మా యింట్లో కవిత్వం!

-బమ్మిడి జగదీశ్వరరావు

“ప్రతి మనిషిలోనూ కవి వుంటాడు” అన్నాడు మాటల్లో కవి.

“కవిలో మామూలు మనిషి వుంటే మరింత బావుంటుంది” అన్నాన్నేను.

“సరే వెతుకుదాం” అన్నాడు కవి.

ఉపిరి శబ్దం వినిపించినంత నిశ్శబ్దం అయ్యింది మా యిల్లు.

“నేను నడక నేర్చుకున్నాకే పడిపోవడం తెలిసింది” అన్నాడు కవి.

“పడుతూ లేస్తున్నాకే మొకాలడ్డడం తెలిసింది” అన్నాను నేను.

“కుంటికాలాట బాగా ఆడడం వచ్చాక కాలు విరిగినా కష్టం కాలేదు” అన్నాడు మా పిల్లోడు.

“పోలీసులు పట్టుకున్నాకే, దొంగా పోలీసాట బోధపడింది” అన్నాడు మా బామ్మర్ది.

“గాడిదెక్కడం తెలిసాక కోర్టుమెట్లు యెక్కడం సులువయ్యింది” అన్నాడు మా మావయ్య.

“సంసారంలో పడ్డాకే సముద్రాన్ని యీదెయ్యడం తెలిసింది” అంది మా ఆవిడ.

“నా వోటు యెవరో వేశాకే ప్రజాస్వామ్యం విలువ తెలిసింది” అన్నాడు మా నాన్న.

“కులం లేదన్నప్పుడే అదెంత బలంగా వుందో తెలిసింది” అంది మా చెల్లెలు.

“జై శ్రీరామ్’ అని తన్ని చెప్పించినప్పుడే మన మతం యెంత గొప్పదో తెలిసింది” అన్నాడు మా తమ్ముడు.

కవులందరికీ అభినందనలు చెప్పి వెళ్ళిపోయాడు కవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *