నాడు?!

దేవుని తలమీది పువ్వులు కొన్ని నేలరాలాయి. పూజారి కాళ్ళ దగ్గర. నిత్యమూ పూజచేసే పూజారి భగవర్పితమైన ఆ పూలనితీసి కళ్ళకు అద్దుకోలేదు సరికదా, యెడమకాలితో పక్కకి తోసేశాడు!

పూలకి గర్వభంగమయి దేవుని వంక చూశాయి!

దేవుడు యెప్పుడూ వున్నట్టే యేమీ జరగనట్టే రాయిలా వున్నాడు?!

బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *