- ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వెదురును ఉపయోగించాలి
- ఎకరం వెదురు పంటతో ఏటా రూ.లక్ష ఆదాయం..
- పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8 : మహిళల ఆదాయాన్ని పెంపొందించే దిశలో వెదురు సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలో ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా వెదురు సాగును ప్రోత్సహించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యాచరణతో వర్క్ షాప్ నిర్వహించారు. కాగా ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వీలైనంత మేర వెదురును వాడేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో తగినంత వెదురు, వెదురు వస్తువులు అందుబాటులో లేవు. అందుకే భారతదేశం చైనా నుంచి వెదురు వస్తువులను దిగుమతి చేసుకుంటోంది.
వొచ్చే నాలుగు సంవత్సరాల్లో కనీసం లక్ష మంది మహిళలను వెదురు సాగుకు ప్రోత్సహించాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ భావిస్తోంది. నాలుగు సంవత్సరాల్లో వెదురు పంట చేతికి వస్తుంది. 15 గుంటల్లో వెదురు సాగు చేసే ఆదిలాబాద్ కు చెందిన అన్ను బాయి అనే మహిళ ఏడాదికి 75 వేల ఆదాయాన్ని పొందుతుంది. 40 సంవత్సరాల పాటు ఎలాంటి ఢోకా లేకుండా వెదురు సాగు నుంచి ఆదాయం పొందొచ్చు. ఈనేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో వెదురు సాగును ప్రోత్సహించేందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో బుధవారం రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పంచాయతి రాజ్ అడిషనల్ కమిషనర్ షఫీ ఉల్లా, ఐటిడిఏ పీవోలు, డీఆర్‌డీవోలు హార్టికల్చర్, వ్యవసాయ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వెదురు తో తమకు పరిచయం ఉందని, కేవలం వస్తువుగా కాకుండా.. వెదురు విత్తనాలను వండుకొని తిన్న జాతుల నుంచి వచ్చామని చెప్పారు. బ్రిటిషర్లు వెదురును తరలించకపోతే ఆదివాసీలు ఎదురు తిరిగారని తెలిపారు. ప్రతిరోజు మనం ప్లాస్టిక్ వాడుతున్నాం.. దానివల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ప్లాస్టిక్ స్థానంలో వెదురు ను ఉపయోగించాలని, పర్యావరణహితులుగా మారాలని పిలుపునిచా్చరు. అటవీ భూముల్లో వెదురు మొక్కల సాగును కొనసాగించాలని, మూడు నాలుగు యేళ్లు ఓపిక పడితే పంట చేతికొస్తుందని, ఎకరం లోపు భూమిలోనే ఏడాదికి కనీసం లక్ష రూపాయలు సంపాదించవచ్చని చెప్పారు. వెదురు.. గ్రీన్ గోల్డ్ లాంటిది.. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్నిస్తోందని, వెదురు సాగుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఐటీడీఓ పిఓలు ఏజెన్సీ ప్రాంతాల్లో వెదురు సాగును ప్రోత్సహించాలి. వెదురు సాగులో ఉండే లాభాలను ప్రజలకు వివరించాలి. మహిళలు ఆర్థికంగా ఎదిగితే రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుతుంది.
ప్రతి ఇల్లు సుసంపన్నంగా ఎదగాలి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి స్కీం కింద మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు పనిచేస్తున్నాం అని మంత్రి సీతక్క అన్నారు. మొత్తం 17 రకాల వ్యాపారాలను గుర్తించామని, తాజాగా మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అదేవిధంగా వెదురు సాగు కోసం ఎన్నో ప్రోత్సాహాలు ఇస్తామని, విత్తనాల నుంచి సాగు వరకు అన్నీ ఉచితంగా ఇస్తున్నామని,ఉపాధి హామీ నిధులను కూడా వెదురు పంటకు వినియోగించుకోవచ్చని చెప్పారు. అటవీ సమీప గ్రామాలు, మారుమూల ప్రాంతాలు వెదురు సాగుకు అనుకూలంగా ఉన్నాయని, వెదురుతో వస్తులను తయారు చేసేందుకు ఆసక్తి గలవారికి శిక్షణ ఇస్తామని చెప్పారు. చెట్లను చూస్తే మురిసిపోతామని, నగర వాసులు ప్రకృతిని ఆస్వాదించాలని, సమయం దొరికినప్పుడు అడవి ప్రాంతాలను ఏజెన్సీ ఏరియాలను సందర్శించండి అని సూచించారు. అనంతరం వెదురు సాగు, ఉత్పత్తులు, మార్కెటింగ్ మెలుకులు నేర్పిస్తున్న ఇండస్ట్రీస్ ఫౌండేషన్ ప్రతినిధులను మంత్రి సీతక్క సన్మానించారు.
సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ మాట్లాడుతూ.. వెదురు గడ్డి జాతి మొక్క అని, ఎంత కట్ చేస్తే అంత ఎత్తుకు పెరుగుతుందన్నారు. దాన్ని నాశనం చేయడం చాలా కష్టమని, అందుకే వెదురు సాగుతో ఎన్నో లాభాలు గడించవచ్చని వివరించారు. ఉన్న భూమిలో కనీసం 20 గుంటల్లో వెదురు సాగు చేస్తే కుటుంబ ఆర్ధికంగా పరిపుష్టమవుతుందని, పోడు భూముల్లో కూడా వెదురు సాగు చేయాలని, వెదురు సాగుతో భూమికి భద్రత, కుటుంబానికి ఆర్థిక భరోసా అని వెల్లడించారు.



ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే