Take a fresh look at your lifestyle.

ప్రజలే చరిత్ర నిర్మాతలు

“కొరోనా మహామ్మారి విరుచుకపడి ప్రాణాలు కబళిస్తున్న వేళ దేశమంతా లాక్‌ ‌డౌన్‌ ‌విధించబడినపుడు మనమంతా ఇళ్ళ కే పరిమితమయ్యాము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రెక్కాడితే కాని డొక్కాడని వలస కూలీలు పనిదొరకక పస్తులతో దినమొక గండంగా గడుపుతూ ఆకలిదీర్చే ఆపన్నహస్తాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది.చివరకు గత్యంతరం లేక ముళ్ళే మూటసర్దుకొని ఉన్న ఊరును కన్నవారిని తలుచుకుంటూ మండుటెండళ్ళో వేల మైళ్ళ దూరం నడక యాత్ర సాగించారు. రహాదారులు రక్తసిక్తమై గుండెలను కదిలింప జేసాయి.ఈ సన్నివేశం స్వతంత్ర భారత చీకటి కోణాన్ని కళ్ళముందు సాక్షాత్కరింపజేసింది. దేశం వెలిగి పోతుందంటూ ప్రగల్భాలు పలికే పాలకుల డొల్లతనాన్ని బయట పెట్టింది.సంపద సృష్టికర్తల రెక్కలు ముడుచుకుంటే దేశ ప్రగతి రథచక్రం కదలకుండాఎట్లాపడకేస్తుందో కొరోనా మన అనుభవం లోకి తెచ్చింది.”

‘‘ఉదయం కాదనుకోవడం నిరాశ. ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ’’ అన్నాడు ప్రజాకవి కాళోజీ.ఆశ నిరాశలమధ్య కొట్టుమిట్టాడే సంఘర్షణా భరితమైన మానవ జీవితానికి అద్దం పట్టే మాటలివి.జీవితం వడ్డించిన విస్తరి లా ఉన్నవారికి నల్లేరు బండిపై నడకలా సాగవచ్చు.కాని జని నిష్ఠురమైన వ్యధాభరిత జీవితాలను పరికించినప్పుడు మా బతుకుల్లో వెలుగు నిండేదెప్పుడనే నిరాశ వాదం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుంది.130 కోట్ల జనాభా దాటిన మనదేశంలో సుమారుగా 15 కోట్లమంది వలస కూలీలు తాము పుట్టి పెరిగిన ప్రాంతాలను వదిలి దేశమంతటా చెల్లాచెదురుగా విసిరివేయపడ్డారు.కొరోనా మహామ్మారి విరుచుకపడి ప్రాణాలు కబళిస్తున్న వేళ దేశమంతా లాక్‌ ‌డౌన్‌ ‌విధించబడినపుడు మనమంతా ఇళ్ళ కే పరిమితమయ్యాము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రెక్కాడితే కాని డొక్కాడని వలస కూలీలు పనిదొరకక పస్తులతో దినమొక గండంగా గడుపుతూ ఆకలిదీర్చే ఆపన్నహస్తాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది.చివరకు గత్యంతరం లేక ముళ్ళే మూటసర్దుకొని ఉన్న ఊరును కన్నవారిని తలుచుకుంటూ మండుటెండళ్ళో వేల మైళ్ళ దూరం నడక యాత్ర సాగించారు.

రహాదారులు రక్తసిక్తమై గుండెలను కదిలింప జేసాయి.ఈ సన్నివేశం స్వతంత్ర భారత చీకటి కోణాన్ని కళ్ళముందు సాక్షాత్కరింపజేసింది. దేశం వెలిగి పోతుందంటూ ప్రగల్భాలు పలికే పాలకుల డొల్లతనాన్ని బయట పెట్టింది.సంపద సృష్టికర్తల రెక్కలు ముడుచుకుంటే దేశ ప్రగతి రథచక్రం కదల కుండా ఎట్లా పడకేస్తుందో కొరోనా మన అనుభవం లోకి తెచ్చింది.పాలకులు ప్రజలను పోషించలేరని ప్రపంచ గమన మంతా ప్రజల చెమట చుక్కలతోనే ముం దుకు సాగుతుందనే సార్వత్రిక సత్యం కళ్ళముందు కదలాడింది.కాలే కడుపుల్లో కాసిన్ని మెతుకులకై ఆరాటపడే కోట్లాది మనుషులున్న మన దేశంలో ఆకలిదీర్చే ప్రణాళికలు ఎంత పకడ్బందీగా అమలు చేయాలో కొరోనా నేర్పింది. కాని మన పాలకులు మాత్రం అభివృద్ధిని అంకెల రూపంలో గారడి చేసి చూపిస్తూ మన కళ్ళకు గంతలు కట్టేస్తున్నారు.ఇప్పటికి నాగరిక ప్రపంచంఆనవాళ్ళు తెలి యకుండా బతికే అధో జగతి మనుషులు ఎందరో ఉన్నారు.అలాగని నాగరికుల మధ్య బతికే మనుషుల జీవన స్థితిగతులు కూడా ప్రపంచం నివ్వెరపోయేలా ప్రదర్శించ బడినాయి. సంపన్న దేశాల నాయకులు మనదేశాన్ని సందర్శించి నప్పుడు మన దారిద్య్రం కనబడకుండా గోడలు కట్టి మేడలు మాత్రమే చూపించిన అపరాధ భావం పాలకుల్లో నెలకొంది. దాచేస్తే దాగని ఈ సత్యాన్ని గుప్పిట పట్టి గుంభనంగా కాలం నెట్టేయగలమనుకుంటే అంతకన్నా పొరపాటు మరోటుం డదు.నిప్పును కొంగులో కట్టుకొని నిశ్చింతగా నిద్రపోతానంటే కుదురుతుందా?.

మనిషికి చావు భయం కంటే ఆకలి భయమే పెద్దది.ఆకలిని జయించడానికి చావు నోట్లో తలదూర్చి డానికి వెరవని ధీరత్వం మనిషిది. అలాంటి ధీరత్వం కల్గిన మానవ శ్రమకు జవసత్వాలను కల్పించాల్సిన బాధ్యత మనపాలకులపైన ఉన్నది.లేనిచో వారి క్షుధాగ్ని పాలకుల పీఠాలను దహించి వేయగలదు. ఇటీవల గ్లోబల్‌ ‌హంగర్‌ ఇం‌డెక్స్ ‌ప్రపంచంలోని 116 దేశాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఆకలిని జయించిన దేశాల్లో (ఆకలి సూచి లో) మనం 101 వ స్థానం లో ఉండటం ,అందులో పాకిస్థాన్‌ ‌నేపాల్‌, ‌బంగ్లాదేశ్‌ ‌ల కంటె అధమ స్థానంలో ఉండటం కలవర పెడుతున్నది. ప్రపంచ ఆకలి లో నాలుగో వంతు మనదేశం లోనే ఉన్నట్లు సర్వేలు తెలుపు తున్నాయి ఈ దుర్బర స్థితి నుంచి బయట పడటానికి సామాజిక వంటశాలలు ఏర్పాటు చేసి ఆకలి నివారణ కు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఎప్పుడూ చచ్చే వాడికి ఏడ్చేదెవరన్నట్లుగా వ్యవహారిస్తున్న పాలకులు బాధితులను మరింత బాధల్లోకి నెట్టే చట్టాలకు రూపకల్పన చేస్తూ సంపన్నుల కొమ్ము కాస్తున్నారు. ఆ పరంపరలో వచ్చిన రైతు వ్యతిరేక సాగు చట్టాలపై పెల్లుబికిన అన్నదాత ఆక్రోశం ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. అనేక కష్ట నష్టాల కోర్చి,ప్రాణాలను త్యాగం చేసి సంవత్సరం పైగా చేసిన రైతన్నల శాంతియుత యద్ధ సంకల్పానికి లభించిన విజయం ఈ దేశంలో కొడి గడుతున్న ఉద్యమాలకు ఊపిరి పోసినట్లైంది.చుక్క నీరు దొరుకని మండుటెడారుల్లో సాగుతున్న పయనానికి అందివచ్చిన ఒయాసిస్‌ ‌లా ఉద్యమ దాహార్తిని తీర్చిన అపురూప సందర్భమిది. ఇట్లా ప్రజాస్వామ్యం లో ప్రజలే చరిత్ర నిర్మాతలనే సత్యాన్ని తెలియజేసి పాలకులను మేల్కొలిపే అరుదైన సందర్బాలు ఆవిష్కరించబడుతూనే ఉంటాయి.

– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి
9494789731

Leave a Reply