మానసిక ఒత్తిడిలోకి గ్రామ సమాజం
రాజకీయ వైరస్ పల్లెల్లోకి
పల్లె రాజకీయాల్లో విషబీజం… చీలిపోతున్న మనసులు
పంచాయతీ ఎన్నికలు: గ్రామాల అభివృద్ధి నుంచి బంధాల విభజన వరకా…
ఒకప్పుడు పల్లెసీమలు ప్రశాంతతకు, పరస్పర ప్రేమాభిమానాలకు ప్రతీకగా ఉండేవి. కానీ నేడు అదే పల్లెల్లోకి రాజకీయ కాలుష్యపు గాలులు ప్రవేశించాయి. పంచాయతీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి పునాది కావాల్సిన సమయంలో, కుటుంబాలను, బంధాలను చీల్చే విభజన సంస్కృతి పెరుగుతోంది. ఈ పరిస్థితి నేడు ప్రతి గ్రామంలో సామాజిక సమస్యగా మాత్రమే కాదు మానసిక ఆరోగ్య సమస్యగా మారింది.
ఇంటికో పంచాయతీ – ఊరికో యుద్ధం
ప్రస్తుతం పల్లెల్లో ఇంటికో పంచాయతీ మొదలైంది. అన్నదమ్ములు వేర్వేరు రాజకీయ కండువాలతో పోటీలో నిలబడుతున్నారు. మామా అల్లుండ్లు వేర్వేరు రంగు జెండాలు పట్టుకుంటున్నారు. అక్క చెల్లెళ్ళు వేర్వేరు రాజకీయ పార్టీలు ఎంచుకుంటున్నారు. ఎన్నికల ముందు ప్రేమాభిమానాల వరుసలు కనిపిస్తాయి కానీ ఫలితాల తర్వాత అవి మిగులుతాయా? లేక చెదిరిపోతాయా? ఇదే నేడు గ్రామాల గుండెల్లో నిలిచిన అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితి వల్ల ఇళ్లలో నిత్య కలహాలు, అనుమానాలు, కోపావేశాలు, మాటల యుద్ధాలు పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య భద్రత, విశ్వాసం తగ్గిపోతుండడం ఒక మానసిక సంక్షోభానికి దారి తీస్తోంది.
పిల్లల మనసులపై పడుతున్న గాయాలు
ఎన్నికల హింస, గొడవలు, కోపావేశాలు చూస్తూ పెరుగుతున్న పిల్లలు భయంతో, అయోమయంతో, అసురక్షిత భావనతో ఎదుగుతున్నారు. ఇలాంటి పిల్లల్లో బూతులు మాట్లాడే అలవాటు, కొట్టుకోవడం. అబద్ధాలు చెప్పడం. ద్వేష భావాలు త్వరగా పెరుగుతున్నాయి. రేపటి తరానికి చెందిన ఈ పిల్లలు అసహనశీలతతో కూడిన పౌరులుగా తయారయ్యే ప్రమాదం ఉంది. గ్రామ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉంటే, ఈ రోజు ప్రవర్తనే రేపటి సమాజాన్ని నిర్ణయిస్తుంది.
మానవ సంబంధాలను మట్టుపెడుతున్న రాజకీయ వైరస్
ప్రస్తుతం రాజకీయ పోటీ ఒక వైరస్‌లా మానవ సంబంధాలను మట్టుపెడుతోంది. గెలిచినవారయినా ఓడినవారయినా సరే ఎన్నికలు పూర్తయిన తర్వాత వారిద్దరూ అదే ఊర్లో తిరగాల్సిందే. అదే బావిలో నీళ్లు తాగాలి, అదే పొలంలో పంటలు పండించాలి, అదే దేవాలయంలో పక్కపక్కనే నిలబడి మంగళహారతి అందుకోవాలి. కానీ మనసుల్లో మాత్రం ద్వేషం, అసూయ, అవమానం, ప్రతీకారం అనే భావనలు నాటుకుపోతున్నాయి. ఇవి క్రమ క్రమంగా డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి, కోప నియంత్రణ లోపం వంటి మానసిక సమస్యలను పెంచుతున్నాయి. అయితే ఈ చిన్న పంచాయతీ పదవుల కోసం మనిషి మనిషినే కోల్పోవడం ఎంతో దురదృష్టకరం.
రాజకీయ విభజనతో పెరుగుతున్న మానసిక ఒత్తిడి
గ్రామాల్లో ఎన్నికల వాతావరణం ప్రస్తుతం కేవలం రాజకీయ ఉద్రిక్తత మాత్రమే కాదు సామూహిక మానసిక ఒత్తిడిగా మారుతోంది. ఎవరు ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకునే వరకు అనుమానం, భయం, కోపం, అపనమ్మకం అనే భావాలు మనుషుల మనసుల్లో పెరిగిపోతున్నాయి. ఇవి క్రమంగా రక్తపోటు, నిద్రలేమి, ఆందోళన రుగ్మతలు, కోప నియంత్రణ లోపం వంటి సమస్యలకు దారి తీస్తున్నది.
ఐదేళ్ల పదవీ – నూరేళ్ల బంధం ఏదీ ముఖ్యం
పదవి ఉండేది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే. కానీ మనిషి జీవితంతో వచ్చే బంధం మాత్రం నూరేళ్లు, అమూల్యం, అద్భుత జ్ఞాపకాలు శాశ్వతము. రాజకీయాల వల్ల చీలిపోయే గ్రామం అసలు అభివృద్ధి చెందదు. అది ఓడిపోయిన అభ్యుదయం. అది గెలిచిన ద్వేషం. పంచాయతీ ఎన్నికలు పోటీదారుల మధ్య ఉండాలి. కానీ అవి మనిషి మనిషి కి మధ్య యుద్ధంగా మారకూడదు. మనసులు చీలిన చోట అభివృద్ధి వచ్చినా, ఆనందం సంతోషం మాత్రం పుట్టదు.
తప్పు నాయకుల్లో కాదు, మనలోనే….
రంగులు, వర్గాలు, మతాలు, గుంపుల పేరుతో విభజించే నాయకులకంటే, మన ప్రేమాభిమానాలను రాజకీయ పదవుల కోసం పణంగా పెట్టే మనమే పెద్ద తప్పు చేస్తున్నాం. నాయకుడు ఓటు కోసం వస్తాడు కానీ మనసు విరగడానికి కారణం చాలా సార్లు మన అతి ఆత్మాభిమానం, అహంకారం, పట్టుదలే అవుతాయి. పదవి వస్తుంది, పోతుంది కానీ బంధాలు తెగిపోతే అవి తిరిగి రావు. బంధాల బాధ జీవితాంతం మనసును బాధిస్తూ ఉంటుంది.
గ్రామ సమాజం సరైన నిర్ణయం తీసుకోవాలి
పంచాయతీలు గెలవాలి కానీ పల్లెగుండెలు చీల్చకూడదు. రాజకీయాలు రావాలి కానీ మనిషి బంధం పోకూడదు. ఎన్నికలు ముగిశాక కూడా గ్రామంలో మాట్లాడుకునే మనుషులు ఉండాలి, పలకరించే హృదయాలు ఉండాలి, కలిసి పండుగలు చేసుకునే బంధాలు నిలబడి ఉండాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి. అదే నిజమైన విజయం. అదే అసలు సిసలు పంచాయతీ.
మహిళల పై పడుతున్న మౌన భారము
భర్తల రాజకీయ గొడవల వల్ల ఇంట్లో భద్రత లేకుండా పోతోంది. మానసిక హింస, మాటల దాడులు పెరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో గ్రామ మహిళలు భయంతో, మౌనంగా, ఒత్తిడితో బ్రతుకుతున్నారు. కానీ చాలా సార్లు ఈ మానసిక బాధ బయటికి చెప్పుకునే అవకాశమే ఉండదు.
పదవి కంటే బంధమే గొప్పది-మానసిక ఆరోగ్యానికి అదే రక్ష
పదవులను మనిషి అలంకరిస్తాడు కానీ బంధాలే మనిషికి నిజమైన ఆనందాన్ని, మానసిక ప్రశాంతత ఇస్తాయి. బంధాలు బలంగా ఉంటే మనిషి విపత్తుల్ని తట్టుకునే శక్తిని పొందుతాడు. బంధాలు బలహీనమైతే అదే మనిషి ఒంటరితనం, డిప్రెషన్, నిరాశలోకి జారిపోతాడు. అందుకే పదవుల కోసం బంధాలను బలి చేసుకోవద్దు. గెలుపు సంతోషాన్ని ఇవ్వాలి కాని మనుషుల మధ్య విషాదాన్ని మిగిల్చకూడదు విద్వేషం ను రెచ్చగొట్ట కూడదు. విడి విడిగా పోటీ పడండి గెలిచాక కలిసి బంధాలను నిలుపుకోవాలి. అదే గ్రామానికి నిజమైన మానసిక ఆరోగ్యం. ఎన్నికలు తాత్కాలికం, కానీ మానసిక గాయాలు శాశ్వతం. ఎన్నికల్లో గెలిస్తే పదవి రావచ్చు కానీ బంధాలు పోతే జీవితాంతం పశ్చాత్తాపమే మిగులుతుంది.

Rehabilitation Psychologist | Sex Educator | Clinical Nutritionist & Dietitian | Family Counsellor | Special Educator (Intellectual Disability) | 9703935321
Reg.No. A65442 (RCI)
MA(Psgy), M.Sc.(M), M.Ed., MCJ, M.Sc.(VE&S), M.Sc. (Clinical Nutrition & Dietetics), PG Diploma in Health Sciences in Public Health, PGDGC, PGDFDR, PGCPC, PGDVE, CCHIV&AIDS, PhD
National President of Association of Rehabilitation Psychologists and Professionals – INDIA.





