అఖండ భారతంలోని కరాచీ నగరంలో జన్మించిన ఒక తెలుగు వ్యక్తి ముంబయి నగరానికి వచ్చి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవన నిర్మాణ రంగాన్ని ఒక మలుపు తిప్పుతాడనీ, భవన నిర్మాణ రంగంలో సరికొత్త ప్రయోగాలతో ప్రయోజనాలు కలిగిస్తాడనీ 1896లో ఎవరూ ఊహించి ఉండరు. పెంట నారాయణ 17 ఫిబ్రవరి, 1896 నాడు కరాచీ నగరంలో జన్మించారు. అంతో ఇంతో కలిగి ఉన్న కుటుంబమే..! ఉరళీ నుంచి 1917లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నారు. బాల్యం నుండే భవన నిర్మాణ రంగం పట్ల ఉన్న ఆసక్తితో 1918లో ముంబయిలో భవన నిర్మాణాల్ని మొదలుపెట్టారు.
తొలుత ఆనాటి సుప్రసిద్ధ భవన నిర్మాతలైన జయా లింగయ్యతో కలిసి పనిచేశారు. అప్పుడప్పుడే ముంబయిలో అభివృద్ధి చెందుతున్న బలార్డ్ పియర్ ప్రాంతంలో అనేక భవనాలను ఉత్కృష్టంగా నిర్మించారు. నేటికి బలార్డ్ పియర్‌లో ఉన్న ఆ పురాతన భవనాలు చెక్కుచెదరకుండా ఉండడమే కాకుండా పలు అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాలుగా, బ్యాంక్‌లుగా విలసిల్లుతున్నాయి. విశాలమైన రోడ్లు, భవనాల మధ్య కావాల్సినంత ఖాళీ స్థలాన్ని వదిలి ఆనాడు వారు నిర్మించిన భవనాలు ముంబయి నగరానికే వన్నెతెచ్చే విధంగా ఇప్పటికీ అలరారుతున్నాయి.
మిగతా భవన నిర్మాతలకు, పెంట నారాయణకు మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసం ఉంది. మిగతా భవన నిర్మాతలు సాంప్రదాయ పద్దతుల్లో నిర్మాణం కావిస్తే, నారాయణ మాత్రం ఆధునిక ప్రయోగాలకు కొత్త పీట వేసి సత్ఫలితాలు సాధించారు. అంతవరకు భవన నిర్మాణంలో ఇటుకలు ఉపయోగించేవారు. నారాయణ ఇటుకలకు బదులుగా సిమెంట్ బ్లాక్స్‌ను తయారు చేయించి ఉపయోగించారు. నారాయణ ఆధునిక ప్రయోగాల ఆలోచనకు జాయా లింగయ్య కూడా మద్దతు పలికేవాడు. ఇద్దరి ఆలోచనలు కలవడం వల్ల సరికొత్త ప్రయోగాలెన్నో చేయగలిగారు. తమ ప్రాజెక్ట్‌ల నుండి ఎక్కువ లాభం ఆశించడం కంటే నాణ్యతతో, సరికొత్త ఆధునిక సాంకేతికతతో భవనాలు నిర్మించాలనే ఆదర్శాన్ని పాటించేవారిద్దరు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గోడల్లో అలమారాలు (సెల్ఫ్ లు), కిటికీలు పరదాలతో, ఇనుప జాలీలతో నిర్మించే పద్దతిని నారాయణ ఆనాడే ప్రయోగాత్మకంగా చేపట్టి విజయం సాధించారు.
సిమెంట్, ఇసుకను ఉపయోగించి నిర్మించే పద్ధతికి అదనంగా స్టీల్‌ను ఉపయోగించి నిర్మాణరంగాన్ని ఒక మలుపు తిప్పారు. ఇనుప జాలీలతో పునాది నిర్మాణాలు బలపరిచే ‘రిఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్’ పద్ధతిని వారిద్దరూ తొలిసారి ఉపయోగించి సఫలీకృతులయ్యారు. వీరు చేస్తున్న పలు ప్రయోగాలు, రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ పద్దతి అప్పటి భవన నిర్మాతలకు రుచించలేదు. నాణ్యత పై సందేహాలు కూడా వ్యక్త పరిచారు. కానీ, ఆనాడు వారు ఉపయోగించిన పద్ధతే నేడు 21వ శతాబ్దంలో భారత భవన నిర్మాణరంగమంతా పాటిస్తున్నారంటే వారికి ఉన్న ముందు చూపుకు జోహార్ అనకతప్పదు. తరువాత జాయా లింగయ్య, పెంట నారాయణ ఇద్దరూ కలిసి ‘బాంబే కాంక్రీట్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ’ అనే సంస్థను స్థాపించారు. వీరిద్దరి ప్రతిభను గుర్తించిన అప్పటి కాంట్రాక్టర్లెందరో వీరి కంపెనీలో పెట్టుబడి పెట్టి భారీ లాభాలు ఆర్జించారు. నాణ్యతకు పెట్టింది పేరుగా వీరి కంపెనీ ప్రసిద్ధి చెందింది. అప్పట్లో వీరి కంపెనీ మెకంజీస్, గమన్ లాంటి విదేశీ కంపెనీలతో పోటీ పడే స్థాయికి ఎదిగింది.

అదే సమయంలో వీరికి వర్లీ ప్రాంతంలో ‘బాంబే డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (బి.డి.డి)’ భవనాల భారీ నిర్మాణ టెండర్ లభించింది. కోట్ల రూపాయల విలువ చేసే ఇలాంటి టెండర్లు ఆ కాలంలో కేవలం విదేశీ కంపెనీలకు మాత్రమే లభించేవి. కానీ, నారాయణ కంపెనీ చేస్తున్న ప్రయోగాలు, నాణ్యతను గమనించి ఈ టెండర్లు ఆయన కంపెనీకే కట్టబెట్టారు. బి.డి.డి భవన సముదాయాన్ని కొత్త టెక్నాలజీ ఉపయోగించి మూడు అంతస్తుల భవనాలుగా నిర్మించారు.
వర్లీలోని ఈ భవనాలు తెలుగు కేంద్రంగా పిలువబడుతున్నాయి. తెలుగువారు ఎక్కువ సంఖ్యలో నివసించేది ఈ బి.డి.డి భవనాల్లోనే..! ఇప్పటికి ఏ మాత్రం చెక్కుచెదరకుండా నిలబడి ఉన్న ఈ భవన సముదాయాల్లాంటివే ముంబయిలో మరో మూడు చోట్ల నిర్మించారు. భవనాల డిజైన్, నాణ్యత మీద అప్పటి ప్రత్యర్థులు కొందరు ఎన్నో సందేహాలు లేవనెత్తి వ్యతిరేకతను పెంచేందుకు ప్రయత్నించారు. పరోక్షంగా ఇబ్బందులకు గురిచేశారు. దాంతో అలాంటి భవన సముదాయాల నిర్మాణం ఆగిపోయింది. అలాంటి భవనాలే ముంబయిలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో నిర్మాణం జరిగుంటే ముంబయిలో మురికివాడలు ఉండేవి కావని పరిశీలకులు భావిస్తున్నారు.
తోటి కంట్రాక్టర్‌ల కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారాలతో నారాయణ విసిగిపోయారు. ముంబైలో నిర్మాణరంగం పట్ల ఆయనకు ఆసక్తి తగ్గిపోయింది. అదే సమయంలో, 1929 ప్రాంతంలో అహ్మద్‌నగర్, సంగమనేర్ నగరాలలో విద్యుచ్ఛక్తి సరఫరాను కల్పించే ప్రాజెక్టులను ముంబయి ప్రభుత్వం నారాయణకు చెందిన కంపెనీకి అప్పగించింది. అహ్మద్‌నగర్ చేరుకున్న నారాయణ అక్కడ ‘అహ్మద్‌నగర్ ఎలక్ట్రిక్ సప్లయి’ ‘సంగమనేర్ ఎలక్ట్రిక్ సప్లయి కంపెనీ’ అనే పేర్లతో కంపెనీలు స్థాపించారు. అంతేగాక, ముంబయిని శాశ్వతంగా వీడి అహ్మద్‌నగర్‌లోనే స్థిరపడ్డారు.
ఈ రెండు కంపెనీల వల్లే నేడు ఈ రెండు నగరాలు విద్యుద్దీకరణకు నోచుకున్నాయి. 1970-72 ప్రాంతంలో ఈ రెండు కంపెనీలను ప్రభుత్వం జాతీయం చేయడం వల్ల ఈ రెండు కంపెనీలు మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు ఆదీనంలోకి వెళ్ళిపోయాయి. 1952 నుండి 1980 వరకు అహ్మద్‌నగర్‌లో పలు ప్రభుత్వ కార్యాలయ భవనాలు, మిలిటరీ, ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రాజెక్టులెన్నో ఆయన పూర్తి చేశారు. 30 నవంబర్, 1980 నాడు అహ్మద్‌నగర్‌లోనే ఆయన అంతిమ శ్వాస వదిలారు.
– సంగెవేని రవీంద్ర
– 99871 45310





