నిశ్శబ్ద మాధుర్యం

భిన్నభావాల స్మృతిదర్పణమే మనోఫలకం. రోజుకో భావాన్ని పరిశోషించి, పరిశోధించి రంగరించుకుంటూ  చేసిన మిశ్రమం ఎన్నో శబ్దాలను గుండె లోతుల్లో లయలుగా నిక్షిప్తం చేస్తుంది. ఆ భావాలను పెదాలు పలకనీయవు. మదిలో అలజడిని బయటకు దొర్లనీయవు. వయసుతో పాటే నేర్చిన పాఠాలు ఈ మౌనంలో మారాం చేస్తుంటాయి. వాటికి బయటకు తరలింప జేసిన మార్గమే నా ఈ కవితా వ్యాసంగం, నిశ్శబ్ద మాధుర్యం. ఇందులో భిన్న అంశాలు సృజించే చిన్నప్రయత్నం చేశాను. కొన్ని నర్మగర్భంగా చెప్ప ప్రయత్నించాను. మరికొన్నింటిని ప్రస్పుటంగా తెలియజేయ చూసాను. ఈ సంపుటి లోని కొన్నిపుటలు లక్షల మెదళ్లను కదిలించక పోయినా ఏ కొందరి మనసును తాకినా నేను కృతకృత్యుడిని అయినట్టే!

మేము చిన్నప్పుడు నెల్లూరులో ఓ కురచ వీధిలో వుండేవాళ్ళం. ఉమ్మడి కుటుంబం. మా తాతయ్య కట్టించిన ఆ ఇంట్లో వెనక పెంకుటిల్లు, దాని ముందు కాసింత మిద్దె, దానిక్కాస్త ముందు రేకుల వసారా. ఆరుబయట వరండాలో నందివర్ధనాలు, నూరు వరహాలు లాంటి పూల మొక్కలు, ఓ కొబ్బరి చెట్టు, కరివేపాకు చెట్టు. సాయంత్రం అయితే చల్లగాలి మమ్మల్ని పలకరించేది. అప్పుడప్పుడూ ఆ సాయంత్రాలు మా చిన్నాన్న శ్రీ గుడ్లదొన సాయిరాం, వారి స్నేహితులు కలిసి కాలేజీలో నాటకాలకనుకుంటా ప్రాక్టీస్ చేస్తుండే వారు. చిన్నపిల్లలమైన మేము డిస్టర్బ్ చేస్తామనేమో, మమ్మల్ని ఎక్కువగా రానిచ్చేవారు కారు. ఆ బ్యాచ్ లో వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు  కూడా ఒకరు, వాళ్ళు తెచ్చుకునే పుస్తకాలు. ఎన్నో పుస్తకాలు అక్కడ దర్శనమిచ్చినా కొన్ని మరీ దగ్గరయ్యాయి. మహాకవి శ్రీశ్రీ వారు రాసిన మహా ప్రస్థానం, ఖడ్గసృష్టి, దేవులపల్లి వారి కృష్ణ పక్షం, తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి వంటి పుస్తకాలు అప్పుడే చూసి నేనూ కాసింత వంటబట్టించుకునే ప్రయత్నం చేసేవాడిని రిక్వెస్ట్ చేసి. పుస్తకాలు మనం కూడా పబ్లిష్ చేసుకోవచ్చు అన్న విషయం శ్రీ వెన్నెలకంటి వారు రాసిన ఉషోదయం ఆపలేవు అనే ప్రతి చూసిన తర్వాతే నాకు తెలిసింది.

అప్పుడప్పుడూ నేనూ ఏదో కొన్ని రాతలు రాస్తుండే వాడిని. ఇప్పటికీ నాకు మా చిన్నాన్న భుజం తట్టిన రోజులూ ఇంకా గుర్తే. శ్రీ సర్వోదయా కాలేజ్ లో ఇంటర్మీడియట్ సావనీర్ లో నా మొదటి కవిత ‘ఏమిటో జీవితం’ ముద్రితమయ్యింది. అదో పరమానందం. వీఆర్ కాలేజ్ లో డిగ్రీ సావనీర్ లో నా కవితలు అచ్చయ్యాయి. కొంచెం ఉత్సాహం పెరిగింది. తిరుపతి యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ చేసేటప్పుడు పెద్ద గ్రంథాలయం చూసాక ఇక నా పంట పండింది. అక్కడే పురాణాలతో పాటు కొడవటిగంటి, చలం, బుచ్చిబాబు, వడ్డెర చండీదాస్ వంటి రచయితల పుస్తకాలు మరింత వంటబట్టాయి. అప్పుడే నేను రాసిన కవితలు జాగృతి, ఆంధ్రజ్యోతి, వార్త కాకుండా లాయర్ వంటి నెల్లూరు పత్రికలలో కూడా ప్రచురింపబడేవి. ఈ మధ్యనే మా ఇంట్లో ఉండే ఒక ట్రంక్ పెట్టె నుండి ఒక పురికోస కట్టిన చిన్న కట్ట కాగితాలు మా నాన్నగారు చేతిలో పెట్టారు. ఆ పసుపు వర్ణం సంతరించుకున్న చిరిగి పోయేందుకు సమాయత్తమవుతున్న కాగితాల్లో నా చిన్ననాటి కవితలున్నాయి. నాన్న అంత జాగ్రత్తగా వాటిని కాపాడినందుకు నా కళ్లు ఆ క్షణాన ఆర్ద్రమయ్యాయి.

నేను కవనాన్ని/ మనో జననాన్ని
అదృశ్య పవనాన్ని/ జడత్వ దహనాన్ని
నేను కవనాన్ని/ శాసించే దిక్కుని
సాహసించే దృక్కుని/ శ్వాసించే శక్తిని
నేను కవనాన్ని/ ఎక్కుపెట్టిన బాణాన్ని
రెక్క విసిరిన విహంగాన్ని/ పిక్కటిల్లే ప్రతిధ్వనిని
నేను కవనాన్ని/ పలకరించే ప్రకృతిని
పల్లవించే జాగృతిని/ పరవశించే ఆకృతిని
నేను కవనాన్ని/ తమస్సుపై రణభేరిని
ఉషస్సుకై చకోరిని/ యశస్సు పుంజాన్ని
బడిని… గుడిని/ వడిని… నడవడిని
నేను కవనాన్ని/ అక్షర యాగాన్ని
సుస్వర నాదాన్ని/ ఈశ్వర నాట్యాన్ని

image.png
 గుడ్లదొన సాయి చంద్రశేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *