కొన్ని అంశాలని పరిశీలిస్తే నేపాల్ లో రాజకీయ పరిణామాలకు తెలంగాణ రాజకీయ పరిణామాలకు సామీప్యత కనిపిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు. ఏండ్ల రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి రాచరికాన్ని కూల్చి రాజ్యాంగ బద్ద పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు కూడా దశాబ్దాల పాటు పోరాడి సీమాంధ్ర పెట్టుబడి దారి దోపిడీ పాలకుల నుండి విడివడి రాజ్యాంగబద్ధంగా స్వరాష్ట్రాన్ని సాధించుకొన్నారు. ఇక్కడా రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పడిన తొలి ప్రభుత్వం కూడా పదేళ్లపాటు అదే రీతిన రాజ్యాంగ ఉల్లంఘన, నిరుద్యోగం , ఉపాధి కల్పనలో వైఫల్యం, అవినీతి, కుటుంబ పాలన దోపిడీ కొనసాగించింది. పాలకులు మారినా మారని పాలనా తీరుపై నిరుద్యోగ యువకులు, ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారు . కొలువుల కొట్లాట లాంటి ఉద్యమాలు చేశారు. రాజ్యాంగ విలువలు కలిగిన పరిణితి చెందిన పౌర సమాజం ఈ యువతకు తోడై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. ఈ పరిణామం భారత రాజ్యాంగ గొప్పదనమే.. కానీ విచ్చలవిడి అవినీతి పాలకుల బాధ్యతారాహిత్యం, అణచివేత ఎప్పుడైనా ప్రజా తిరుగుబాటుకు దారితీస్తుంది .తిరుగుబాటనేది తెలంగాణ వారసత్వ సంపదలో ఆరిపోనీ ఒక కాగడా. ఈ వాస్తవాన్ని గుర్తు ఎరిగి తెలంగాణ ప్రస్తుత పాలకులు వ్యవహరించాల్సిన అవసరాన్ని ఇటు తెలంగాణ పరిణామం.. అటు నేపాల్ పరిణామం గుర్తు చేస్తుంది.
నేపాల్ జెన్ జీ ఆందోళన – తెలంగాణ సామీప్యత

నేపాల్ భౌగోళిక విస్తీర్ణంరీత్యా చూసినా, జనాభా చూసిన అతి చిన్న దేశం. కానీ ఏండ్ల తరబడిగా నిరంతరం ప్రపంచం దృష్టిలో చర్చించబడుతున్నటు వంటి దేశం. ఆధునిక ప్రపంచంలో కూడా దశాబ్దాల తరబడి రాచరిక పరిపాలన కొనసాగించిన దేశం. ఆ రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ విప్లవ కమ్యూనిస్టులు పోరాటం చేసినటువంటి దేశం . ఆ దేశ భౌగోళిక నైసర్గిక స్వరూపం మూలంగా, సరిహద్దు దేశాల ఆధిపత్యం మూలంగా ప్రధానంగా దిగుమతుల మీదనే ఆధార పడిన దేశంగా ప్రపంచవ్యాప్తంగా పట్టు బిగించిన సామ్రాజ్యవాదం ఆ దేశ సార్వభౌమత్వాన్ని నిలబడనీయదు. దేశ ఆర్థిక అభివృద్ధి ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతోనే చైనా, రష్యా దేశాల మాదిరిగా విప్లవం విజయవంతంగా వాళ్ళు ప్రకటించుకోకుండా, విప్లవ విముక్తి ప్రాంతంగా ప్రకటించుకోకుండా , పార్లమెంటరీ వ్యవస్థతో మమేకమై (సర్దుకు పోయి) రాజరిక వ్యవస్థను రద్దుచేసి నూతన రాజ్యాంగ ఏర్పాటుకు, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఆరోజు నేపాల్ లో విప్లవ కమ్యూనిస్టులు ప్రధానంగా ప్రచండ వర్గం చేసిన ప్రయత్నం అందరినీ ఆకర్షించింది.
ఆ తదుపరి కాలంలో ఆ పార్లమెంటరీ వ్యవస్థ లేదా ఆ పార్లమెంటరీ ప్రభుత్వం రూపొందించుకున్న రాజ్యాంగం నిబద్ధత పాటించక పోవడం, ఆ రాజ్యాంగ స్పూర్తి పాలకులకు గాని, అక్కడున్న రాజకీయ నాయకత్వానికి కానీ, అధికారులకు కానీ, కింది ప్రజలకు కానీ ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన రాలేదు. ఒంటికి పట్టలేదు.
ప్రచండ ,భట్టాచార్య లాంటి నాయకులు కూడా ప్రగతి శీలంగా, ఆదర్శంగా నిలబడలేకపోవడం, అక్కడ చోటు చేసుకున్న పరిస్థితులు నేటి ఈ జెన్ జీ సంక్షోభానికి లేదా ఉద్యమానికి దారి తీసింది. కేవలం దాన్ని ఆస్తుల విధ్వంసంగా చూడవద్దు. వారిని విధ్వంసకారులుగా చూడవద్దు. నాయకులపై ప్రేరేపిత దాడిగానో చూడ కూడదు. సమకాలీన పరిస్థితులలో తక్షణం వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలతో సతమతమవుతున్న నూతన తరoలో పెల్లుబికిన ఆగ్రహం ఇది. వారు ప్రజా ఉద్యమకారులుగా దీర్ఘకాలిక ఉద్యమంలో ఉన్నవారు కాదు. వారికి మొత్తం దేశం పరిస్థితి మార్చాలనీ దీర్ఘకాలిక అవగాహన లేక పోవచ్చు. రాజ్యాంగ వ్యవస్థ మీదనో లేదా రాచరిక వ్యవస్థ మీదనో లేదా సాయిధ విముక్తి, దేశ విప్లవo మీద పూర్తి అవగాహనతో చేసిన ఆందోళనలు కూడా కాదు. ఇది తాము ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యతో బాటు, మంత్రుల అక్రమ ఆర్థిక లావాదేవీలు, ఆ దేశంలో తాండవం చేస్తున్న నెపోటిజం, అవినీతి ప్రధానంగా 2017 ఎయిర్ బస్ కుంభకోణం వారి అసహనానికి కారణమైంది.
అది రోజు రోజు పేరుకు పోయి పాలకుల్లో పెరుగుతున్న అవినీతిపై యువతలో మొదలైన నిరసనకు చిన్న చిన్నగా కమ్యూనికేట్ అవుతున్న అసహనానికి పాలకులు పరిష్కారాలు వెతకకుండా ఈ నిరసనను అరికట్టుటకు కొరకు సామాజిక మాధ్యమాలపై విదించిన నిషేధం ఒక బ్రేకింగ్ పాయింట్ గా ఆకలి, నిరుద్యోగం, అవమానంతో రగిలి పోతున్న యువత ఆవేశం దావానలంలా పెల్లుబికింది. ఇది నిర్మాణాత్మకంగాను ప్రణాళికబద్దంగా జరిగింది కాదు. ఫలితంగా ఆ మూడు రోజులు ఉద్విగ్నంగా సాగింది. ప్రాణాలు పోయాయి. ఆ ఉద్విగ్నంలోనే ఆ యువత తమ పాకులుగా రెండు పేర్లను తెరపైకి తెచ్చారు. దానిలో నేటి ప్రధాని సుశీలఖర్కి , ఖాట్మండ్ నగర మేయర్బాలేంద్ర (బలెన్) షాను ఎంచుకోవడంలో పూర్తి అధ్యయనంతో, పూర్తి అవగాహనతో సూచించిన వ్యక్తులు గాదు. ఒక పాపులర్ గాయకుడిగా పేరు ఉండి ఖాట్మండు నగర మేయర్ గా ఎన్నికై నిర్మాణాత్మక అభివృద్ధికి పూనుకున్నాడు. కాబట్టి ఇతనే ప్రధానమంత్రి అయితే దేశం మొత్తం ఈ విధంగానే అభివృద్ధి చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో కొందరు, ఇంకొందరేమో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా అక్కడి న్యాయ వ్యవస్థను తీర్చిదిద్ది పాలకుల కుట్రతో అభిశంసనకు గురైన సుశీలఖర్కినీ ఒక నిబద్ధతకు చిహ్నంగా భావించడంతో వారిని సూచించారు. మొత్తంగా సుశీల కర్కి ప్రధానిగా ఎంపికయ్యారు.
2026 మార్చిలో జరిగే ఎన్నికల తదనంతరం ఆ దేశం ప్రజాస్వామిక దేశంగా పరిణామం చెందుతుందని ఆశిద్దాం.. నేపాల్ సంక్షోభం నేపథ్యంలో అక్కడి పరిణామాలు మన దేశానికి లేదా మన రాష్ట్రానికి అన్వయిస్తూ కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారతదేశం రాజ్యాంగం గొప్పతనాన్ని మరోసారి చర్చించబడుతున్న సందర్భం కూడా. సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే పటిష్ట భారత రాజ్యాంగం గొప్పతనాన్ని మరొక సారి కీర్తించారు. ఎవరికి ఇష్టమున్న లేకున్నా గత 75 సంవత్సరాలుగా భారత రాజ్యాంగ విలువలు ప్రజలకు చేరాయి. రాజ్యాంగాన్ని అమలు చేసే నాయకులు రాజ్యాంగ నిబద్ధతకు తూట్లు పొడిచే ప్రతి సందర్భంలో ప్రజలు, పౌర రక్షణకు పూనుకుంటూ వస్తున్నాయి. అందుకే పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగం ద్వారా సంక్రమించిన వోటు అనే ఆయుధంతో ఎన్నికల సమాధానం చెబుతున్నారు. తమను పీడిస్తున్న వారిని, తన సంక్షేమాన్ని పట్టని పాలకులను ఓడిస్తూ ఉన్నారు.
కొన్ని అంశాలని పరిశీలిస్తే నేపాల్ లో రాజకీయ పరిణామాలకు తెలంగాణ రాజకీయ పరిణామాలకు సామీప్యత కనిపిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు. ఏండ్ల రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి రాచరికాన్ని కూల్చి రాజ్యాంగ బద్ద పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు కూడా దశాబ్దాల పాటు పోరాడి సీమాంధ్ర పెట్టుబడి దారి దోపిడీ పాలకుల నుండి విడివడి రాజ్యాంగబద్ధంగా స్వరాష్ట్రాన్ని సాధించుకొన్నారు. ఇక్కడా రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పడిన తొలి ప్రభుత్వం కూడా పదేళ్లపాటు అదే రీతిన రాజ్యాంగ ఉల్లంఘన, నిరుద్యోగం , ఉపాధి కల్పనలో వైఫల్యం, అవినీతి, కుటుంబ పాలన దోపిడీ కొనసాగించింది . ఇష్టారీతిన వనరులను కొల్లగొట్టింది. మంత్రులు ఎమ్మెల్యేల ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా పెద్ద ఎత్తున తాండవమాడింది. అడ్డగోలు భూసేకరణకు పాల్పడింది. కనీసం నిరసన తెలిపే హక్కును కూడా తూలనాడింది. హైదరాబాద్ ధర్నా చౌక్ పై కూడా నిషేధం విధించింది.
నాడు ప్రజలు యుద్ధం లాంటిది జరిపే ధర్నా చౌక్ ఆక్రమించుకున్నారు. నిరసనల వేదికగా దాన్ని పునరుద్ధరించుకున్నారు. చివరికి వ్యక్తి స్వేచ్ఛను భంగపరుస్తూ ఫోన్ టాపింగ్ లకు కూడా తెగబడ్డారు. పాలకులు మారినా మారని పాలనా తీరుపై నిరుద్యోగ యువకులు, ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారు . కొలువుల కొట్లాట లాంటి ఉద్యమాలు చేశారు. రాజ్యాంగ విలువలు కలిగిన పరిణితి చెందిన పౌర సమాజం ఈ యువతకు తోడై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. ఈ పరిణామం భారత రాజ్యాంగ గొప్పదనమే.. కానీ విచ్చలవిడి అవినీతి పాలకుల బాధ్యతారాహిత్యం, అణచివేత ఎప్పుడైనా ప్రజా తిరుగుబాటుకు దారితీస్తుంది .తిరుగుబాటనేది తెలంగాణ వారసత్వ సంపదలో ఆరిపోనీ ఒక కాగడా. ఈ వాస్తవాన్ని గుర్తు ఎరిగి తెలంగాణ ప్రస్తుత పాలకులు వ్యవహరించాల్సిన అవసరాన్ని ఇటు తెలంగాణ పరిణామం.. అటు నేపాల్ పరిణామం గుర్తు చేస్తుంది.
-ధర్మార్జున్
తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి




