ఇవాళ్టి దుఃఖం
రేపటికి మాసిపోవాల
అటకెక్కిన ఆనందం
ఒక్కో మెట్టు దిగి రావాల
గలుమ కాడికొచ్చిన కొత్త పొద్దు
తోరణాలు కట్టుకున్న
దర్వాజాను తాకుతూ
నట్టింట్లో నాట్యమాడాల
కొత్తదనపు కుతి తీరేదాకా
పొద్దు తిరుగుడు పువ్వోలె
ఇటునుంచి అటేపు
పెయ్యిని తిప్పుతూ వుండాల
చాప కింద నీరోలే
చీకట్లు అలుముకోకుండా
పసిగట్టి ఊడ్చి పారేయాల
జర్రంత హుషారుగానే
పనులు సక్కబెట్టుకోవాలి
బంగారానికి వనమ బెట్టినట్టు
పోరాటానికి పుటం బెట్టుకోవాల
మన మాగాణంలో
పిడికెడు మట్టి తొవ్వుకొని
గడ్డిపరకల పక్కనే
గడ్డపారల్ని నాటుకోవాల
ఊట చెలిమల్ని తడిమి
ఊపిర్లను ఊదుకోవాల
బంతికొట్టినట్టు బతుకుల్ని
సుబ్బరంగా దులుపుకోవాల
కొత్త బట్టల్లెక్క మనసులు
సుబ్బరంగా మెరవాలా
ఊగి సొలుగుతున్న పెయ్యినీ
నిటారుగా వెన్నుపూసపై నిలబెట్టుకోవాల
మంచు దుప్పట్ల మధ్య
చలి నెగళ్లు వేసుకున్నట్లు
ఆవరించిన చీకట్లను చీల్చుకొని
పోరు దారిలో దివిటీ లెక్క
వెలుగు పూలై పోవాల
కొత్త పొద్దులో
మనమే కోడై కూయాల…!
-డా. కటుకోఝ్వల రమేష్





