మూసీ మురుగులో మున‌క‌లేస్తున్న రాజ‌కీయం..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మూసీన‌ది పునరుద్ధ‌ర‌ణ అంశంపై విప‌క్షాల‌కు, ప్రభుత్వానికి మ‌ధ్య ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌ల ప‌ర్వం ప‌తాక‌స్థాయిలో జ‌రుగుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌రుగనున్న నేప‌థ్యంలో విప‌క్షాల‌కు మూసీ పున‌రుద్ధ‌ర‌ణ ప్రాజెక్టు పెద్ద అస్త్రంగా మారింది. ఇందులో భాగంగానే బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా ప్ర‌భుత్వం 1.5ల‌క్ష‌ల ఇళ్ల‌ను ఈ ప్రాజెక్టుకింద కూల‌గొ ట్ట‌బోతున్న‌ద‌ని ఆరోపించ‌డం, వివాదానికి మ‌రింత ఆజ్యం పోసే ప్ర‌క్రియేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ ప్రాజెక్టు కింద బ‌ఫ‌ర్ జోన్‌, రివ‌ర్ బెడ్‌లో ఉన్న  దాదాపు ప‌దివేల రెండువంద‌ల ఇళ్ల‌ను  తొల‌గించాల్సి వొస్తుంద‌ని ప్ర‌భుత్వం గుర్తించింది. అంతే త‌ప్ప‌1.5ల‌క్ష‌లు కాదు. అయితే ఈ ప‌దివేల ఇళ్లు ప్రాజెక్టు తొలిద‌శ‌లో చేప‌ట్టే 21 కిలోమీట‌ర్ల ప‌రిధిలోన‌న్న‌ది గుర్తుంచుకోవాలి. మొత్తం ప్రాజెక్టు సుమారు 57 కిలోమీట‌ర్ల మేర న‌దీ తీర‌ప్రాంతంలో విస్త‌రించిఉంది . మొత్తం 14 మండ‌లాలు దీని ప‌రిధిలోకి వొస్తున్నాయి. మ‌రి కేటీఆర్ ఏ లెక్క‌న ఏకంగా ఇన్ని ఇళ్లు కూల్చే అవ‌కాశ‌ముంద‌ని ఆరోపించార‌న్న‌ది తెలియాల్సి ఉంది .

    అయితే తొలిద‌శ రివ‌ర్‌బెడ్‌, బ‌ఫ‌ర్‌జోన్‌ల‌లో తొల‌గింపున‌కు గుర‌య్యే నిరుపేద‌ల ఇళ్ల విష‌యంలో ప్ర‌భుత్వం మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌న్న‌మాట వాస్త‌వం. ఎందుకంటే ప‌ట్టాలు లేనివారికి ఇందిర‌మ్మ ఇళ్లు (2బీహెచ్‌కే) కేటాయించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. అయితే ప‌ట్టాలున్న వారికి మాత్రం నిబంధ‌న‌ల మేర‌కు మార్కెట్ ధ‌ర‌ల‌కు అనుగుణంగా న‌ష్ట‌ప‌రిహారం చెల్లి స్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 10200 యూనిట్ల ఇందిర‌మ్మ యూనిట్ల‌ను ఈ ఇళ్ల కూల్చివేత‌ల‌కు గుర‌య్యే పేద‌ల‌కు కేటాయించిన‌ట్టు కూడా తెలుస్తున్నది . వీటిల్లో 2116 న‌దీగ‌ర్భంలో నిర్మించిన‌వి కాగా, 7850 బ‌ఫ‌ర్‌జోన్‌లో నిర్మించిన‌వి. కొన్ని ద‌శాబ్దాలుగా ఇక్క‌డ నివ‌సిస్తూ ఇంటిప‌న్నులు చెల్లిస్తున్నతాము ఒక్క‌సారిగా ఇక్క‌డినుంచి వెళ్లిపోవాలంటే ఇబ్బందిక‌ర‌మైన అంశ‌మే. కాక‌పోతే సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌దికి ఇరువైపుల 50 మీట‌ర్ల వ‌ర‌కు బ‌ఫ‌ర్‌జోన్ ఉండాల‌న్న‌ది నిబంధ‌న‌.
దీని ప్ర‌కారం ఈ ప్ర‌దేశంలో ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు. భ‌విష్య‌త్తులో వ‌ర‌ద ప్ర‌మాదాల‌ను దృష్టిలో ఉంచుకునే  ఈ నిబంధ‌నను రూపొందించారు. ఇప్పుడు మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్టు చేప‌ట్టిన ప్ర‌భుత్వానికి ఈ నిబంధ‌న క‌లిసొచ్చింది. న‌ష్ట‌ప‌రిహారం, నిరుపేద‌ల‌కు ఇళ్ల ప్ర‌త్యామ్నాయ ఇళ్ల కేటాయింపు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యామ్నాయ అపార్ట్ మెంట్‌లు లేదా రూ.80ల‌క్ష న‌ష్ట‌ప‌రిహారం చెల్లింపున‌కు ప్ర‌భుత్వం ముందుకు వొచ్చిన‌ప్ప‌టికీ, డీపీఆర్ లేదా పాల‌సీ నిర్ణ‌యాన్ని, ప్ర‌భావితుల‌తో చ‌ర్చించ‌కుండా అపార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించింద‌న్న‌ది ప్ర‌భుత్వంపై వొస్తున్న ఆరోప‌ణ‌లు.  నిబంధ‌న‌లు తెలియ‌ని సామాన్యులు, ఇప్ప‌టిదాకా కిమ్మ‌న‌కుండా ఒక్క‌సారిగా త‌మ‌ను ఇక్క‌డినుంచి త‌ర‌లించ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించ‌డం స‌హ‌జం. ఎందుకంటే ఇల్లు కోల్పోతున్న బాధ వారిది. ఇందుకు ప్ర‌భుత్వం త‌గిన ప‌ద్ధ‌తిలో బాధ్య‌త‌గా విడమ‌ర‌చి చెప్పాలి.
    స‌ర్వే పేరుతో అధికార్లు కూల్చివేత‌కు గుర‌య్యే ఇళ్ల మార్కింగ్ చేసుకుంటూ పోవడంతో స్థానికుల్లో ఆందోళ‌న‌, ప్ర‌భుత్వం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌య్యాయి. ఇది స‌హ‌జం కూడా. ఈ త‌ప్పిద‌మే విప‌క్షాల‌కు ప్ర‌ధాన అస్త్రంగా మారింది. తాము రూ.16800 కోట్ల‌తో చేప‌ట్టిన మూసీ ప్ర క్షాళ‌న ప‌థ‌కాన్ని, రేవంత్ ప్ర‌భుత్వం ఏకంగా రూ.1.5ల‌క్ష‌ల కోట్ల‌కు పెంచింద‌ని, ఇందులో అక్ర‌మాలు దాగి ఉన్నాయంటూ బీఆర్ ఎస్ నాయ‌కులు విమ‌ర్శించ‌డం మొద‌లుపెట్టారు. దీనికి ప్ర‌భుత్వం,  ప‌ట్ట‌ణాభివృద్ధికి చెందిన అధికార్లు ఇచ్చే స‌మాధానం ఈవిధంగా ఉంది . గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కేవ‌లం నీటి ప్ర‌క్షాళ‌న‌కు, ప్రాధాన్య‌మిచ్చి, 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ద్వారా నీటిని శుద్ధి చేసి, గోదావ‌రి జ‌లాల‌ను త‌ర‌లించ‌డం ద్వారా మూసీన‌దిని జీవ‌న‌దిగా మార్చాల‌ని ప్ర‌ణాళిక ర‌చించి అమ‌లు చేసింది. కానీ 2020నాటి వ‌ర‌ద‌ల‌ను గ‌మ‌నిస్తే మూసీ బీఆర్ ఎస్ ప్ర‌ణాళిక రాబోయే కాలంలో న‌ది వ‌ర‌ద‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి స‌రిపోదు. ఇందుకు న‌ది బ‌ఫ‌ర్‌జోన్‌ను కేంద్ర జ‌ల‌సంఘం నిబంధ‌న‌ల‌మేర‌కు విస్త‌రించాల్సిందే. దీనికి తోడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం, మూసీ న‌ది ప్రాంతాన్ని ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో అభివృద్ధిచేయాల‌ని త‌ల‌పోయ‌డం ప్రాజెక్టు ఖ‌ర్చు అమాంతం పెరిగిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణమ‌ని నిపుణులు, ప్ర‌భుత్వం వివ‌రిస్తున్నాయి.
న‌దికి ఇరువైపులా గోడ‌ను నిర్మించి వ‌ర‌ద‌ను నివారించ‌వొచ్చున‌ని బీఆర్ ఎస్ ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. బీజేపీ నాయ‌కుడు, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. కానీ ఉధృతంగా ఒకేసారి వొచ్చిప‌డే వ‌ర‌ద‌ను ఈ గోడ ఎంత‌వ‌ర‌కు త‌ట్టుకుంటుంద‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే! ఇన్ని వాదోప‌వాదాలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ 2024లో శంక‌ర్‌న‌గ‌ర్ ప్రాంతంలో సుమారు 163 ఇళ్ల య‌జ‌మాను ల‌ను డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్ల‌కు త‌ర‌లించి వాటిని తొల‌గించారు. అయితే బీజేపీ, బీఆర్ ఎస్ నాయ‌కులు ఈ చ‌ర్య‌ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఇళ్ళు క‌ట్టి ఇవ్వాల్సిన ప్ర‌భుత్వం కూల‌గొట్ట‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించ డ‌మే కాకుండా ఇక‌ముందు ఇళ్ల‌ను కూల‌గొడితే ఊరుకునేది లేద‌ని తెగేసి చెప్పారు. అప్ప‌టినుంచి ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ మూసీ ప్రాజెక్టుపై వివాదం ఎప్ప‌టిక‌ప్పుడు ముదురుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. ఇదిలాఉండగా  మధు పార్క్   అపార్ట్ మెంట్లు, త‌దిత‌ర గృహాలు  కూడా మూసీ బ‌ఫ‌ర్ జోన్ ప‌రిధిలోకి వొస్తాయ‌ని హెచ్ ఎండీఏ, మూపీ రివ‌ర్ ఫ్రంట్ కార్పొరేష‌న్ అధికార్లు మార్కింగ్ చేయ‌డాన్ని ఇక్క‌డి నివాసితులు తీవ్రంగా ప్ర‌తిఘ‌టించ‌డంతో వివాదం పేద‌ల ఇళ్ల ద‌గ్గ‌రినుంచి మ‌ధ్య‌త‌ర‌గ‌తి వైపు మ‌ళ్లింది. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కూడా న‌దీగ‌ర్భంలోని ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డంలో చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తోంది.  అపార్ట్ మెంట్ వాసులు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తుండటంతో వివాదం ఇప్ప‌టివ‌ర‌కు ఒక కొలిక్కి రాలేదు.
   ఇక బీఆర్ ఎస్‌, బీజేపీలు మూసీ దండి యాత్ర పేరుతో ర్యాలీలు నిర్వ‌హించి స‌మ‌స్య‌కు య‌ధాశ‌క్తి ఆజ్యం పోస్తున్నాయి. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో త‌మ ఉనికిని  కాపాడుకోవాల‌న్న తాప‌త్ర‌యం వాటిది. నిజానికి మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై అధికార‌, విప‌క్షాలు కూర్చొని చ‌ర్చించి, బాధితుల‌తో మాట్లాడి ఒక అభిప్రాయానికి వొచ్చిన త‌ర్వాత మాత్ర‌మే అభివృద్ధి ప‌నులు ప్రారంభించిన‌ట్ల‌యితే ఇంత‌టి గంద‌ర‌గోళం, వివాదం చోటుచేసుకునేది కాద‌న్న‌ది సుస్ప‌ష్టం. పార్టీలకు ఎవ‌రి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు వారికుంటాయి క‌నుక ఆ దిశ‌గానే అవి ముందుకెళుతున్నాయి త‌ప్ప‌, బాధితులైన నిరుపేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి స‌ముచిత న్యాయం చేయ‌డంపై దృష్టి పెట్ట‌డంలేదు. అదే సంప‌న్నులు, రాజ‌కీయ ప‌లుకుబ‌డి క‌లిగిన‌వారి భ‌వ‌నాల‌ను ఏ ప్ర‌భుత్వం కూల‌గొట్ట‌డానికి ముందుకు రాదు. నిస్స‌హాయులైన పేదలు, మ‌ధ్య‌త‌ర‌గ‌తివారిపైనే ప్ర‌భుత్వాలు త‌మ‌ ప్ర‌తాపం చూపుతాయ‌నేది చ‌రిత్ర చెబుతున్న స‌త్యం! అభివృద్ధి, ప్ర‌జ‌ల సెంటిమెంట్ రెండూ ప్ర‌ధాన‌మే క‌నుక‌, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని  అన్ని రాజ‌కీయ ప‌క్షాలు ఏకాభిప్రాయంతో ముందుకెళితేనే దీనికి ప‌రిష్కారం సాధ్యం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *