రాజకీయ పార్టీలు .. మీడియా అక్రమ సంబంధాలు

“ఒక మూడు సెంటీమీటర్ల వార్త కోసం స్థానిక గ్రామీణ విలేకరి గంటల తరబడి సమయం వేచి చూసి,వార్త సేకరించి,అందంగా రాసి,ఏ ఆర్టీసి బస్ ద్వారా నో టెలిప్రింటర్ కార్యాలయానికి చేర్చి,అది వ్రేళ్ళు మధ్య సుతారంగా అక్షరాలు పేర్చబడి,లెడ్ పేట్లు మీదనుండి పత్రిక అచ్చులో వచ్చి, తిరిగి బస్ ద్వారా నో, రైలు ద్వారా నో ఏజెంట్ వయా ప్రజలకు పత్రిక చేరేది. మూడు సెంటీమీటర్ల వార్త స్కేలు తో కొలిచి సెంటీమీటర్ కు పావలానో,అర్థనానో జర్నలిస్టు కు ఇచ్చేవారు. కానీ,మూడు సెంటీ మీటర్ల వార్త రెవెన్యూ అవినీతిది అయితే తాసీల్ధార్, పోలీస్ స్టేషన్ ది అయితే సభ్ ఇన్స్పెక్టర్ వణికి పోయో వారు.సంపాదన కూడు,గుడ్డకు లేకపోయినా జర్నలిస్టు అనే పదానికి ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు.నిజాయితీకి నిలువెత్తు దర్పణంగా నిలబడే వారు.పత్రికా యాజమాన్యాలు  కూడా అవసరం అయితే మూత వేసుకునేవారు కాని వక్రమార్గం వెతకలేదు.”

మాయాదర్పణం-3.   

thirumal rao (1)
ఎన్.తిర్మల్
(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త)
సెల్:9441864514.
ఇమెయిల్:Thirumala.1960@gmail.com

మాయా దర్పణం కట్టుకథలకి-పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు పత్రికలు అన్నాడు ఓ పెద్దమనిషి! కానీ,నేడు ఆ వర్ణన ఒకింత తక్కువే అనిపిస్తుంది.ఒకనాడు సామాజిక దర్పణంగా ఉన్న జర్నలిజం ఈరోజు మాయా దర్పణంగా ఎందుకు మారింది.సవ్యంగా ఉండాల్సిన దర్పణం కాస్తా అసాధారణంగా సాగి నిజరూప ప్రతిబింబాలు బదులు సాగతీత ముఖారవిందాలతో పాటు, ,అష్టావక్ర భాష్యాలు ప్రదర్శించే  చిత్ర,విచిత్ర ప్రతిబింబం దర్పణంగా ఎలా మారింది? ఈ మాయా దర్పణం మతలాబు ఏమిటి? అన్ని ప్రశ్నలే కనపడతాయి కానీ, జవాబులు దొరకడం చాలా కష్టం! మాయా ప్రపంచంలో మాయా దర్పణాలు ఉండక మాయాబజార్ సత్యపీఠాలు ఏమైనా ఉంటాయా? ఉండుగాక ఉండవు. కాకుంటే,అప్పుడప్పుడు అద్దం కూడా తిరగబడ్డప్పుడు అలాంటి సందర్భాలు ఒకటి ,అర వస్తుంటాయి.

ఇక విషయం లోకి వెళితే ఓ పాతిక ఏళ్ళు వెనక్కి చూస్తే అప్పట్లో ఈ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు లేక ముందు ,అంటే ప్రైవేటీకరణ, సరళీకరణ,ప్రపంచీకరణ అనబడే మార్పులు రాకముందు రేడియో, టెలివిజన్, పత్రికలే సమాచారం వాహక కర్తలు.వాటిలో వార్త ప్రసారం అయితే నూటికి నూరు పాళ్ళు సామాజిక దర్పణంగా భావించే కాలం.ప్రభుత్వాలు రేడియో, టెలివిజన్ కేంద్రాలు నడిపేది.ప్రైవేటు యాజమాన్యాలు ద్వారా పత్రికలు నడిచాయి .ఆ పత్రికలు అమ్మకాలు,కొనుగోళ్ళు, చిన్నచిన్న వ్యాపార ప్రకటనలపై ఆధారపడి నాటి పత్రికల నిర్వాహణలో సచ్చీలత పాళ్ళు ఎక్కువగా కనిపించేది. దిగువస్థాయి నుండి యాజమాన్యం వరకు ఏదైనా తప్పు జరిగితే చర్యలు అదే స్థాయిలో ఉండేవి.ప్రజాసమస్యలు వెలికితీత, ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజలకు చేరవేస్తూ అనుసంధానంగా జర్న లిజం ఉండేది.

ఒక మూడు సెంటీమీటర్ల వార్త కోసం స్థానిక గ్రామీణ విలేకరి గంటల తరబడి సమయం వేచి చూసి,వార్త సేకరించి,అందంగా రాసి,ఏ ఆర్టీసి బస్ ద్వారా నో టెలిప్రింటర్ కార్యాలయానికి చేర్చి,అది వ్రేళ్ళు మధ్య సుతారంగా అక్షరాలు పేర్చబడి,లెడ్ పేట్లు మీదనుండి పత్రిక అచ్చులో వచ్చి, తిరిగి బస్ ద్వారా నో, రైలు ద్వారా నో ఏజెంట్ వయా ప్రజలకు పత్రిక చేరేది. మూడు సెంటీమీటర్ల వార్త స్కేలు తో కొలిచి సెంటీమీటర్ కు పావలానో,అర్థనానో జర్నలిస్టు కు ఇచ్చేవారు. కానీ,మూడు సెంటీ మీటర్ల వార్త రెవెన్యూ అవినీతిది అయితే తాసీల్ధార్, పోలీస్ స్టేషన్ ది అయితే సభ్ ఇన్స్పెక్టర్ వణికి పోయో వారు.సంపాదన కూడు,గుడ్డకు లేకపోయినా జర్నలిస్టు అనే పదానికి ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు.నిజాయితీకి నిలువెత్తు దర్పణంగా నిలబడే వారు.పత్రికా యాజమాన్యాలు  కూడా అవసరం అయితే మూత వేసుకునేవారు కాని వక్రమార్గం వెతకలేదు. అలా మూతపడ్డవే, ఆంధ్రపత్రిక,ఉదయం లాంటి పత్రికలు.

అలాంటి స్థితి మిలీనియం మార్పుతో విజన్  మారిపోయింది. పత్రిక మజిలీలో వచ్చిన ఆధునిక మార్పులు మీడియాను వేగవంతం చేశాయి.సాంకేతికత పనిని సరళీకరించింది.సామాజిక దర్పణం ఉండాల్సిన మీడియా అప్పనంగా పాలకవర్గం చంకలో ఊతకర్రలుగా మారిపోయాయి.పెట్టుబడులు-కట్టుకథలుగా మారిపోయాయి.రాజకీయాలు-యాజమాన్యాలు మధ్య సరిహద్దు రేఖలు పెరిగిపోయాయి.జర్నలిజం అనే పదం అర్థం మార్చుకుంది.తాను తొడుక్కున్న రంగుచొక్కానే తన ఎజెండాగా మారిపోయింది.వార్తను వార్తగా వ్యక్తీకరణ చేయాల్సిన జర్నలిజం పక్షపాతం అనబడే ఓ పక్షవాతం అనే జబ్బుకు గురైంది. వార్తను వార్తగా కాక ఇష్టంలేనిదైతే నాలుగైదు వాక్యాలతో ఓ మూలన చోటు కల్పించడం,కాకుంటే అసలు గయాబ్ చేయడం, తమ కిష్టమైనరైతే వార్తలో పసలేకపోయినా పావు పేజీకి పెట్టడం,పెద్ద పెద్ద హెడ్డింగ్లతో ప్రదర్శించడం,ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా అయితే బ్రేకింగ్, స్కోరింగ్,పదేపదే విసుగు పుట్టేలా ఊదర గొట్టడం మామూలై పోయింది.చర్చలైతే వేరు ,ఏదో ఒక సమస్య ఉంటుంది.ఏ ఛానల్ కు ఆ ఛానల్ తాము మద్దతిచ్చే పార్టీకి దగ్గర గా ఉన్న నల్గురు అధికార ప్రతినిధులను పిలిచి ,ఇక యాంకర్ జర్నలిస్టు విలువలు కంటే అనుకున్న దాని చుట్టే చిలువలు-పలువలు సృష్టించి చర్చలు నడుపుతుంటారు.ఇక్కడ సీనియర్ జర్నలిస్టులనబడే వారు నిస్సిగ్గుగా కనీసం విలువలకు పాతరేసి తమ యాజమన్య స్వామి భక్తికి సేవ చేస్తారు.ఇక్కడ ప్రజాసమస్యలు చర్చించడం వెనుక ప్రక్కదారి పట్టించగల నేర్పరితనం,తెంపరితనమే జర్నలిజం అయి ఊరేగుతుంది.

మరో విషయం మీడియా విశ్లేషణ అర్థాలు మారిపోయాయి.గతంలో మూలార్థం చెడిపోకుండా విశ్లేషణలో జర్నలిజం విలువలు కాపాడుకుంటే, ప్రస్తుతం జర్నలిజం అంటే తాము కాపుకాచే రాజకీయ పక్షానికి అనుకూలంగా కొన్ని నిజాలు,మరికొన్ని అబద్ధాలు వండి వార్చుతున్నారు.న్యూట్రాలిటీ, తటస్థీకరణ అనే మాటలు అర్థం జర్నలిజం రుచి,వాసనలో లేకుండా పోయింది.ఇక పరిశోధనాత్మక జర్నలిజం అర్థమే అపహాస్యం అయ్యింది. తామెంచుకున్న ఎదుటి పక్షం లొసుగులు,లోపాలు బయటకు తీసి రంధ్రాన్వేషణ చేయడం, తాము సమర్థించే పక్షం వైపు ఏనుగు పెట్టే కంతలున్నా వదిలివేయడం రివాజుగా మారింది.అంటే ఏకపక్ష జర్నలిజం వైపు పునాదులు వేసుకుంటున్నారు.ఇక ఇంతే కాదు,ఇటీవల తాము సమర్థించే రాజకీయ పక్షాలను భుజాన వేసుకొని పార్టీపై ఈగ వాలినా రాద్దాంతం చేసేలా జర్నలిజం తయారైంది.ఇప్పటికీ పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా కాక పుట్టించే జర్నలిస్టులు లేరని నేను చెప్పడంలేదు.ఎందుకంటే ఇప్పుడు వారి సంఖ్య మీడియాలో వ్రేళ్ళు మీద లెక్కించగలిగిన సంఖ్య మాత్రమే!

ఇక ఇప్పుడు చాలా పత్రికలు ఆయా రాజకీయ పక్షాల కరపత్రాలు గా, మీడియా ఆయా పక్షాల మౌత్ పీస్ లస్థాయికి దిగజారాయి.ప్రభుత్వాలు కూడా ఆయా దినపత్రికలకు ఇచ్చే ప్రకటనలు రూపంలో చాలా భాగం పత్రికలను నియంత్రణ చేస్తుంటాయి.ఆ ప్రకటనలు లేనిదే ఆయా పత్రికల ఆర్థిక స్థితి పోయ్యిలో లేవని పిల్లిలాంటిది.మరికొన్ని మీడియా సంస్థలు యాజమాన్యాలు సమాంతరంగా వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకుంటారు.పత్రిక ద్వారా వచ్చిన లబ్ధిని పారిశ్రామిక, వ్యాపార సామ్రాజ్యం విస్తరణకు,తాము కూడగట్టుకున్న అక్రమార్జన జోలికి రాకుండా జర్నలిజం అంతర్భాగంగా కాపాడుకుంటారు.యాజమాన్యం సేవలో పొట్టకూటి కోసం జర్నలిస్టులు ఏ చెత్తనైనా నెత్తినెట్టుకు మోయాల్సిన దుస్థితి వచ్చింది.పైగా ఎవరికి వారు తాము చెప్పిందే వేదం అన్నా చందంగా తమదే అసలైన జర్నలిజం అనుకుంటారు.జర్నలిజానికి సరికొత్త అర్థాలు, నిర్వచనాలు వెతుకుతున్నారు.ఇప్పుడు జర్నలిజానికి పట్టిన రాజకీయ మాయా తెగులు.ఫలితం పాలకపక్షం, ప్రతిపక్షం డైవర్షన్ పాలిటిక్స్ కు మీడియా నే ఇప్పుడు వేదిక.

రాజకీయ పక్షాలు -మీడియా మధ్య అక్రమ సంబంధాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి.గతంలో ఒక చానల్, పత్రిక అల్లిన కధనం జోలికి ఇతర పత్రికలు, మీడియా వెళ్ళాక పోవడం అనేది ఓ సాంప్రదాయక నిబంధన గా ఉంది.అయితే ఏబియన్ ఆంధ్రజ్యోతి లో “కొత్త పలుకు”శీర్షిక ద్వారా ఒక సరికొత్త సాంప్రదాయం కు తెరతీశారు.ఎన్టీవి లో ప్రసారం అయిన ఓ కధనాన్ని ఉటంకించి  “బొగ్గు టెండర్ కోసం నీచకధనం”పేరుతో ఓ సంచలనాత్మక పరిశోధక కధనం రాశారు.అది ప్రస్థుత అధికారపక్షానికి ఓ కుదుపు కుదపడంతో పాటు నైనీ బొగ్గు గనుల టెండర్లలో అక్రమాలతో పాటు, కోట్లాది రూపాయల టెండర్ల రద్దుకు దారితీసింది. ఏది ఏమైనా గుంభనంగా లోపల రాజకీయ చదరంగం ఆడుతున్న మీడియాలో ఎప్పుడో ఒకనాడు ఇలాంటి కధనాలు, సన్నివేశాలు ఊహించినవే! అవి ఉరుము ఉరిమి ఏ మంగళం మీద పడతాయో వేచి చూడాలి.ఎంత మందం పొరలతో దాచుకున్న మీడియా మాయా దర్పణం బళ్ళున పగిలి అద్దం పెంకుల్లో మళ్ళీమన నిజరూపం ఏదో ఒకరోజు చూసుకొనక తప్పని స్థితి ఒకటి వస్తుంది.వక్రీకరణకు గురౌతున్న జర్నలిజం ఏదైనా ప్రజలకు దూరంగా జరిగేదే! సత్యానికి-అసత్యానికి మధ్య సరిహద్దు రేఖలు చెరిపేసేదే!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *