Take a fresh look at your lifestyle.

మళ్ళీ లాక్‌డౌన్‌ ‌తప్పదా …!

రెండేళ్ళుగా ప్రపంచాన్ని గడగడలాడించి, లక్షలాది మంది ప్రాణాలు తీసిన కొరోన మహమ్మారి ఇంకా అంతం కాకుండా ఇప్పుడు ఒమిక్రాన్‌ ‌పేరున మరో రూపాంతరంతో మానవాళిని మరింతగా భయపెడుతున్నది. కొరోనా తర్వాత డెల్టా వేరియంట్‌ ‌డేంజరస్‌ అన్నారు. కాని, దానికన్నా మోస్ట్ ‌డేంజరస్‌గా మారింది ఒమిక్రాన్‌. ‌కొరోనా, డెల్టా కన్నా అతి వేగంగా, అంటే ఆరురెట్ల సూపర్‌ ‌ఫాస్ట్ ‌వేగంతో ఇది విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు శాస్త్రజ్ఞులు. ఇప్పటికే ఇది ప్రపంచంలోని నలభై ఆరు దేశాలకు విస్తరించిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 941 మంది ఇప్పుడీ వ్యాధితో బాధపడుతున్నట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. ఈ వేరియంట్‌ ‌పుట్టిన దక్షిణాఫ్రికాలో 228 మంది, యుకెలో 246 మంది, జింబాబ్వేలో 50, యుఎస్‌లో 39 మంది ఒమిక్రాన్‌కు గురైనారు.

ఇదిప్పుడు ఇండియాకు చేరుకుంది. ముందుగా ఈ వ్యాధి బారిన పడిన ఇద్దరిని కర్నాటకలో గుర్తించిన ఒకటి రెండు రోజుల్లోనే దేశంలో 21 కేసులు వెలుగు చూశాయి. ప్రధానంగా రాజస్థాన్‌, ‌మహారాష్ట్ర, ఢిల్లీలో ఈ వైరస్‌ ‌ప్రబలినప్పటికీ దేశ వ్యాప్తంగా సత్వరమే విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నాయి. కాగా, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇందుకేమీ అతీతం కాదు. త్వరలోనే ఇక్కడ కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు. అందుకే వొచ్చే ఆరు వారాలు అత్యంత కీలకమని ముందస్తుగా హెచ్చరిస్తున్నారు తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ ‌జి. శ్రీనివాసరావు. దీనికోసం ఇప్పటి వరకు ప్రత్యేక టీకాలేవీ కనుగొనకలేక పోయినా, కొరోనా మందులే ఉపయోగ పడుతాయంటున్నారు. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు కొత్త రూపాలను సంతరించుకుంటున్న వైరస్‌లు ప్రపంచ జనాభాను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజల జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గడచిన రెండేళ్ళ కాలంగా సాధారణ పరిస్థితులు నెలకొనే ఆవకాశాలు లేకుండా పోతున్నాయి. నేటికీ స్కూళ్ళు, కళాశాలలకు తమ పిల్లలను పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.

ఎప్పటికప్పుడు మిన్ను విరిగి మీదపడ్డట్లు ఏదో ఆందోళనను కలిగిస్తున్నాయి. కొరోనా కారణంగా ఒక పక్క మరణాలు, మరో పక్క ఉపాధికి అవరోధం, వైద్య చికిత్సలతో ఆర్థికంగా, శారీరకంగా శుష్కించిన జీవితాలు ఇప్పటికీ కోలుకోలేక పోతున్నాయి. వ్యాక్సినేషన్‌ ‌ప్రభావంతో కొరోనాను కొంతవరకైనా దూరం చేసుకోగలుగుతున్నామనుకుంటున్న తరుణంలో టీకాకు కూడా లొంగనంటూ కొరోనా ఇటీవల కాలంలో మరింతగా విజృంభిస్తుంది. మళ్ళీ వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కరీంనగర్‌ ‌జిల్లాలో ఒకేసారి పలు కేసులు వెలుగు చూసిన నేపథ్యం ఆందోళనను రేకెత్తిస్తున్నది. ప్రైవేటు వైద్య కళాశాలలో ఏకంగా 43 మందికి వైరస్‌ ‌సోకడంతో అధికారులు, వైద్య సిబ్బందిని ఉలిక్కిపడేలా చేసింది. బీహారు, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగి పోతున్నది. మరణాల సంఖ్యకూడా పెరుగుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న ఆరు వారాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు డాక్టర్‌ ‌శ్రీనివాసరావు. ముఖ్యంగా జనవరి 15 తర్వాత రాష్ట్రంలో కోవిడ్‌ ‌కేసులు పెరిగే అవకాశాలు ఎక్కువా ఉన్నాయంటారాయన. ఇది ఫిబ్రవరి నాటికి మరింత తీవ్రతరంగా మారుతుందంటున్నారు. కాన్పూర్‌ ఐఐటి ప్రొఫెసర్‌ ‌మణీంద్ర అగర్వాల్‌ అద్యయనం కూడా అదే చెబుతున్నది.

జనవరి, ఫిబ్రవరీ అత్యంత కీలకమని చెబుతున్నారాయన. ప్రపంచ వ్యాప్తంగా తాజా కొరోనా కేసుల సంఖ్యను పరిశీలించినప్పుడు అమెరికా తర్వాత మన దేశంలోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు నమోదయిన విషయం గమనార్హం. ఈలాంటి పరిస్థితిలో దేశ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ ‌విధించడం తప్పదేమో అనిపిస్తున్నది. ఈ పెరుగుదలకు దేశంలో వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం మందకొడిగా సాగటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇప్పటికీ ఒక డోసు టీకా కూడా తీసుకోని వారు లక్షల్లో ఉన్నారు. చాలామంది స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడంతో ఈ పక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటికైనా అర్హులందరు రెండు డోసుల టీకా తప్పనిసరిగా తీసుకోవాలని సంబంధిత వైద్య అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేగాక ఎక్కువగా భయపెడుతున్న ఒమిక్రాన్‌ను దృష్టిలో పెట్టుకుని బూస్టర్‌ ‌డోసులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు పిల్లలకు టీకాలు వేసే అవసరాన్ని గుర్తించే విధంగా కేంద్రం వెంటనే స్పందించాలన్న విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.

Leave a Reply