సొలోమోన్ విజయ్ కుమార్
తెలుగుసాహిత్యం ఎల్జీబీటీక్యూ+ అంశాన్ని దాదాపు విస్మరించిందనే చెప్పాలి. ఎల్జీబీటీక్యూలను సమాజం హీనంగా చూడడం వలనో, వారి సెక్స్ ఆలోచనలు ప్రకృతి విరుద్ధం అనే అసత్య ప్రచారం వలనో, నిన్న మొన్నటి దాకా రచయితలు కూడా వారివైపు చూసేందుకే భయపడ్డారు అనుకుంటాను. మన సమాజంలాగానే మన రచయితలకు కూడా ఎల్జీబీటీక్యూ అంటే నేటికీ స్పష్టమైన అవగాహన కానీ వాళ్లూ మనతోటి మనుషులేనన్న ఆలోచన కానీ లేదు.
దానితో వారి జీవితాల లోతుపాతులు, వారి గొంతు పెగలని అవమానాలు, వారిమీద జరిగే లైంగిక అకృత్యాలు ఇలా వాళ్లకు సంబంధించినవన్నీ వారిలాగే చీకట్లో మగ్గిపోయాయి. కేవలం వెకిలి, చులకన పదాలతో వారు వర్ణించబడ్డారు. ఇటీవల మాత్రమే తెలుగులో ఎల్జీబీటీక్యూ జీవితాలకు సంబంధించి అరకొరగా కథలు వచ్చాయి. మానస ఎండ్లూరి, వేణు మరీదు ఇలా ఒకరిద్దరు కొన్ని మంచికథలు రాసారు. కానీ ఇవి సముద్రంలో నీటిచుక్కలు మాత్రమే.
పాఠకులకు ఎల్జీబీటీక్యూ+ జీవితసంఘర్షణ తెలియదు. చెప్పేవారు ఉంటేగా తెలిసేది? కాబట్టే గే వృత్తాంతంతో నేను రాసిన ‘సన్ ఆఫ్ జోజప్ప’ నవలను చదివిన పాఠకులు చాలామంది ఎల్జీబీటీక్యూ+ జీవితాల్లో ఇంత సంఘర్షణ ఉంటుందని ఈ నవల చదివేవరకూ తమకు తెలియలేదని అందుకనే ఆ నవల తమని బాగా దుఃఖపరచిందని వారిగురించి తమ ఆలోచనల్లో మార్పును తెచ్చిందని చెప్పారు. అలా చెప్పినవారిలో యూనివర్సిటీల విద్యార్థినీ విద్యార్థులు ఎక్కువ. కనుక రచయిత రాతలో నిజాయితీ, నిర్భీతి ఉంటే ఎవరికీ తెలియని నగ్నసత్యాలు బైటకొస్తాయి.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల