క్రీడ‌ల‌ను క‌లుషితం చేస్తున్న రాజ‌కీయాలు

ఒక ఆట‌గాడి నైపుణ్యం గెలుపు ఓట‌ముల్లోనో లేక రాజ‌కీయ ప్ర‌భావిత వేదిక‌లు లేదా త‌రుముతున్న జాతీయ‌వాదంలోనో వెల్ల‌డి కాదు. కేవ‌లం ఆట‌లో అత‌ను చూపిన నైపుణ్యంపైనే అత‌ని ప్ర‌తిభ‌ను క్రీడాభిమానులు, విశ్లేష‌కులు గుర్తిస్తారు.  మ‌నం ఒక టీవీ సీరియ‌ల్‌ను వీక్షిస్తున్న‌ప్పుడు, అది ఎంత‌టి అద్భుత‌మైన క‌థ‌న‌మైనా,  పాత్ర‌లు ఎంతో గంభీరంగా వున్న‌ప్ప‌టికీ, క‌థ ర‌చ‌నాశైలి, న‌డిపిన తీరు అసంద‌ర్భంగా, పేల‌వంగా వుంటే వీక్ష‌ల‌కు అంతులేని నిరాశ క‌ల‌గ‌డం స‌హ‌జం. ప్ర‌స్తుతం 17వ ఆసియా క‌ప్ క్రికెట్ ఫైన‌ల్ ముగిసిన తీరు స‌రిగ్గా ఇదేమాదిరిగా ఉన్నదనడంలో ఎంత‌మాత్రం అతిశ‌యోక్తి లేదు.  ఈ ఫైన‌ల్ ఎంతో ఆస‌క్తితో ఉత్కంఠ‌ను క‌లిగించే రీతిలో ఉంటుందని భావించిన క్రీడాభిమానుల‌కు అసాధార‌ణ రీతిలో ఇది ముగిసిన తీరు తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. అస‌లీవిధ‌మైన ముగింపు కూడా ఉంటుందా ? అన్న రీతిలో ఆశ్చ‌ర్య‌పోవ‌డం అభిమానుల వంతైంది.
ఆసియా కప్ క్రికెట్ ఫైన‌ల్ మ్యాచ్ ఆసాంతం రాజ‌కీయంతో ముడిప‌డిన రీతిగా కొన‌సాగింది. అస‌లు క్రీడా స్ఫూర్తి మ‌చ్చుకైనా కాన‌రాలేదు. ప‌ర‌స్ప‌ర దూష‌ణ‌లు, ఎంత‌మాత్రం క్రీడా స్ఫూర్తిలేని వ్య‌వ‌హార‌శైలి మొత్తం చూస్తుంటే ఒక నాట‌క ప్రద‌ర్శ‌నకు ఎక్క‌డా తీసిపోలేదు. ఆట‌లో గెలిచిన భార‌త్ ఓడిన పాకిస్తాన్ జ‌ట్టు ఆట ఆసాంతం ఒక రాజ‌కీయ వ్యూహం చ‌ట్రంలో మునిగిపోయిన‌ట్లు తేట‌తెల్ల‌మైంది. ఇక ఆట ముగిసిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు మ‌రింత ఘోరంగా క‌నిపించాయి. గెలిచిన భార‌త జ‌ట్టు ట్రోఫీని తీసుకోవ‌డానికి అంగీక‌రించ‌లేదు. ట్రోఫీలేకుండానే మైదానంలో విజ‌యోత్సాహాన్ని జ‌రుపుకోవ‌డం బ‌హుశా క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం కావ‌చ్చు. భార‌త‌జ‌ట్టు ట్రోఫీని ఆసియ‌న్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మొహ‌సీన్ న‌ఖ్వి చేతుల‌మీదుగా తీసుకోవ‌డానికి ఎంత‌మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు.
ఆయ‌న పాకిస్తాన్ ఆంత‌రంగిక శాఖ మంత్రి కూడా! ఈ ఆట విష‌యంలో న‌ఖ్వీ వ్య‌వ‌హార‌శైలి ఎంత‌మాత్రం న్యాయ‌బ‌ద్ధంగా లేద‌నేది భార‌త జ‌ట్టుచేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. క్రీడా మైదానంలో ప‌రిస్థితి ఈవిధంగా ఉంటే , బ‌య‌ట ఆహంకార ప్ర‌ద‌ర్శ‌న మ‌రోవిధంగా ఉంది . భార‌త సుప్రీం లీడ‌ర్ మాట్లాడుతూ ఆప‌రేష‌న్ సింధూర్ మాదిరిగానే, ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో కూడా భార‌త్ విజ‌యం సాధిస్తుంద‌ని పేర్కొన‌డం మ‌రో విచిత్రం. ఈ ప‌రిణామాల‌న్నీ జ‌ట్ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర షేక్‌హ్యాండ్లు, రెచ్చ‌గొట్టే మాట‌ల వంటి వాటికి దారితీసి అస‌లు క్రీడా స్ఫూర్తినే దెబ్బ‌తీశాయి. ముఖ్యంగా పాకిస్తాన్ మంత్రి చేతుల‌మీదుగా ట్రోఫీని అందుకోవ‌డానికి తిర‌స్క‌రించ‌డమ‌నేది క్రీడ‌ల‌కు, రాజ‌కీయాల‌కు మ‌ధ్య ఉన్న అడ్డుగోడ‌ పూర్తిగా తొల‌గిపోయింద‌న‌డానికి నిద‌ర్శ‌నం. ఈ ఆసియాక‌ప్ క్రీడ మొత్తం రాజ‌కీయాల‌తో నిడిపోయి, ఆట‌గాళ్ల నైపుణ్య‌ప్ర‌ద‌ర్శ‌న‌, ప్ర‌తిభ‌కు ఎంత‌మాత్రం చోటులేకుండా పోయింది. ముఖ్యంగా మీడియా ఆట‌పై కాకుండా, సెన్సేష‌న్ కోసం ఇత‌ర అంశాల‌పై ప్ర‌ధానంగా దృష్టి కేంద్రీకరించ‌డం మ‌రో విచిత్రం. ముఖ్యంగా మీడియా అతి జాతీయత‌ను ప్ర‌ద‌ర్శించ‌డంతో అస‌లు ఆట ఉద్దేశ‌మే మ‌రుగున ప‌డిపోయింది.
పాకిస్తానీ క్రికెట‌ర్ల‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వ‌క‌పోవ‌డం, వారినుంచి ట్రోఫీని తీసుకోక‌పోవ‌డం, భార‌త క్రికెట్ జ‌ట్టు, అధికార్ల ప‌రంగా నిజం కావొచ్చు.
ఇదే స‌మ‌యంలో రెచ్చ‌గొట్ట‌డం, ప్ర‌తీకార ధోర‌ణి, అహంకారం వంటివి పాక్ క్రికెట‌ర్లు, అధికార్ల ప‌రంగా నిజం కావొచ్చు. అస‌లు ఈరెండు జ‌ట్ల మ‌ధ్య ఈ క్రికెట్ పోటీ లేక‌పోతే ఏ స‌మ‌స్యా ఉండేది కాదు క‌దా! కానీ ఆడ‌టానికి అంగీక‌రించారు. మ‌రి ఆడిన‌ప్పుడు క్రీడా స్ఫూర్తిని, ఆట‌లోని నిబంధ‌న‌ల‌ను పాటించాలి క‌దా! ఇక్క‌డ అటువంటిదేమీ క‌నిపించ‌లేదు. ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లను పూర్తిగా రాజ‌కీయ మేఘాలు చుట్టుముట్టేశాయి. ఆవిధంగా వారు త‌మ రాజ‌కీయ నాయ‌కుల చేతుల్లో పావులుగా మారిపోయారు.
ఇదేవిధంగా భ‌విష్య‌త్తులో కూడా ఇరు దేశాల ఆట‌గాళ్లు, క్రికెట్‌ను ఒక యుద్ధం మాదిరిగా ప‌రిగ‌ణిస్తే ఇక దీనికి అర్థమేముంటుంది?  భార‌త్‌, పాకిస్తాన్‌ల‌లో క్రికెట్ ఎంతో భావోద్వేగంతో నిండిన క్రీడ అనేది అంద‌రూ అంగీక‌రించే స‌త్య‌మే! అభిమానుల భావోద్వేగాలు ఆగ్ర‌హావేశాల‌కు కార‌ణం కావ‌డంతో అంత‌ర్జాతీయ క్రీడ‌లు నిలిచిపోయి, చ‌ర్చ‌లు, ప‌ర‌స్ప‌ర గౌరవం అనే అంశాల‌కు చోటే లేకుండా పోతున్న‌ది. ఇరు దేశాల‌ను క‌లిపేది, విడ‌గొట్టేది క్రికెట్ మాత్ర‌మే అంటే అతిశ‌యోక్తి కాదు. అందువ‌ల్ల ఈ ఆట‌ను క్రీడా స్ఫూర్తితో కొన‌సాగించే బాధ్య‌త క్రీడాకారులు, రెండు దేశాల క్రికెట్ బోర్డులు, ప్ర‌భుత్వాలదే. ఇందులో ఇత‌ర అంశాల ప్ర‌మేయం ఉండకూడదు. అద్భుత‌మైన ఈ క్రీడ‌ను విషాదంగా మ‌లుస్తున్నందుకు రెండు దేశాల క్రికెట్ బాస్‌లు, రాజ‌కీయ నాయ‌కులు సిగ్గుప‌డాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *