ఆర్థిక స్థితిపై చర్చ పట్ల విపక్షాల అసహనం

  • సమాచారం లేకుండా చర్చ పెట్టారని ఆక్షేపణ
  • విపక్షాల తీరుపై మండిపడ్డ మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వడంలేదని విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. శాసనసభ నడుపుతున్న తీరుపై విపక్షాలు ఆక్షేపించాయి. సమాచారం లేకుండా ఆర్థిక పరిస్థితిపై చర్చ పెట్టారని విమర్శించాయి. శాసనసభ నిబంధనల ప్రకారం సభ నిర్వహించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌.. స్పీకర్‌ దృష్టికి తెచ్చారు. శాసనసభ నడిపే తీరు ఇది కాదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. సభ్యులకు సమాచారం లేకుండా ఎలా మాట్లాడతారని బిజెపి పక్షనేత మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విపక్ష, అధికార సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి.. సభలో గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యుల విమర్శలపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. సభ నిర్వహణలో కొంత సమాచార లోపం జరిగింది. దీనికే స్పీకర్‌ సారీ చెబుతారా? అని మండిపడ్డారు.

స్పీకర్‌ కార్యాలయం తీసుకునే నిర్ణయాలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. విపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి సమాచార లోపానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ‘హరీశ్‌రావు, అక్బరుద్దీన్‌.. ఇద్దరూ సీనియర్‌ సభ్యులు. సమాచార లోపం జరిగిందని మేమే చెబుతున్నాం. అయినా క్షమాపణ చెప్పాలంటున్నారు. వారు ఏదైనా చెప్పాలనుకుంటే రిక్వెస్ట్‌ చేయాలి. అంతేకానీ హుకుం జారీ చేయొద్దు. తప్పు చేస్తే తప్పకుండా క్షమాపణ చెబుతాం. ఎంతో ముఖ్యమైన అంశంపై సభలో చర్చ కొనసాగుతుండగా.. చర్చను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారు. సభ సజావుగా జరగాలని భారాస నేతలు భావించడం లేదు. ప్రభుత్వ పరంగా ఏదైనా పొరపాటు జరిగితే శాసనసభ వ్యవహారాల మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా.. జవాబుదారీగా ఉంటా. అంతేకానీ స్పీకర్‌ క్షమాపణ చేప్పాలంటే.. ఎలా సాధ్యం అవుతుందని శ్రీధర్‌బాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *