పసగాడ సన్యాసి

సాహిత్యాన్ని జానపదుల దరి చేర్చిన 

ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన తొలి సాహిత్యకారుడు పసగాడ సన్యాసి. పండితులకు మాత్రమే పరిమితమైన సంస్కృతభూయిష్ట తెలుగును కాదని జానపదులు హాయిగా పాడుకునే విధంగా ‘పదములు’ రాసిన సాహితీ సంపన్నుడు. విషయం పౌరాణికమే అయినా అది పామరులకు హృదయంలో నాటుకునే విధంగా చెప్పిండు. విజయనగరం జిల్లా దేవునూరు తాలూకా మరువాడ పురానికి చెందిన ఈయన ఒక కొత్త సాహితీ బాణీకి శ్రీకారం చుట్టిండు. వీటికి ‘హరిహరీ పదాలు’ అని నామకరణం చేసింది సాహితీ మర్మజ్ఞులు టేకుమళ్ల కామేశ్వరరావు. ఈ హరిహరీ పదాలు కళింగాంధ్రలో బాగా ప్రాచుర్యం. ఆ ప్రాంతానికే చెందిన పసగాడ సన్యాసి దాదాపు 200ల ఏండ్ల క్రితం జన్మించిండు. ఈయన ‘హరి హరీ నారాయణాది నారాయణ కరుణించి మమ్మేలు కమల లోచనుడా’’ అనే వరుసలో సీస పద్యాల మాదిరిగా జముకు వాయిద్యంపై పాడుకునేందుకు వీలుగా పదములు రాసిండు.
పసగాడ సన్యాసికి జానపద సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. పామరులు పాడుకునేందుకు వీలుగా సరళ సుబోధకంగా ఉండే భాషలో వచనములను ఒక ప్రత్యేకమైన ఛందస్సులో కూర్చి వాటికి శాశ్వతత్వాన్ని చేకూర్చినాడు. ఇది ఖండగతి, ద్విపదల సమ్మేళనమని తంగిరాల వెంకటసుబ్బారావు (తెలుగులో వీరగాథా కవిత్వం)లో పేర్కొన్నాడు. ఈ పద్ధతిలో సారంగధర చరిత్రము, శతకంఠ యుద్ధము (శతకంఠ రామాయణము), గంగా వివాహము అనే పద సాహిత్యం సృజించాడు. పద్మశాలి కులానికి చెందిన ముసలయ్య అచ్చమ్మల కుమారుడైన సన్యాసి 1856 (నళ సంవత్సరం)నాటికే ‘గంగా వివాహము’ అనే పదములను రాసిండు. ఈ గ్రంథంలో తాను అంతకు ముందు రాసిన సారంధర చరిత్రము, శతకంఠ రామాయణము అనే గ్రంథాలను గురించి పేర్కొన్నాడు. అంటే 1856 నాటికి మొత్తం మూడు పుస్తకాలు రాసిండు. బహుశా ఆయన 1825 ఆ ప్రాంతములో పుడితేగానీ ఇది సాధ్యము కాదు.
1893 నాటికి చనిపోయిండు. ఈయన గురించి తెలుగు సాహిత్య చరిత్రలో జానపద గేయ చరిత్రల్లో తప్ప మరెక్కడా రికార్డు చేయలేదు. స్కాంద పురాణములోని కథను తీసుకొని దానికి స్థానీయతను జోడించి గంగాదేవిని ఏలూరులోని జాలరి ఇంట్లో జన్మించినట్లు కథ అల్లి అలుపు సొలుపు లేకుండా పాడుకునేందుకు వీలుగా వచనములో రాసిండు. 1893లో ‘గంగా వివాహము’ అచ్చయ్యే నాటికే సన్యాసి చనిపోయిండు. ఆ పుస్తకంలో ఒక ప్రకటన ఇలా ఉన్నది. ‘‘ఈ గంగావివాహమను పుస్తకమును గ్రంథకర్తయగు పసగాడు సన్యాసి కుమారుడయిన రామన్న వల్ల సీరము చిన సంన్యాసి అధికారమును పొంది కలగర్ల సరయ్యగారి సహాయమున అచ్చువేయించి కాపీరైటును పొందియున్నాడు గనుక దీనిని మఱి యెవ్వరును అచ్చు వేయింపగూడదు. ఈ పుస్తకమును వలయువారు విశాఖపట్టణములో పుస్తకముల కొట్టుయజమానుడు కలగర్ల సరయ్యగారి పేర వ్రాయించి తెప్పించుకొనవచ్చును.’’ అని ఉన్నది. ఈ గ్రంథము విశాఖపట్టణములోని ఆర్ష ప్రెస్‌లో అచ్చయ్యింది.
ఇందులో ఏలూరు పురవర్ణనము, జాలరి దంపతులు శంకుదేవయ్య, చక్రమాంబ ప్రశంస. వారి తపస్సు, తపస్సును మెచ్చి శంకరుడు ఇచ్చిన వరము అన్నీ కథనము చేయబడ్డాయి. ఈ జాలరి దంపతుల పుత్రికయే గంగాదేవి. నారదుడు ఎరుక వేషములో వచ్చి శివుని గురించి చెప్పడం, శివుడు జంగము వేషము వేసుకొని వచ్చి గంగాదేవిని చూడడం కథకుడు రమ్యంగా వర్ణించాడు. శివ-పార్వతీ సంవాదం, గంగా-గౌరీ సవతుల పంచాయతీని కూడా ఇందులో వివరించిండు. ఈ కథలోనే గంగా-గౌరీల సవతుల పంచాయితీని కూడా చెప్పిండు. తన గురించి ‘గంగా వివాహము’లో ఇట్లా చెప్పుకున్నాడు.
“ఛప్పన్న దేశస్థ జననాయకులకెల్ల
పేరుమీరిన యట్టి బిరుదాంకితుండు…
…భాసిల్లు శ్రీపూసపాటి వంశాంశబోధి
రాకావిహారికైరవ బాంధుండు
రాణించు శ్రీవిజయ రామగజపతి మహా
రాజచంద్రుండేలు రాజ్యంబులోన…
పరగణాలను దేవుపల్లి తాలూకలో
దరిజేరి వెలుగొందు మరువాడ పురము
పాడిపంటలు భాగ్యంబులును గలిగి
దాణదర్మములచే దనరారుచుండుగా
ఆ పురంబునగులుగు నధిక సంపన్నుండు
కొమరు మార్కండేయ గోత్రోద్భవుండు
పద్మసాలె కులుండు పసగాడు ముసాలయ
అతని భార్య పేరు అచ్చమాంబ వెలది
ఆ దంపతుల తనయుఁడను నాదు నామంబు
సన్యాసి యని యిట్లు జగతి బరగెను గా
సకల కవులకు మ్రొక్కి సన్యాసియనువాడ
వేడ్క నీపాటగా వింప బూనితిని…
…ఈ కథా శృంగార మదియెట్టిదనిన’’ అంటూ కథను వివరించిండు.
ఈ వచనములో ఏలూరు పట్టణాన్ని రమ్యంగా వర్ణించిండు. అదిలా ఉన్నది.
‘‘గగనంబు పొడవుగ ఘనతమీరుచు నున్న
నేటయిన బంగారు కోటలును గలవు
మేలయిన బంగారు మేడ మిద్దెలు గలవు
కెంపుల ద్వారము లింపుగా గలవు
సౌవర్ణములునయిన సౌపానములు గలవు
విమల సుచిత్రములు వేదికలు గలవు
పవడం పుస్థంభముల్‌ పచ్చతోరణములుల
నేటయిన వజ్ర కవాటములు గలవు
చౌషష్టి విద్యలు చదివి చెప్పగ చాలు
ధరణి దేవతలు నా పురమందుగలరు
భీమ పరాక్రము ధాములై వర్తిల్లు
క్షత్రియోత్తమ కోటి చాలగా గలదు
నలకుబేరుల తోడ తులదూగునట్టి
వైశ్యోత్తములు గలరు వాసి మీరగను
నవధాన్య రాసులు వివరముగ పండించి
శోభిల్లు చున్నట్టి శూద్రులును గలరు
నవమన్మథుని కంటె నాడెంబుగను పట్టి
పురుష వర్ణములు నా పురమందుగలరు’’ అని ఏలూరు పురాన్ని వర్ణించాడు. గంగాదేవిని తెలుగువారి అదీ జాలరుల ఇంటి ఆడపడుచుగా పుట్టించి పెండ్లిచేసిన ఘనత సన్యాసికి దక్కుతుంది. గంగా వివాహముతో పాటు ఈయన రచన ‘శతకంఠ రామాయణము’ సైతం ప్రసిద్ధి.1856కు ముందు రాసినప్పటికీ పుస్తక రూపములో మొదటి సారిగా 1899లో ‘శతకంఠ రామాయణము’ అచ్చయ్యింది. ఈ పుస్తకం మదరాసులోని శ్రీరామ విలాస ముద్రాక్షరశాలలో కలగర్ల సరయ్య గారు ముద్రిపింపజేశారు.
దశకంఠుడిని చంపిన రామునిపై పగ తీర్చుకునేందుకు శతకంఠుడు తపమాచరించి బ్రహ్మచే వరములు పొందిండు. ‘‘నిస్సార బుద్ధిచే నెలతచే చావు, తను బొందకుండుగ తానడగుడాయె’’ అనేది ఆయన పొందిన వరము. కణ్వ మహర్షి పెంపుడు కూతురుని చెరబట్టినందుకు ఆయన స్త్రీచే మృతి చెందెదవు అని శపించాడు. వసిష్టోత్తర రామాయణము, బెంగాళీ రామాయణములో ఈ ‘శతకంఠ రామాయణ’ కథ ఉన్నట్లుగా బిరుదురాజు రామరాజు తన ఆంధ్ర గేయ వాఙ్మయ చరిత్ర (పే118:1958)లో పేర్కొన్నాడు. శతకంఠుని తల్లి చిత్రగంధి, వీరి నగరం సప్త సముద్రాల ఆవల ఉన్న ప్రతాప లంక. తల్లి బుద్దులు చెప్పినా పెడచెవిన పెట్టిన శతకంఠుడు ఆఖరికి యుద్ధంలో సీతాదేవి చేతిలో నిహతుడయ్యిండు. ఈ కథను వచనముల్లో రాసింది పసగాడ సన్యాసి. పాలివాడగు విభీషణుడు తన శతకంఠుడికి అంతిమ సంస్కారాలు చేస్తాడు. శతకంఠుడి కుమారుడు నీలకేతుని యుద్ధానంతరం రాముడు సింహాసనం అధిష్టింప చేస్తాడు. ఈ కథ యక్షగానాలు, ద్విపద రామాయాణాల్లో బాగానే ప్రసిద్ధి. ఈ రామాయణములో శతకంఠుడి గురించి ఇట్లా చెప్పిండు కవి.
“చిత్రగంధికిని విచిత్రంబుగా నేడు
జనన మొందు నటంచు జనియె సూర్యుండు
ఇనుడు చెప్పిన రీతి తన గర్భవాసమున
జనియించె శతకంఠుడను నిశాచరుడు
నూరు శిరములు యిన్యూరు చేతులు గలిగి
యినకోటి తేజుడై తనయుడుదయించె
అంతింతయనరాని సంతోష భరితుడై
తండ్రి ఆశ్రవసుండు తనివి మీరుచును…’’
ఈ కవి తన ‘గంగా వివాహము’ వచనములో పూసపాటి విజయరామ గజపతి గురించి పేర్కొన్నాడు. ఆయన 1844-1879 మధ్య కాలంలో విజయనగర రాజుగా పాలన చేసిండు. అట్లాగే తన రచన నళనామ సంవత్సరంలో చేసినట్టు చెప్పుకున్నాడు. నళ సంవత్సరము 1856లో వస్తుంది. ‘‘సన్యాసి కవి ప్రసిద్ధ జానపదగేయకర్త. సరళమైన భాషలో, చక్కని నడకతో అనేకములగు జానపదుల సామెతలతో కథా చిత్రణము చేయగల సమర్ధుడు. గ్రామీణులందు జరుగు కయ్యములు చూచిన కవి యగుటచే గంగాగౌరీ వివాదము నతి మనోహరముగా చిత్రింప గలిగినాడు’’
(బిరుదురాజు రామరాజు). ఇందులోని వచనము
‘‘తాత గాంగేయ మీ తల్లి గంగాదేవి
లోక పావని సకల లోకముల జనని
జీవకోటుల కెల్ల జీవనంబై పరగు
కల్మషంబులు లేని గంగాభవాని’’ని పేర్కొన్నాడు. నిజానికి ఈ వచనములు గంగావివాహం లోనివే! కానీ బిరుదురాజు గారు పొరపాటున ‘గంగా గౌరి వివాదము’ పేరిట మరో కృతి ఉన్నది అనే అర్థం స్ఫురింపజేసే విధంగా పేర్కొన్నాడు. నిజానికి ‘గంగా వివాహము’ వచనములు లోనే ‘గంగా`గౌరీ సంవాదము’ ఒక భాగంగా రికార్డయినది.
ఇట్లా దాదాపు 200ల ఏండ్ల క్రితం చదువుకున్న వారు చాలా స్వల్పం. అట్లాంటి కాలములో తాను స్వయంగా చదువుకొని కవిత్వము, అదీ జానపదులకు సులభంగా అర్థమయ్యే ఛందస్సులో చెప్పిన వాడు పసగాడ సన్యాసి. ఈయన గురించి ఇప్పటికైనా తెలుగు సాహిత్య చరిత్రలో రికార్డు చేయాల్సిన అవసరమున్నది. ఈయన సారంగధర చరిత్ర కూడా ముద్రితమయింది గానీ అది నాకు లభ్యం కాలేదు. మిగతా రెండు వచనములు ‘శతకంఠ రామాయణము’, ‘గంగా వివాహము’ రెండూ ప్రతులూ నా దగ్గర ఉన్నాయి. వీటిని పునర్ముద్రించినట్లయితే విస్మృత సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చినట్లవుతుంది. సాహిత్యం అందుబాటులో ఉంటే వాటిపై విశ్లేషణ, విమర్శ, పరిశోధన జరగడానికి దారులు ఏర్పడుతాయి.

-డా. సంగిశెట్టి శ్రీనివాస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *