- క్షణికావేశంలో చేసిన తప్పులకు కుటుంబాలు బలి
- ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టీవీ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- అండర్ ట్రయల్ ఖైదీల మధ్య నూతన సంవత్సర వేడుకలు
హుజూర్ నగర్, ప్రజాతంత్ర, జనవరి 1 : అండర్ ట్రయిల్ ఖైదీలలో మానసిక పరివర్తన రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. క్షణికావేశంతో చేసిన తప్పులతో వారి వారి కుటుంబాలు బలి అవుతున్నాయి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినూత్న ప్రక్రియను మొదలుపెట్టారు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు రూట్ మ్యాప్ రూపొందించి అమలుపరచడంతో పాటు వేడుకలు సమాజాభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్న సందేశాన్ని ఈ ఏడాది ప్రారంభం రోజున ఆయన పంపారు. నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జైలును సందర్శించారు.
అక్కడ ఆయన అండర్ ట్రయల్ ఖైదీలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం వారి వారి జీవిత విశేషాలను తెలుసుకుంటూనే వారిలో పరివర్తన కి తీసుకు రావాల్సిన మార్పులపై వారికి ఉద్బోధించారు. చిన్న చిన్న తప్పులకు కుటుంబాలకు దూరమై ఒంటరి జీవితం అనుభవిస్తున్న తీరును విశ్లేషించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడం తో పాటు మీరు అనుభవించిన, అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులు సమాజానికి తెలియజేయాలన్నారు. తద్వారా మీతో సమాజంలో ఒక మార్పు తీసుకు రావొచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. సబ్ జైలుకు కలర్ టీవీ ఇదిలా ఉండగా తమతో కొత్త సంవత్సరం ప్రారంభం రోజున జైలును సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఖైదీలు తమ సాధక బాధకాలు చెప్పుకున్నారు. మాకు ఆహ్లాదాన్ని అందించేందుకు కలర్ టి.వి కావాలని వారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభ్యర్థించారు. అడిగిందే తడవుగా తాను వ్యక్తిగతంగా సబ్ జైలుకు టి.వి అందిస్తానని హామీ ఇచ్చారు.
మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి
మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు
మైనారిటీ విద్యార్దులు ఉన్నత శిఖరాలను అందుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.అందులో మైనారిటీలకు చెందిన బాలికల సంక్షేమం కోసం అంకిత భావంతో పని చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో కలసి కోదాడ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు,జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఉత్తమ్ దంపతులు సహపంక్తి బోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్ ఆశయాలపై ముఖాముఖీ అడిగి తెలుసుకున్నారు.
నేటి వ్యవస్థలో విద్యార్థులు ఎదుర్కొంటున్బ సవాళ్ళను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము మౌలిక సదుపాయాలు లేక పడుతున్న ఇబ్బందులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏకరువు పెట్టుకున్నారు. పోటీ పరీక్షల కోసం అవసరమైన అదనపు పుస్తకాలను అందించడంతో పాటు సురక్షితమైన తాగునీటిని అందించడానికి అవసరమైన ఆర్.ఓ ప్లాంట్ ఏర్పాటు,డిజిటల్ తరగతుల ప్రారంభం వంటి విద్యార్థుల అభ్యర్థనలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. కాగా నూతన సంవత్సరం ఉదయాన్నే తమ చెంతకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతీ లు రావడంతో విద్యార్థులు ఎంతగానో పరవశించిపోయారు. విద్యార్థులతో మమేకం కావడమే కాకుండా వారి భవిష్యత్ దిశా-దశలను మార్గదర్శనం చేసిన తీరుతో విద్యార్థి లోకం ఆనందోత్సాహాలతో తెలిపోయింది .
ఇది మరచిపోలేని ఘట్టం:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నూతన సంవత్సరం మొదటి రోజున ఇటు విద్యార్థులతో పాటు అటు అండర్ ట్రయల్ ఖైదీలతో జరుపుకోవడం మరపు రాని ఘట్టంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ వసతిగృహాల్లో విద్యబ్యసిస్తున్న విద్యార్థులతో పాటు క్షణికావేశంలో జరిగిన తప్పులతో కుటుంబాలకు దూరంగా ఉంటున్న అండర్ ఖైదీలను ఇలా కలుసుకుంటే వారిలో మానసిక ధైర్యం పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు.




