ప్రజాస్వామ్య సుస్థిరతకు పత్రికలు ప్రధాన సాధనాలు

“శ్రీ ఆచార్య సంపాదకీయాలకు ఒక ప్రత్యేకమయిన ‘ఆచార్య ముద్ర’ ఉంటుంది. ఆయన భాషా ప్రయోగంలో ‘చమత్కారం’ అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది. శైలిలో ఒక విధమయిన ‘తెలంగాణా’ యాస పొట మరించి చమత్కరింపజేస్తుంది. సూటిగానే, ఋజువుగా భావం బలంగా వ్యక్తీకరిస్తూనే వ్యంగ్యాన్ని సంతరించు కొంటుంది. శీర్షికలు రూపొందించటంలోనూ, విషయం మొదలు పెట్టడంలోనూ, ముగించటంలోనూ చురుకయిన రచన ఆకట్టుకుంటుంది. ఈ అన్నింటికీ ఈ సంకలనంలో ఉదాహరణలు కొల్లలుగా లభిస్తాయి.”

47.జనధర్మో విజయతే

ప్రజాస్వామ్య సుస్థిరతకు పత్రికలు ప్రధాన సాధనాలు. కొందరు పార్టీలుగా ఏర్పడి ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపడం, వోట్లు వేయడం వంటి పనులు మాత్రమే ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యం ఒక స్వతంత్ర దేశ ప్రజల జీవన విధానం. ఈ విధానంలో అధికారపు పెనగులాటతో నిమిత్తంలేని అపారమయిన సమాజం తన జీవనానికీ, విలువలకూ విశ్వాసాలకూ భద్రతనిచ్చే సాంఘిక వ్యవస్థ నిర్మాణానికి పురోగమించాల్సి ఉంది, ప్రభుత్వం అందుకనుకూలమైన వాతావరణం కల్పించవలసి ఉంటుంది. ఈ ప్రగతిపథంలో ప్రజలుగాని, ప్రభుత్వాధికారము చేపట్టిన వారు గాని వేయుతప్పటడుగుల వారించి, పురోగమించుటకు వలయు సూచన అందచేసీ, ఉన్నత సంప్రదాయాన్నేర్పరచు విమర్శనాశీలురగు విజ్ఞ ప్రజలకు పత్రిక ఉత్తమ సాధనం. ఈ సాధనమును సద్వినియోగ పరచుకొను ప్రజలున్న ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం వేళ్లుదన్ని, ఊడలుచారి, సుస్థిరమై విలసీస్తుంది, ఈ సుదృఢాభిప్రాయమే… ఈ సాహస కృషిని మన్నించి జనధర్మను తమ వాణీప్రసార యంత్రంగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి.

ఇంతేకాదు, జనధర్మకు గుత్త పెట్టుబడిదారుల అండదండలు లేవనీ, ఒక పార్టీ ఒక వర్గం ఆలంబన అంతకన్నా లేదనీ, ‘త్వమేవ శరణం’ అని కాలక్షేపం చేయగల శక్తి గానీ, ఆసక్తి గానీ అసలే లేదనీ తమ పత్రిక ‘పాలసీ’ సూచించబడినది. స్వయం నిర్దిష్టమయిన ఈ మార్గంలో జనధర్మ, వరంగల్‌ వాణి పత్రికలు భావప్రకటన స్వేచ్ఛను, సంపాదకీయ రచనల్లో కచ్చితంగా పాటించగలిగాయా? లేదా? అనే ప్రశ్నకు సహేతుక సమాధానం – ఆ పత్రికా సంపుటాలన్నింటినీ తిరుగవేయల్సినంత అవసరం లేకుండానే, ఈ సంపాదకీయాల సంకలనంలో నిర్ద్వంద్వంగా లభిస్తుంది.

ముప్పయి సంవత్సరాల సుదీర్ఘ కాలంలో సమస్యలు, అవసరాలు, రాజకీయ ధోరణులు – పరిణామాలు, అభివృద్ధి పనులకోసం సాగే నిరంతర ప్రకటనావశ్యకతలు ఏదో ఒక్కసారిగా తారసపడి తీక్షపడేవి కావు. సమస్యలు, వివరణలు, ఆపన్నతలు, విన్నపాలు, విచారణలు, వ్యాఖ్యలు నిరంతరం సాగేవి కావటాన అప్పుడప్పుడు పునరుక్తాలుగా, చర్విత చర్వణాలుగా భాసించే అవకాశం ఉంది. ఒక్కొక్క సందర్భాన్ని పురస్కరించుకొని పూర్వం చెప్పిన అంశాలే పునః పునః వ్యాఖ్యానించవలసిన అవసరమూ రావచ్చు. కాని, అట్లాంటి సందర్భాల్లో గూడా కలం, కాలం, సమన్వయం, తాత్కాలికత, భావుకత, నిర్దుష్టత, నిర్దిష్టత వేటికీ భంగం కలక్కుండా, పునర్నూతనత్వం సంతరించుకొనే విధంగానే రాయగలగడం రచనా రంగంలో విశేషానుభవానికి పరీక్షగా నిలుస్తుంది. ఆ పరీక్షకు శ్రీ ఆచార్య సంపాదకీయాలు తట్టుకొని నిలద్రొక్కుకున్నవి. ఆ సంపాదకీయాలకు విషయ ప్రాధాన్యమే కాక, సాహిత్యపు విలువలు, ప్రసూణాలుకూడ సంతరించటం గమనించవచ్చు.

శ్రీ ఆచార్య సంపాదకీయాలకు ఒక ప్రత్యేకమయిన ‘ఆచార్య ముద్ర’ ఉంటుంది. ఆయన భాషా ప్రయోగంలో ‘చమత్కారం’ అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది. శైలిలో ఒక విధమయిన ‘తెలంగాణా’ యాస పొట మరించి చమత్కరింపజేస్తుంది. సూటిగానే, ఋజువుగా భావం బలంగా వ్యక్తీకరిస్తూనే వ్యంగ్యాన్ని సంతరించు కొంటుంది. శీర్షికలు రూపొందించటంలోనూ, విషయం మొదలు పెట్టడంలోనూ, ముగించటంలోనూ చురుకయిన రచన ఆకట్టుకుంటుంది. ఈ అన్నింటికీ ఈ సంకలనంలో ఉదాహరణలు కొల్లలుగా లభిస్తాయి.

మూడు నాలుగు వేల సంపాదకీయాలు, వర్గీకరణ

జనధర్మ. వరంగల్‌ వాణి పత్రికల మొత్తం మీద శ్రీ ఆచార్య సంపాదక రచనలు దాదాపు మూడు నాలుగు వేల దాకా ఉంటాయి. ఇన్నింటిలో కొన్నింటిని ఎన్నిక చేసుకొని – ఆ ఎన్నిక కూడా ఈ సంకలనాన్ని వెలువరించే అభినందన సమితి అవకాశాలూ, పరిమితులూ దృష్టిలో ఉంచుకొని చేయటం అంత సులభమేమీకాదనే అంశం మాకు అనుభవం మీద తెలియవచ్చింది. సంపాదకీయాలు అంతస్సూత్రం ఒకటే అయినా, వస్తువు – భావం – భావుకత మొదలయిన అంశాలను బట్టి ఇన్నిన్ని సంపాదకీయాల్లో దేనికదే ఒక మేలిమి, ఒక మెరుపు కలిగి ఉంటుంది. ఈ ఎంపికచేసే వారి ఉత్సాహానికీ, ప్రచురణ పరిమితులకూ పొంతన కుదురనప్పుడు ఈ ఎంపిక మరింత కష్టతరంగా తయారవుతుంది, అయింది కూడా. అంతేకాదు.

సంపాదకీయాలను ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేయాలి? ఏ విధంగా వర్గీకరించాలి? ఏయే వర్గంలో ఎన్నెన్ని సంకలనం చేయటం? – ఇవి ఇబ్బంది పెట్టిన సమస్యలు. కాలక్రమాన్ని ఆనుసరించాలా? విషయాన్ని అనుసరించాలా? అనేవీ సమస్యలే. ఇన్నిన్ని సమస్యలతో, ప్రశ్నలతో శ్రీ ఆచార్య సంపాదకీయాలన్నింటిని అనుశీలించే అవకాశం ఈ సంకలన సంపాదక మండలికి ఒక విచిత్రమయిన, విశిష్టమయిన అనుభవం. అధ్యయన శీలంతో ఎంపిక చేసిన సంపాదకీయాలను ఒక క్రమంలో కూర్చడానికి ఒక భూమికను సమకూర్చుకొని ముందుకు సాగాల్సి వచ్చింది. ఆ భూమిక శ్రీ ఆచార్య సంపాదకీయాల్లో విస్తృతంగా కన్పించే విషయ వస్తు వైవిధ్యం కేవలం కాలక్రమానికి కాక, వస్తు ప్రాధాన్యం ప్రాతిపదికపై రెండు పత్రికలలోని సంపాదకీయాలను సమిష్టిగానే భావించి, స్థూలంగా సప్త సోపానాలుగా సప్త విభాగాలుగా చేయడమయింది. ఆ యా విభాగాల్లోనూ కాలక్రమం స్థూలంగా ఎక్కడయినా ఒకటి రెండు వెనుకముందులున్నా పాటించబడింది. (జనదర్మ, వరంగల్ వాణి యం యస్ ఆచార్య సంపాదకీయాల పుస్తకం నుంచి)

-మాడభూషి శ్రీధర్ ఆచార్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *