రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వైకుంఠద్వార దర్శనం
యాదాద్రి, భద్రాద్రి, ధర్మపురిలో ఉత్తర ద్వార దర్శనం
వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి నుంచి పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్యదినాన భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలివొస్తారు. తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు.
భద్రాచలంలో సరిగ్గా ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. స్వామి సేవలో తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ స్వామివారికి గరుడ సేవోత్సవం, తిరువీధిసేవ నిర్వహించనున్నారు.
ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరిలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. జంటనగరాల్లో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ వెంకటేశ్వరాలయాలు, బంజారాహిల్స్ వేంకటేశ్వరాలయం, చిక్కడపల్లి, పెద్దమ్మగుడి, నానాక్రామ్ గూడ, ఓల్డ్ సిటీ రంగనాథ స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు చేసారు. వేకవ జామునుంచే ఆలయాలను దర్శించుకుని వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారు. చిలుకూరు ఆలయానికి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.




