బాధ్యతలేని ప్రతిపక్షాల కారణంగా మోదీ ప్రభుత్వానికి చెక్ పెట్టే అవకాశం లేకుండా పోతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన బాధ్యతను సరిగా నిర్వహించలేక పోతోంది. దేశం ఏమైపోతున్నా పట్టించుకోవడం లేదు. బడ్జెట్ సమావేశాల్లో బాధ్యతాయుత ప్రతిపక్షంగా సమస్యలపై చర్చిస్తారని ఆశిస్తున్న దేశ ప్రజల అడియాశలు కాక తప్పడం లేదు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి అనవసర సమస్యలపై మాట్లాడు తున్న కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు, దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చకు సిద్దంగా ఉండడం లేదు. ఒకప్పుడు బబ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలను చూస్తే అధికార పక్షం వణికి పోయేది. ఏ సమస్యను ఎక్కడ లేవదీస్తారో అన్న భయం ఉండేది. ప్రతిపాదనల్లో కోతలు విధించేవారు. సవరణలకు పట్టుబట్టేవారు. అదనపు కేటాయింపులు జరిగేలా చూసేవారు. కమ్యూనిస్టుల ప్రధానంగా ఈ పాత్ర పోషించేవారు. కానీ కమ్యూనిస్టులు లేకపోవడం, ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారానికి బాగా అలవాటై పోవడం వల్ల ప్రతిపక్ష బాధ్యతలను సరిగా నిర్వహించడం లేదు. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం వెండి ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. ఉప్పులు,పప్పులు సామాన్యుడికి అందనంతగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సమావేశాల్లో ఒక్కో సమస్యపై చర్చించినా సమయం సరిపోదు. కానీ కాంగ్రెస్, ఇతర విపక్ష సభ్యులు అనవసర సమస్యలను నెత్తికి ఎత్తుకుని సభా సమయాన్ని వృధా చేసుకుంటున్నాయి. అభివృద్ది పేరుతో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఊదర గొడుతూ కాలక్షేపం చేస్తోంది. పదేళ్ల పాటు యూపిఎ పాలన అంతా కుంభకోణాలమయంగా మారింది. వారూ ఓటమి చెందారు.
తరవాత 2014లో మరోమారు బిజెపి అధికారంలోకి వొచ్చింది. ఇప్పుడు పదేళ్లుగా మోది నేతృత్వంలోని బిజెపి పాలన సాగుతోంది. గత 20 ఏళ్ల కాలానికి పోలిస్తే దేశంలో అభివృద్ధ్ది అన్నది ఎండమావిగానే గుర్తించాలి. కోట్లాదిమందిని పేదరికం నుంచి బయటపడేశానని ప్రధాని మోదీ పదేపదే చెబుతున్నారు. అయితే పెరుగుతున్న ధరలతో సామాన్యులు బతకడమెలా అన్నది ఆలోచించడం లేదు. సామా న్యుడు తనకుతానుగా బతకగలి గినప్పుడే నిజమైన అభివృద్దికి గీటురాయిగా చూడాలి. భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం చూస్తే.. ఎండమావిని చూపి నీళ్లు తాగమనే మాటలు చెబుతున్నారన్నమాట. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తు న్నామన్న మాటలన్నీ డొల్లగా చూడాల్సిందే. అప్పటికి వందేళ్ల స్వాతంత్య్ర భారతం అవుతుంది. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం అని పదేపదే చెబుతున్నారు. నిజానికి అభివృద్ది జరిగివుంటే ఈ దుస్థితి ఎందుకని ప్రశ్నించు కోవాలి. ప్రజలు తిండిగింజలను కొనుక్కునే పరిస్థితిలో లేరని చెప్పకనే చెప్పారు. పేద మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల ఎండమావిగా మారింది.
పేదలు, మహిళలు, యువకులు, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదు. అంతెందుకు జిఎస్టీ సడలిం పులపై ఒక్కరూ మాట్లాడడం లేదు. తానో గొప్ప విజనరీ అని చెబుతున్న చంద్రబాబు కూడా దీనిపై ఎక్కడా చర్చించడం లేదు. ఎన్‌డిఎ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కేవలం పొగడ్తలకే పరిమితమయ్యారు. ఏ అంశాన్ని కదిలించడం లేదు, కదిలిస్తే తన రాష్ట్రానికి ఎక్కడ నిధులు రావో అన్న భయం ఆయనలో ఉంది. నితీశ్ కుమార్ తదితరులు కూడా ప్రేక్షకులుగా మారారు. ప్రధాన ప్రతిపక్షమే నాయకత్వ లోపంతో ఉంది. రాహుల్‌కు దేశంపైనా, సమస్యలపైనా అవగాహన లేకుండా పోవడం కూడా ఇందుకు కారణమని చెప్పు కోవాలి. నిజానికి జిఎస్టీపై తక్షణం ఈ సమావేశల్లో చర్చించాలి. దానివల్ల కలుగు తున్న దుష్పరిణామాలను చర్చించాలి. పన్నుల వల్ల ప్రజలు ఎంతగా దెబ్బతింటున్నారో చర్చించాలి. కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఈ ఒక్క అంశంపై ఎన్నిరోజులైనా చర్చించేందుకు నిలబడగలగాలి. కానీ ఆ పని చేయడం లేదు. జిఎస్టీ వసూళ్లు నెలకు రూ.లక్షా 70 వేల కోట్లకు చేరడం చూసి అభివృద్ధ్ది అనుకుంటున్నారు.
కానీ అదంతా ప్రజలపై పన్నుల కొరడా అని గుర్తించడం లేదు. ప్రజలు స్వచ్చందంగా పన్నులు కట్టలేని దుర్భర పరిస్థితు ల్లో ఉన్నారు. రైతులకు కనీస మద్దతు ధరలు అన్నవి రావడం లేదు. కానీ బియ్యం, ఉప్పు, పప్పుల ధరలు మాత్రం ఏటికేడు ఆకాశాన్ని అంటుతున్నాయి. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అని మోసగించడం తప్ప మరోటి కాదు. దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కరించడం వేరు..కానీ పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వం అండ లేకుండానే జీవించగలగాలి. కానీ ఈ పదేళ్లలో అలాంటి అవకాశాలు లేకుండా చేశాయి. సామాన్యులు ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు. బ్యాంక్ వడ్డీ రేట్లు దారుణంగా ఉన్నాయి. భూములు, సిమెంట్, స్టీలు ధరలను అడ్డం పెట్టుకుని బిల్డర్లు దోపిడీ చేస్తున్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణ లు ఫలితాలిస్తాయని ఆశించారు. దేశ ప్రజలు భవిష్యత్‌పై ఆశతో ఉన్నారు.
ఆదాయపు పన్ను సడలింపులు, ఆర్‌బిఐ రెపోరేటు తగ్పింపులు కేవలం పైపూతలు మాత్రమే. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, జిఎస్టీ వంటి అంశాలపై పార్లమెంటులో చర్చించాలి. ఇందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కసరత్తు చేయాలి. ప్రభుత్వాన్ని నిలదీయగలగాలి. ప్రజల్లో ఇమేజ్ పొందాలంటే ఇదే సమయం. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయగలిగేంతగా బలం ప్రతిపక్షానికి ఉంది. దీనిని ఉపయోగించుకునే సామర్థ్యం రాహుల్‌కు ఉందా లేదా అన్నది చూడాలి. ప్రతిపక్షనేతగా ఎదగాలంటే ప్రజల సమస్యలపై చర్చించాలి. ఏదో ఒక పనికిరాని సమస్యను ముందుకు వేసుకుని ధర్నాలు, ప్లకార్టు ప్రదర్శనలు చేసినంత మాత్రాన ప్రజలు పట్టించుకోరు. ప్రధాన సమస్యలపై చర్చించేలా కాంగ్రెస్‌లో కూడా సరైన నేతలు కాని, సలహాలు కానీ ఇచ్చేవారు కరువయ్యారు. అందుకే మోదీని ఎదిరించేలా ప్రతిపక్ష బాధ్యతలను రాహుల్ నిర్వహించడం లేదు.
– ప్రజాతంత్ర డెస్క్





