Take a fresh look at your lifestyle.

రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కంకణం

  • ఆరెస్సెస్‌ ప్రణాళికను అమలు
  • కాంగ్రెస్‌పై మోదీ, అమిత్‌ షా విష ప్రచారం
  • బిడ్డ బెయిల్‌ కోసం బీజేపీతో కేసీఆర్‌ ఒప్పందం
  • రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్‌ గెలవాల్సిందే..
  • ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని, 2025లోగా రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. 1978లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీపీ మండల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిందని, బీపీ మండల్‌ కమిషన్‌ బీసీలకు 27శాతం ఇవ్వాలని సూచించిందని తెలిపారు. నాడు ఆరెస్సెస్‌ అనుకూల వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించాయని, సుప్రీమ్‌ కోర్టు కూడా మండల్‌ కమిషన్‌ నివేదికను సమర్థించిందని తెలిపారు. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా అమలు చేయాలని సూచించిందని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్‌ గాంధీకి ప్రజల నుంచి విజ్ఞప్తులు వొచ్చాయని తెలిపారు. బీసీ కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

కుల గణన ఎక్స్‌ రే లాంటిదని రాహుల్‌ స్పష్టం చేశారని రేవంత్‌ తెలిపారు. మరోవైపు దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తుందని, మోదీ, అమిత్‌ షా లకు ఆదానీ, అంబానీ తోడయ్యారని విమర్శించారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి దేశాన్ని రిజర్వేషన్‌ రహితంగా మార్చాలనే ఆలోచనతో దాడి చేస్తున్నారని మండిపడ్డారు. దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులపై, ఓబీసీలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తున్నారని తెలిపారు.  దేశం అత్యంత  ప్రమాదకర పరిస్థితులవైపు వేగంగా ప్రయాణిస్తుందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కుట్రలను తిప్పికొట్టేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌పై మోదీ, అమిత్‌ షా విష ప్రచారం చేస్తున్నారని, తాళి పుస్తెలు అమ్మేస్తారం టూ విచక్షణారహిత ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రధాని, కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, ఎవరి కష్టార్జితం వాళ్లదే..ఎవరి సంపాదన వారిదేనని, భార్య ఆస్తిని కూడా అనుమతి లేకుండా భర్త తీసుకోవడానికి హక్కు లేదని న్యాయస్థానాలు చెబుతున్నాయని, ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని వికృత రాజకీయ క్రీడకు వారు తెరలేపారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఆరెస్సెస్‌ మనువాద సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేయాలని చూస్తుందని ఆరోపించారు. ట్రిపుల్‌ తలాక్‌, 370 ఆర్టికల్‌, యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌, సిటిజన్‌ అమెండమెంట్‌ యాక్ట్‌ విషయంలో గత పది నెలలుగా ఆరెస్సెస్‌ విధానాలను అమలు చేసుకుంటూ వొస్తున్నారన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసి దళితులు, గిరిజనులు, ఓబీసీలను కార్పొరేట్ల ముందు కట్టు బానిసలుగా నిలబెట్టాలని చూస్తున్నారన్నారు. ఆనాటి ఈస్ట్‌ ఇండియా కంపెనీలా బీజేపీ వ్యవహరిస్తుందని విమర్శించారు.

బీసీ జనగణన చారిత్రక అవసరం..
జనాభా లెక్కిస్తేనే దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే వీలుంటుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయమని, పెంచుతామని మోదీ, అమిత్‌ షా ఎక్కడా మాట్లాడటం లేదని తెలిపారు. బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి మాత్రమే కాదు..లెఫ్ట్‌ భావజాలం అని చెప్పుకునే ఈటల కూడా ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వాళ్ల పార్టీ విధానమేంటో వారికి స్పష్టంగా తెలుసునని, అందుకే వారు మాట్లాడటంలేదన్నారు.  కేసీఆర్‌ కూడా ఈ విషయాన్నే ప్రస్తావించడం లేదని, అమెరికా నుంచి అమలాపురం వరకు..చంద్ర మండలం నుంచి చింతమడక వరకు  కేసీఆర్‌ అన్నీ మాట్లాడుతున్నాడని, కానీ బీజేపీ చేసే కుట్ర గురించి మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. గతంలోనే కేసీఆర్‌ రాజ్యాంగాన్ని రద్దు చేసి మార్చేయాలన్నారని గుర్తుచేశారు. రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ విధానంపై బీఆర్‌ఎస్‌ వైఖరేంటో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వంద రోజుల తమ ప్రభుత్వాన్ని దిగిపొమ్మంటూ కేసీఆర్‌ బస్సుయాత్ర చేస్తున్నాడని, రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోదీపై ఆయన కార్యాచరణ ఏమిటని ప్రశ్నించారు.

వారి టార్గెట్‌ వంద రోజుల తమ ప్రభుత్వమా..పదేళ్లు ప్రజలను మోసం చేస్తున్న మోదీపైనా..అంటూ రేవంత్‌ నిలదీశారు. బిడ్డ బెయిల్‌ కోసం కేసీఆర్‌ బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మల్కాజిగిరిలో బీజేపీ గెలుస్తుందని మేడ్చల్‌ బీఆరెస్‌ ఎమ్మెల్యే చెప్పడమే ఇందుకు నిదర్శనమని, నిజంగా బీజేపీతో వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీలో నుంచి సస్పెండ్‌ చేయాలని, బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ గెలుస్తుందని చెప్పిన ఎమ్మెల్యేను కేటీఆర్‌ సమర్థించడం దేనికి సూచన..అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఐదు పార్లమెంట్‌ స్థానాలను బీజేపీకి తాకట్టు పెట్టిందని మరోసారి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. గతంలో తనను ఎంపీగా ఓడిరచేందుకు 31 సమావేశాలు పెట్టిన కేటీఆర్‌…ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు కేవలం ఒక్క సమావేశం పెట్టారని అన్నారు. ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కేటీఆర్‌ మాట్లాడలేదని, కేసీఆర్‌, కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఈటల మాట్లాడటం లేదని, పైగా భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలని తనపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.  కమిట్‌మెంట్‌తో మాట్లాడుతుంటే తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

బీజేపీతో వారికి ఒప్పందం లేకపోతే తక్షణమే మేడ్చల్‌ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అమాయకంగానో, అత్యుత్సాహంతోనో మేడ్చల్‌ ఎమ్మెల్యే కుండ బద్దలు కొట్టారని, ఇక కేసీఆర్‌, కేటీఆర్‌ గుండు పగలగొట్టడమే మిగిలిందని, కేసీఆర్‌కు ఇంత అసహనం ఎందుకని, అధికారం లేకపోతే ఊపిరి ఆగిపోతుందా..అంటూ రేవంత్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి సాక్షిగా తాను మాట ఇస్తున్నానని, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్‌ గెలవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply