Take a fresh look at your lifestyle.

బ్యాలెట్‌ పేపర్‌ శకం ముగిసింది !

ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషీన్‌ ఇవీఎంలపై పలు సందర్భాల్లో విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవి ట్యాంపరింగ్‌ అవుతున్నాయని పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం కూడా పలు సందర్భాల్లో అనుమానాలు నివృత్తి చేసింది. టెక్నీషియన్ల సమక్షంలో వాటి పనితీరును ప్రదర్శించింది. 140కోట్ల జనాభా ఉన్న  భారత్‌లో ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ వల్ల ప్రజాస్వామ్యం బలపడిరదే తప్ప వెనకడగు వేయలేదు. గతంలో పదేళ్ల పాటు అధికారం  వెలగబెట్టిన కాంగ్రెస్‌ హయాంలో కూడా ఇవిఎంల ద్వారానే వోటింగ్‌ జరిగింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చింది. కానీ ఈ మధ్యే మోదీ  అధికారంలోకి రావడంతో ఈ అనుమానాలు కావాలని రేకెత్తిస్తున్నారు. మోదీ  పోటీచేసిన 2014లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్నది మరచిపోరాదు. 2019లో మాత్రమే మోదీ తన అధికారం ఉండగా మళ్లీ గెలుపొందారు. ఇవిఎంలపై ఇలా అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా కొందరు తమ సంకుచిత రాజకీయాలను ప్రదర్శించారు. అలాగే మళ్లీ బ్యాలెట్‌ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని కొందరు వితండవాదం చేస్తున్నారు. బ్యాలెట్‌ బాక్సులు ఎత్తుకెళ్లడం, ఇంకు పోయడాలు, దాడులు చేయడం, వాహనాలను దారిమళ్లించడం వంటి ఎన్నో సంఘటనలు చూశాం.

ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలి. ఇవిఎంలలో నమోదైన వోట్లన్నింటినీ వీవీప్యాట్‌ స్లిప్పులతో నూటికి నూరుశాతం సరిపోల్చిన తరువాతే విజేతలను నిర్ణయించాలంటూ దాఖలైన పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రెండురోజుల పాటు విచారణ జరిపి, సరిగ్గా తొలిదశ పోలింగ్‌ ముందురోజున తీర్పును రిజర్వు చేసిన ఇద్దరు న్యాయమూర్తులూ పదిరోజుల్లోనే దానిని ప్రకటించడం ద్వారా వారు ఈ కేసుకు ప్రాధాన్యానికి ఇచ్చి దేశ గౌరవాన్ని నిలిపారనే చెప్పాలి. అదే సందర్భంలో ఇలాంటి కేసులు వేసే వారికి కూడా హెచ్చరిక చేశారు. ఈవీఎంలవిూద నిరసన ప్రదర్శనలు, చర్చాకార్యక్రమాలు జరుగుతుండటం, ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి ప్రముఖులు లేఖలు రాయడం వంటి పరిణామాల నేపథ్యంలో పిటిషన్ల విచారణ, తీర్పు ప్రకటన త్వరితంగా రావడం అత్యవశ్యకమని సర్వోన్నత న్యాయస్థానం భావించి ఉంటుంది.

లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ‘ఈవీఎం`వీవీప్యాట్ల లెక్కింపు’నకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషీన్‌లలో పోలైన అన్ని వోట్లను మొత్తం వీవీప్యాట్ల స్లిప్పులతో అంటే స్లిప్పులతో సరిపోల్చాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. బ్యాలెట్‌ పద్ధతిలోనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది. వివి ప్యాట్ల లెక్కింపు అంటే ఓ రకంగా బ్యాలెట్‌ లెక్కింపు లాంటిదనే గుర్తించాలి. ఇవీఎంలతో వీవీప్యాట్‌ స్లిప్పులన్నింటినీ పోల్చి చూడాల్సిన పని లేదు. స్లిప్పులను తీసుకుని వోటరు మరో బాక్స్‌లో వేయాల్సిన అవసరం కూడా లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రొటోకాల్స్‌, సాంకేతికంగా ఈవీఎంల పనితీరు తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించి.. అధికారులను అడిగి అన్ని వివరాలను తెలుసుకున్నాకే ఈ తీర్పు చెప్తున్నామని న్యాయమూర్తులు ప్రకటించారు. ఇవీఎంలతో వీవీప్యాట్‌ స్లిప్పులను వందశాతం సరిపోల్చాలని వొచ్చిన పిటిషన్లు సరికాదని ధర్మాసనం తేల్చింది.

అయితే ఇవీఎంలలో ఎన్నికల గుర్తులను లోడ్‌ చేశాక ఆ యూనిట్‌ను సీల్‌ చేయాలి. అనంతరం వీటిని కంటైనర్లలో భద్రంగా పెట్టాలి. ఫలితాలు వెలువడిన కనీసం 45 రోజుల వరకు ఈవీఎంలతో పాటు, వీవీప్యాట్లను స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపర్చాలని ఇసిని ఆదేశించడం గమనార్హం. ఎన్నికల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తే, వాటిని తనిఖీ చేసుకోవొచ్చని కూడా సూచించింది. ఇవీఎంలలోని మైక్రోకంట్రోలర్‌లో బర్న్‌ చేసిన మెమొరీని ఈవీఎం తయారీదారులైన ఇంజినీర్ల సాయంతో అభ్యర్థులు ఈ తనిఖీలు నిర్వహించుకోవొచ్చన్న వెసులబాటును కూడా సుప్రీం ధర్మాసనం కల్పించింది. కంట్రోల్‌ యూనిట్‌లోని 5 శాతం ఈవీఎంలను, వీవీప్యాట్లను సరిపోల్చుకొని ఈ విధంగా తనిఖీ చేయించుకోవొచ్చని తెలిపింది. ఇలాంటి తీర్పుతో మన ప్రజాస్వామ్యం మరింత బలపడిరదనే చెప్పాలి. ఇవిఎంలతో కర్నాటక, తెలంగాణల్లో అధికారం దక్కించు కున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు ఇప్పుడు దీనికి సమాదానం చెప్పాలి. అక్కడా ట్యాంపరింగ్‌ జరిగిందని ఆరోపించాల్సి ఉంటుందా అన్నది చెప్పాలి. ఈవీఎం వ్యవస్థవిూద న్యాయమూర్తులు అపరిమిత విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పుల్లో ఏకాభిప్రాయాన్ని ప్రకటించడం మరీ విశేషం. పిటిషన్‌దారులు వెలిబుచ్చిన అన్ని అభ్యంతరాలు, అనుమానాలు, చేసుకున్న విన్నపాలు అన్నింటినీ కొట్టివేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయగం గమనార్హం. బ్యాలెట్‌ పేపర్‌ వాడిన రోజుల్లో దేశం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నది.  బూత్‌ల స్వాధీనం, బ్యాలెట్‌ పత్రాలను నాశనం చేయడం వంటివి చాలా జరిగాయి. ఈవీఎంలు వొచ్చిన తరువాత ఆ తరహా అక్రమాలకు పూర్తిగా తెరపడిరది. అంతమాత్రాన ఈవీఎంలను ఎంతమాత్రం అనుమానించకూడదని ఏవిూ లేదు. వాటిని ట్యాంపర్‌ చేయవొచ్చునన్న వాదనలు, ప్రదర్శనలు జరుగుతున్నప్పుడల్లా ఎన్నికల సంఘం ఖండిస్తూ వొస్తున్నది.

గుడ్డిగా ఒక వ్యవస్థను అనుమానించడం సరైనది కాదని న్యాయమూర్తులు అన్నారు. సాంకేతిక అంశాలను, నమోదైన డేటాను పరిశీలించిన తరువాత ఈవీఎంలపై అనుమానాలు సహేతుకమైనవి కావని నిర్దారణకు వొచ్చినట్టుగా న్యాయమూర్తులు ప్రకటించారు.  కొందరు స్వార్థపరశక్తులు ఈ దేశం సాధించిన విజయాలను తక్కువ చేయాలని చూస్తున్నారని, అభివృద్ధిని బలహీనపరచేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి ప్రయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని ఒక న్యాయమూర్తి ఆగ్రహించారు. 97కోట్ల మంది వోటర్లున్న దేశంలో నూరుశాతం పేపర్‌ స్లిప్పులను సరిపోల్చడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అనుమానాలు పక్కన పెట్టి, వాటిని నివృత్తి చేసుకోవాలన్న సుప్రీం ధర్మాసనం సూచనలు శిరోధార్యం.
-ప్రజాతంత్ర డెస్క్‌ 

Leave a Reply