వేడి రాజేస్తున్న వర్షాకాల సమావేశాలు ..!

రాజకీయాల్లో విధాన పరమైన స్పర్ధలు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ సమావేశంలో  అభిప్రాయపడినప్పటికీ బయట మాత్రం అధికార,విపక్షాల మధ్య అందుకు భిన్నమైన వాతావరణమే నెలకొంది.ఈ ఏడాది కాలంలో   బీహార్, అస్సాం, కేరళ, తమిళనాడు,వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల పునరేకీకరణకు తాజా ఎన్డీఏ, ఇండియా కూటముల ఎత్తుగడకు ఈ సమావేశాలు వేదికగా నిలిచాయి.ఈ సమావేశాలతో ఎవరు ఏ పక్షం అన్నది దేశ ప్రజానీకానికి స్పష్టత వచ్చింది.మరికొన్ని పక్షాలు రెండు శిబిరాలకూ దూరంగా ఉండి గోడమీద పిల్లిలా ఉండి పోయాయి. మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో షిండేలను పుట్టించి ప్రాంతీయ పార్టీల చీలికకు ఆజ్యం పోస్తూ ఆధిపత్యం కోసం చంకన చేరిన వర్గాలను అక్కున చేర్చుకోవడం ద్వారా ఎన్డీఏ కూటమి ప్రత్యర్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యూహాన్ని అమలు చేసింది. ఈ సమావేశాల్లో ఆర్థికపరమైన వ్యవహారాలతో కూడిన చర్చకు తావిచ్చిన ‘ఆపరేషన్ సింధూర్’ ప్రభుత్వ, విపక్ష వర్గాలను ఇరకాటంలో పడేసింది.ఎన్డీఏ కూటమి మోదీ బలంపై ఆధారపడి కదం తొక్కుతుంటే, ఇండియా కూటమి కూడబలుక్కొని అధికార పక్షాన్ని ఎండగడుతూ నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో ఓబీసీల రిజర్వేషన్ల బిల్లు అమలు చేయడమే ‘శ్రీరామ రక్ష’ అటువంటిది తొమ్మిదొవ షెడ్యూల్ లో చేర్చుతుందా? లేదా? ఎన్నికల ముందు రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం ఇండియా బిల్లుకోసం పట్టుపడితే పార్లమెంటు లో హోరాహోరీ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దేశాన్ని వానలు, వరదలు వణికిస్తున్న తరుణంలో మొదలవుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21,2025న అట్టహాసంగా ప్రారంబం అయ్యాయి.11ఏండ్లుగా ఎన్నో బిల్లులు తెచ్చి ఏకగ్రీవంగా పాస్ చేసుకున్న చరిత్ర కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తున్న బీజేపీకి ఉంది. అదే అనుభవంతో విపక్షాలను నిరంతరం ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నందున నిప్పుల కొలిమిలా మండుతున్నాయి. ఇప్పటికే విపక్షాలు ఇండియా  కూటమితో తలబడ్డప్పటికీ ఎన్డీఏ కూటమికి నితీష్,చంద్రబాబు సంజీవని గా మారారు. ఇద్దరు కూడా అనేక సందర్భాల్లో మోడీని వ్యతిరేకించి ఎదురుదెబ్బలు తిన్న వాండ్లే. ముందస్తూ వ్యూహంలో బతికి బట్టకట్టినా మోడీకి ఎప్పుడు అడ్డంకిగా మారినా ఆశ్చ్యర్యపడాల్సింది ఏమిలేదు.

వర్షాకాలం సమావేశాల్లో రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి అధికార, విపక్షాలు అన్నిరకాల ఎత్తుగడలూ ప్రయోగిస్తున్నాయి. లోక్సభలో బిల్లులు నెగ్గించుకోవడం ప్రభుత్వానికి నల్లేరుమీద నడక కాదు.అయినా, కొంత చెమటోడ్చాల్సి ఉంటుంది.అయితే ప్రస్తుతం తటస్థ పాత్ర పోషిస్తున్న పార్టీలు బిల్లులపై ఓటింగ్ జరిగేటప్పుడు గైర్హాజరైతే ప్రభుత్వానికి ఇబ్బందులు తొలగిపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని ఈడీ, సీబీఐ, గవర్నర్ వ్యవస్థలను ప్రయోగించడంపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు ధ్వజమెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీల నేతలకు కేంద్ర దర్యాప్తు సంస్థలు, గవర్నర్లు ఇబ్బందులు సృష్టిస్తుండటం ఆయా రాష్ట్రాల్లో వాటికి ఉక్కపోతగా మారింది.ఇలాంటి ఉదంతాలు అగ్నికి ఆజ్యంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

ఇప్పటిదాకా ప్రతిపక్షాలు వేర్వేరు అంశాలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంవల్ల వాటి ఆందోళనలు ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. తాజాగా విపక్షాలు ‘ఇండియా’ పేరిట కూటమిగా ఏర్పడి, ఒకే అజెండాతో ముందుకెళ్ళడం జీర్ణించుకోవడం లేదు. ఆపరేషన్ సింధూర్ పై పొంతన లేని సమాధానంతో కాంగ్రెస్ పై చెయ్యి సాధించిందనే భావించాలి, ప్రతీకారంగా ఎలాంటి వ్యూహంతో వ్యవహరిస్తాయన్నది వేచి చూడాలి. నయాన్నో భయాన్నో విపక్షాలకు ఎరా వేయడం మూలాన  పార్లమెంటులో ఒకేమాటపై నిలుస్తాయా లేదా అనే అంశాన్ని ప్రజలూ నిశితంగా గమనిస్తున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమికి ఏకైక బలం మోడీ ,అమితాషా లే. అలాగని విపక్షాల పరిస్థితి ఒక రాహుల్ మీదనే పెట్టడం లేదు. అందరు ప్రధాని అభ్యర్థులే.అయినా చర్చల సందర్భంగా అధికార పక్షం జవాబు చెప్పకుండా చేసే ఎదురుదాడిని రాహుల్ తనదైన శైలిలో ఎదుర్కొని ప్రజల మన్ననలు పొందుతున్నారు.లోక్సభలో కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే,సమాజ్వాదీ, జేడీయూల్లోనూ ఎక్కువమంది కొత్తగా పార్లమెంటు లోకి అడుగుపెట్టినవారే కావడం అధికార పక్షానికి కలిసి వస్తోంది.దక్షిణాదిన కర్ణాట,తెలంగాణ రాష్ట్రాల్లో గెలుపు ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యం ప్రదర్శిస్తున్నా,వామపక్షాల నుంచి ఉద్దండపిండాలు లేకపోవడం కొంత లోటుగా కనిపిస్తోంది.ప్రతిపక్షాలు అర్థవంతమైన చర్చల కన్నా ఆందోళనలకే అధిక ప్రాధాన్యం ఇస్తే, అధికారపక్షం ఆ గందరగోళం మధ్యే ముఖ్యమైన బిల్లులను ఆమోదింపజేసుకొని, సభలను వాయిదా వేసుకుంటూ సాగే అవకాశాలు లేకపోలేదు.

ఆపరేషన్ సింధూర్ అనూహ్యంగా ఆపేస్తారని ఎవరు ఊహించలేదు, ట్రంప్ మాటలు పక్కకు పెడితే దేశ ప్రజలకు వివరణ ఇచ్చివుంటే పార్లమెంట్ వేదికగా చర్చ జరిగేది కాదు.కాల్పుల విరమణ ఇద్దరి ఒప్పందంతో జరిగినప్పటికీ, భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తన మధ్యవర్తిత్వం కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చేసిన ప్రకటనతో  మోదీ  గ్రాఫ్ తగ్గిందనే భావించాలి. అందుకే పహల్గాం ఉగ్రదాడి వెనుక నిఘా వైఫల్యం,ట్రంప్ మధ్యవర్తిత్వ వ్యాఖ్యలు వంటి అంశాల ఆధారంగా  ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని విపక్షాలు ప్రయత్నించాయి. అమెరికా అధర్మనీతి మనకు ఒకచేదు అనుభవం.

ఈ చేదు అనుభవాన్ని ఛేదించడమే కర్తవ్యంగా ముందుకు సాగింది.72 గంటల పాటు జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ లో భారత్ పై చేయి సాధించామని కేంద్రం ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమ దృఢమైన వైఖరిని మరోసారి తెలియజేసింది. కారణం ఏదైనా కావచ్చు, భారత దేశాన్ని లక్ష్యంగా చేసుకునే శత్రువులకు, ఉగ్రవాదులకు ఇక ఇది ఏ మాత్రం స్వర్గధామం కాదని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. అయితే దేశ ప్రజల అనుమానం అంతా కూడా అకస్మాత్తుగా యుద్ధం ఆపేయడం ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు’ గా ఉంది కాబట్టే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది.విదేశాల నుండి భారత్ కు మద్దతు లభించకపోవడంపై మోదీ  సర్కారుపై రాహుల్,ఖర్గే మండి పడ్డారు.ఇదే అనుమానం సంఘ్ పరివార్ కు కూడా ఉండనే ప్రచారం జరిగింది. ఆపరేషన్ సింధూర్ కల్సి రాలేదనే చెప్పాలి. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఓబీసీల ఎజెండా ప్రధాన భూమిక పోషిస్తుంది.ఇంతకూ ఓబీసీ రిజర్వేషన్ల పై చర్చ జరుగుతుందా? ఆమోదంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ ఓబీసీల్లో మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *