వెయ్యి కోట్ల వివాదం – బడ్జెట్‌లోపే శ్వేత పత్రానికి డిమాండ్‌

“విచిత్రమేమంటే రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానంపై కేరళ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం. తెలంగాణలో బుల్డోజర్‌ ‌రాజ్‌ ‌నడుస్తుందని పక్క రాష్ట్ర సిఎం పినరాయ్‌ ‌విజయ్‌ ‌కామెంట్‌ ‌చేశారు. ఖమ్మం జిల్లాలోని భూదాన్‌ ‌భూముల్లో నివసిస్తున్న మూడు వేలమందికి సంబంధించిన  700 ఇండ్లను నేలమట్టం చేయడంపైన ఆయన స్పందించారు. తెలంగాణలో తమ పాలన అద్భుతంగా ఉందంటూ కేరళలో ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపడుతూ అక్కడ చెబుతున్నదొకటి, ఇక్కడ చేస్తున్నదొకటని ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా విరుచుకుపడటం కొసమెరుపు.”

manduva ravindhraరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీకి వెయ్యికోట్ల రూపాయల ఆర్థిక సహాయంపై చేసిన వ్యాఖ్యలు వివాదగ్రస్తంగా మారాయి. ఈ విషయంపై విపక్షాలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్షిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారానికి రావడానికి ముందు ప్రజలకిచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిన ప్రభుత్వం కోట్ల రూపాయలను తమ కేంద్ర పార్టీకి ఎలా దారాదత్తం చేస్తుందని ఆ పక్షాలు నిలదీస్తున్నాయి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌చేసిన వాగ్దానాలకు ఆకర్షితులైన ప్రజలు ఆ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించారని, అయితే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలుచేయకపోవడాన్ని  ఆ పక్షాలు ఎత్తిచూపుతున్నాయి. హామీల అమలుపై నిలదీసినప్పుడల్లా బొక్కసం ఖాలీగా ఉందని చెబుతున్న ప్రభుత్వం వెయ్యికోట్ల రూపాయలను పార్టీకి ఎలా అందిస్తుందని ప్రశ్నిస్తున్నాయి.
ముఖ్యమంత్రి మాటలను బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా పుష్టిగానే ఉందనిపిస్తున్నా, కావాలనే హామీలను అమలుపర్చడంలేదన్న అనుమానానికి తావేర్పడుతున్నదంటున్నాయి ఆ పక్షాలు. ఈ విషయంపై వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలంటూ తాజాగా కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన సుదీర్ఘ లేఖలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదలచేయాలని ఆయన కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులులేమిని చూపుతున్న రాష్ట్రప్రభుత్వం వెయ్యికోట్ల నిధులను కాంగ్రెస్‌పార్టీకి సమకూరుస్తామని హామీఇవ్వడం అయోమయానికి గురిచేస్తున్నదని, అందుకే వాస్తవంగా రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఏమిటన్నది ప్రజలకు తెలువాల్సిన అవసరముందని కిషన్‌రెడ్డి ఆ లేఖలో రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం తీరును విమర్శించారు.
గత ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలు, 420 హామీలనిచ్చిన కాంగ్రెస్‌, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ లంకెబిందెలు ఉన్నాయనుకుంటే ఖాలీ మట్టికుండలు ఉన్నాయనడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్ర అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను సమకూర్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ ఆర్థికసంస్థలద్వారా కోట్లాది రూపాయల రుణాలను తీసుకోవడంలో సహకరించింది. ప్రతీ ఏటా ఇలా పెరుగుతున్న అప్పులతో రాష్ట్ర తలసరి భారం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారు కిషన్‌రెడ్డి. అందుకు ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లోపే రాష్ట్ర అర్థికపరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నది కిషన్‌రెడ్డి డిమాండ్‌. ‌బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటి రామారావుకూడా అదే డిమాండ్‌ ‌చేస్తున్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగంరోజులు గడిచిపోయాయి. ఇప్పటివరకు హామీలను ప్రభుత్వం అమలుచేయలేదు. మహిళలు, యువత, వృద్ధులు, విద్యార్థులు, రైతులు తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. వారికిచ్చిన హామీలతోపాటు, ఇంతకాలానికి వారికి ఇవ్వాల్సిన బకాయిలను తీర్చేందుకు ఇప్పటికైనా త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తగిన నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్‌ ‌చేస్తున్నారు.
 తాజాగా రాహుల్‌గాంధీ రాష్ట్రంలో పర్యటించడంపై ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలపై సమీక్షించడానికా లేక సిఎం హామీఇచ్చిన కోట్ల రూపాయలను పట్టుకుపోవడానికా అన్నట్లుగా కెటిఆర్‌ ఎక్స్ ‌ఖాతాలో చేసిన కామెంట్‌ ‌చర్చనీయాంశమైంది. ‘హలో రాహుల్‌ ‌జీ..ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌కమిటి ఏటిఎం అయిన తెలంగాణకు స్వాగతం’ అని పేర్కొనడం విమర్శలకు దారితీసింది. అలాగే మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కూడా వెటకారం చేశారు. రాహుల్‌గాంధీ పర్యటన వెయ్యికోట్ల వసూలుకేనా అంటూ ఆయన కామెంట్‌ ‌చేశారు. అలాగే ఇచ్చిన హామీలకు తోడు తాజాగా జరిగిన పంచాయితీల్లో ఎకగ్రీవ పంచాయితీలకు ఇస్తామన్న నిధులను ఎప్పుడిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఇదిలాఉంటే రాహుల్‌ ‌పర్యటన క్రమంలో వెయ్యి కోట్ల ప్రస్తావన పలు రాజకీయ నాయకులకు విమర్షనాస్త్రంగా మారింది. ఎన్నికలముందు చాయ్‌పే చర్చ అని హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో యువకులతో ముచ్చటించిన రాహుల్‌గాంధీ, రాష్ట్రంలో తమపార్టీ అధికారంలో ఉన్నప్పుడు పర్యటించే క్రమంలో యువతను, నిరుద్యోగులను నిర్భందించడాన్ని పలువురు తీవ్రంగా తప్పుపట్టారు. రాహుల్‌గాంధీ పర్యటనకు ఒక రోజు ముందునుండే నిరుద్యోగ జాక్‌ ‌నేతలను పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఎస్టీ, ఎస్సీ కమిషన్‌ ‌మాజీ చైర్మన్ , ‌బిఆర్‌ఎస్‌ ‌నాయకుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ ఆ‌గ్రహంవ్యక్తం చేశారు.
ఎప్పుడు రాజ్యాంగ గ్రంథాన్ని పట్టుకుని తిరిగే రాహుల్‌కు ఈ నిర్భంధాలు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. విచిత్రమేమంటే రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానంపై కేరళ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం. తెలంగాణలో బుల్డోజర్‌ ‌రాజ్‌ ‌నడుస్తుందని పక్క రాష్ట్ర సిఎం పినరాయ్‌ ‌విజయ్‌ ‌కామెంట్‌ ‌చేశారు. ఖమ్మం జిల్లాలోని భూదాన్‌ ‌భూముల్లో నివసిస్తున్న మూడు వేలమందికి సంబందించిన 700 ఇండ్లను నేలమట్టంచేయడంపైన ఆయన స్పందించారు. తెలంగాణలో తమ పాలన అద్భుతంగా ఉందంటూ కేరళలో ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపడుతూ అక్కడ చెబుతున్నదొకటి, ఇక్కడ చేస్తున్నదొకటని ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా విరుచుకుపడటం కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *