“ఉద్యోగ, ఉపాధ్యాయులు మీ పార్టీకి సానుకూలంగా ఉండడం వల్లనే మీరు అధికారంలోకి రాగలిగారు. కానీ అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చక ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల విశ్వాసాన్ని కోల్పోతున్న క్రమంలో ఉద్యోగ జేఏసీ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తే, “ఉద్యోగులకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. నన్ను కోసినా డబ్బులు లేవు. దేశంలో నాకు అప్పులు ఎవరు ఇవ్వడం లేదు. నన్ను ఒక దొంగలాగా చూస్తున్నారు. నేను ఏ సంక్షేమ పథకాలు ఆపి ఉద్యోగులకు ఇమ్మంటారు అని” తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి, మీరు మాట్లాడాల్సిన మాటలు కావు. మీ హుందాతనానికి ఈ మాటలు సరైనవి కావు. మిమ్మల్ని కొత్తగా కోరికలు కోరడం లేదు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం.”

రిటైర్డ్ ఉపాధ్యాయులు
హనుమకొండ ఎస్.టి.ఓ. పెన్షనర్ల జేఏసీ జనరల్ సెక్రెటరీ
మొ : 9949937745
ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు భాగం. వారు సక్రమంగా పనిచేసినప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ నేపథ్యంలో త ఉద్యోగులకు సకాలంలో జీతభత్యాలు, డి. ఎ. కరువు భత్యం చెల్లించాల్సి ఉంటుంది. కానీ 2023 జూలై వరకు ప్రభుత్వం చెల్లించాల్సిన మూడు కరువు భత్యాలు వాయిదాలు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కలదు. గత ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డి. ఏ. లను తక్షణం చెల్లిస్తామని, జీతాలు, డీఏలు సకాలంలో చెల్లిస్తామని, హెల్త్ కార్డుల జారీ, వేసవిలోనే బదిలీలు చేపడతామని హామీలు ఇచ్చారు.
ధనిక రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా కేసీఆర్ ప్రభుత్వం మార్చడం వల్ల, తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయంగా రావలసినటువంటి వాటిని కూడా ఇవ్వకపోవడం వల్ల, కెసిఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మీరిచ్చిన హామీల పట్ల విశ్వాసంతో ప్రజలు కాంగ్రెస్‌కే అధికారాన్ని కట్టబెట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు మీ పార్టీకి సానుకూలంగా ఉండడం వల్లనే మీరు అధికారంలోకి రాగలిగారు. కానీ అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చక ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల విశ్వాసాన్ని కోల్పోతున్న క్రమంలో ఉద్యోగ జేఏసీ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తే, “ఉద్యోగులకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. నన్ను కోసినా డబ్బులు లేవు. దేశంలో నాకు అప్పులు ఎవరు ఇవ్వడం లేదు. నన్ను ఒక దొంగలాగా చూస్తున్నారు.
నేను ఏ సంక్షేమ పథకాలు ఆపి ఉద్యోగులకు ఇమ్మంటారు అని” తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి, మీరు మాట్లాడాల్సిన మాటలు కావు. మీ హుందాతనానికి ఈ మాటలు సరైనవి కావు. మిమ్మల్ని కొత్తగా కోరికలు కోరడం లేదు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. “మీరు అధికారంలోకి వస్తే మీరు చేస్తానన్న హామీలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి”. వాటిలో కేవలం ఒకే ఒక్క హామీ మాత్రమే నెరవేరింది. అది ఉద్యోగులకు ఒకటవ తారీఖున వేతనాలు చెల్లిస్తున్నారు. దానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కానీ మిగతా హామీల సంగతి ఏమిటి? బకాయి పడిన మూడు విడతల డీఏలను వెంటనే చెల్లిస్తామన్నారు. అదేవిధంగా పీఆర్సి రిపోర్టు తెప్పించుకొని, ఆరు నెలల లోపు పిఆర్సి సిఫార్సులను అమలు చేస్తామన్నారు. ఇంతవరకు ఇవి అమలు కాలేదు. 2023 జూలై వరకే పిఆర్సి గడువు అయిపోయినది. అయినప్పటికీ రిపోర్టు సబ్మిట్ చేయలేదు, దాన్ని అమలు చేసే దిశగా ఏమాత్రం మీరు చొరవ చూపడం లేదు.
ఇది ఉద్యోగులను వంచించడం కాదా? ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు దాటినా కూడా హెల్త్ కార్డ్స్ జారీ చేయకపోవడం ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం శ్రద్ధ లేదని ఈ విధంగా అనుకోవలసి వస్తుంది. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచారు. ఉద్యోగ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంపు మార్చి 2024 నుండి ప్రారంభమైంది. ఏటారాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు. 2024 మార్చి నుండి ఆగస్టు 2025 వరకు దాదాపుగా పదివేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు రావలసినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఈ.ఎల్. హాప్-పే లీవ్ ఇన్కాష్మెంట్ లీవ్స్, జిపిఎఫ్, టి.ఎస్.జి.ఎల్.ఐ, జిఐఎస్, పీఆర్సి ఏరియర్స్ మరియు సర్వీసులో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి సరెండర్ లీవ్స్ తదితర బిల్లుల మొత్తం రిటైర్ అయినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సి ఉన్నది.
ఒక్కొక్కరికి వారి హోదా, వారి సర్వీస్ ఆధారంగా వారు నిల్వ చేసుకున్న జిపిఎఫ్ ఆధారంగా ఒక్కొక్కరికి దాదాపుగా రూ.35 లక్షల నుండి రూ. 75 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉన్నాయి. ఈలెక్కన విశ్రాంత ఉద్యోగులకు దాదాపు రూ.5 వేల కోట్ల వరకూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంది. నిజానికి, రిటైరయ్యే ఉద్యోగులకు సంబంధించి 3-4 నెలల ముందుగానే వారికి అందాల్సిన బెనిఫిట్స్‌ను లెక్కగట్టి, పదవీ విరమణ పొందే సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలి. కానీ, రిటైరైన తర్వాత ఏళ్లు గడిచినా ప్రభుత్వాలు వాటిని అందించడం లేదు. ఇక, ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న వారి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వారికి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వరకూ బకాయిలు ఉన్నట్లు సమాచారం. వారికి దాదాపు 32 రకాల ప్రయోజనాల కింద చెల్లింపులు చేయాల్సి ఉన్నా చేయడం లేదు. జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తోందని, అయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. హెల్త్ కార్డు సమస్య కూడా కొలిక్కి రాలేదు. తమకు హక్కుగా అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం సమయానికి అందించడం లేదంటూ కొంత మంది కోర్టులను కూడా ఆశ్రయించారు. కోర్టులు కూడా పలు సూచనలు చేశాయి. అయినా ప్రయోజనం లేదు. ఈ సమస్యల పరిష్కారానికి నెలకు రూ.700 కోట్ల వరకూ బడ్జెట్ కేటాయిస్తామని ప్రభుత్వం పలు మార్లు హామీ ఇచ్చింది. కానీ, అమల్లో మాత్రం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కమిటీని నియమించింది. మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయినా ఇంతవరకూ సమస్యలు పరిష్కారం కాలేదు. వారి 63 డిమాండ్లలో ఆర్థికేతర అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారుల కమిటీ గతంలో చెప్పింది. కానీ, వాటిలో మొదట ఏ అంశాన్ని పరిష్కరించేదీ స్పష్టత ఇవ్వలేదు. కొద్ది కాలం కిందట ఉద్యోగులు ఆందోళనకు పిలుపు ఇచ్చినప్పుడు ఒక డీ.ఏ. చెల్లించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మార్చి 2024 నుండి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన పెన్షనర్లకు చెల్లించాల్సిన డి.ఏ. ఏరియర్స్ 28 నెలల పాటు నెలవారీ కిస్తీలుగా పడాలి కానీ ఇప్పటికీ మూడు కిస్తీలు, డి. ఎ. ఏరియర్స్ కూడా పడలేదు.ఇప్పటి వరకూ మరో డి.ఎ. పై అడుగు ముందుకు పడలేదు.
కోర్టు ఆదేశాలు
2024 మార్చి నుంచి 2025 ఆగస్టు వరకు పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్ల హోదాలో దాదాపు 1000 మంది వరకు రిటైర్ అయ్యారు. తమకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదంటూ వీరిలో 432 మంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు వీరిలో ఇప్పటి వరకు 232 మందికి బెనిఫిట్స్ అందాయి. దాంతో, కోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయలేదని తెలుపుతూ మరో 14 మంది మళ్లీ కోర్టును ఆశ్రయించారని రిటైరైన ఓ ఇన్‌స్పెక్టర్ చెప్పారు. రిటైర్ అయిన వారికి రావలసిన బెనిఫిట్స్ ను మీరు 18 నెలల కాలంగా చెల్లించకపోవడంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో విసుగుదల జనిస్తోంది.
2025 ఫిబ్రవరి వరకు రిటైర్ అయిన వారి బాధలు ఈవిధంగా ఉంటే ఇక మార్చి 2025 నుండి ఆగస్టు 2025 వరకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని మీరు కల్పించారు. వారికి గత ప్రభుత్వము పీ.ఆర్సీ.ఏరియర్స్ రిటైర్మెంట్ తర్వాత చెల్లిస్తామని ఇచ్చిన ఉత్తర్వులు మేరకు రిటైర్మెంట్ అయిన తర్వాత పీఆర్సీ ఏరియర్స్ 12 బిల్లులు ఒకేసారి సబ్మిట్ చేసినట్లయితే ఆ 12 బిల్లులు కూడా ఏక మొత్తంలో మార్చి 2024 నుండి మార్చి 2025 వరకు పడ్డాయి. కానీ తర్వాత ఏప్రిల్ 2025 నుండి జూలై వరకు పీ.ఆర్సీ. ఏరియర్స్ కూడా చెల్లించలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. గత జూన్లో ప్రకటించిన డి.ఏ. ఏరియర్స్ ను ఏప్రిల్ 2024 నుండి ఆగస్టు 2025 వరకు రిటైర్డ్ అయిన రిటైర్మెంట్ వారికి 28 వాయిదాలలో చెల్లించాల్సినటువంటి మూడు నెలల వాయిదాలను కూడా చెల్లించలేకపోతున్నారు. గత ఏప్రిల్ 2025 నుండి రిటైర్ అయినటువంటి వారికి కేవలం నెలవారి పెన్షన్ మాత్రమే చెల్లిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రిటైరయిన వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం.





