దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చిన చరిత్ర బీహార్ ప్రజలకున్నది. లోక్‌నాయక్‌గా పిలువబడ్డ జయప్రకాశ్ నారాయణ్ ఎమర్జెన్సీ అనంతరం బీహార్ నుంచే చేపట్టిన ఉద్యమం దేశ వ్యాప్తంగా పెనుసంచలన కలిగించింది. అపరకాళిగా గుర్తింపు ఉన్న ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఓటమికి బీహార్‌లోనే బీజం పడిరది. 11 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న మోదీ పాలనకు కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెరపడనుందనే సంకేతాలు వస్తున్నాయి. గతంలోలా బీహార్ నుంచే దేశంలో రాజకీయ మార్పులకు శ్రీకారం పడుతోందనే చర్చ నడుస్తోంది.
డా. ముచ్చుకోట సురేష్ బాబు
ఎన్నికల సమయంలో ఎన్డీయే అన్ని అడ్డదారులు తొక్కుతుంది. ప్రజలతో సంబంధం లేకుండా కేవలం ఎన్నికల్లో నెగ్గాలని చేసే విశ్వప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. దీనికి తోడు స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థలు దీనికి గత దశాబ్ద కాలంగా తోడ్పాటు ఇచ్చాయి. ఎన్నికల కమిషన్ తమ కనుసన్నలలో తెచ్చుకొని తాము ఆడిందే ఆట పాడిందే పాట అని కేంద్ర సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది. దేశ ప్రధాని మొదలుకొని గల్లీ నాయకుల వరకు ద్వేషపూరిత ప్రచారాన్ని నిర్వహిస్తూ సామాజిక సమగ్రత లేకుండా ప్రజలను వర్గాలుగా విడతీస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఎన్నికల కమిషన్. విద్వేష ప్రసంగాలు సమాజంలో చాలా వర్గాలు దూరం చేసింది.
ఎజెండా అభివృద్ధి కాదు, హిందుత్వ ఎజెండా. నరేంద్ర మోదీ పై అతిగా ఆధారపడటం ఎన్డీయే ను ముంచుతున్నాయి. ప్రపంచ దేశాలతో పేలవమైన సంబంధాలు, అమెరికా రష్యా చైనా దేశాలతో తటస్థ ధోరణి, కరవమంటే కప్పకు కోపం లేదంటే పాముకు కోపం అన్న చందంగా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచం గమనిస్తుంది.సుంకాల మోతతో ట్రంప్ బెదిరిస్తున్నా, భారత్ పాకిస్తాన్ యుద్దాన్ని నిలుపుదల చేసానని ప్రపంచ వేదికలపై ట్రంప్ పదే పదే చెప్తున్నా ఖండించకుండా ఎన్నికల సభల్లో స్వదేశీ ఉత్పత్తులను వాడమని తాను మాత్రం విదేశీ బూట్లు, సూట్లు, కంటి అద్దాలు మొదలుకొని ఫోన్, కార్ల వరకు అన్ని విదేశీ వస్తువులు వాడుతూ ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు.
లదాఖ్ సమస్యకు పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం ఆరు సంవత్సరాలుగా దాన్ని అణచివేసి అక్కడ ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నది, ఇక మణిపూర్ గురించి చెప్పనక్కరలేదు. పేలవమైన ఉత్పత్తి రంగం, నిర్వీర్యమైన విద్యారంగం, తోడ్పాటు లేని వ్యవసాయ రంగం,అతీగతీ లేని రవాణా వ్యవస్థ, ఛిద్రమైన ఉద్యోగ ఉపాధి రంగం. ఇలా అన్ని సమస్యలకు మూలం బీజేపీ అనుసరిస్తున్న విధానాలు అని ప్రజలు గ్రహిస్తున్నారు. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చిన చరిత్ర బీహార్ ప్రజలకున్నది. లోక్‌నాయక్‌గా పిలువబడ్డ జయప్రకాశ్ నారాయణ్ ఎమర్జెన్సీ అనంతరం బీహార్ నుంచే చేపట్టిన ఉద్యమం దేశ వ్యాప్తంగా పెనుసంచలన కలిగించింది. అపరకాళిగా గుర్తింపు ఉన్న ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఓటమికి బీహార్‌లోనే బీజం పడిరది.
11 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న మోదీ పాలనకు కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెరపడనుందనే సంకేతాలు వస్తున్నాయి. గతంలోలా బీహార్ నుంచే దేశంలో రాజకీయ మార్పులకు శ్రీకారం పడుతోందనే చర్చ నడుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందు నుంచే సీఎం నితీశ్ కుమార్ వ్యవహార శైలిపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతూ వస్తున్నది. ఏ ఎండకాగొడుగు పట్టే నితీశ్ కుమార్ పదవీ కాంక్ష ఎటువంటిదో దేశ ప్రజలందరికీ తెలిసిందే. పదవిని కాపాడుకోవడమే ఏకైక సిద్ధాంతం ఆయనది. ఎవరితోనైనా కలవగలడు, విడిపోగలడు అని నిరూపించుకుంటూనే వస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ప్రారంభ సమయంలో ఇటువైపు ఉన్న ఆయన అమాంతంగా ఎన్‌డీఏ వైపు తిరిగి తన నైజాన్ని మరోమారు నిరూపించుకున్నారు. ఒకసారి బీజేపీతో కలసి అధికారంలో ఉన్నారు.
తప్పుచేశానని బీజేపీతో కలవనని నమ్మించి మరోసారి రాష్ట్ర ప్రజల్ని వంచించారు. తీరా ఆర్‌జేడీతో కలసి అధికారంలోకి వచ్చి మళ్లీ ప్లేటు ఫిరాయించి బీజేపీ పంచన చేరారు. ఇవన్నీ నితీశ్ కుమార్ పట్ల బీహార్‌లో ఒక విధమైన ఏహ్య భావనకు కారణాలయ్యాయి. తాజాగా ఎన్‌డీఏ భాగస్వామిగా ఉన్న లోక్‌జన శక్తి పార్టీ అధినేత పాశ్వాన్ బహిరంగంగానే నితీశ్‌కుమార్‌పై విమర్శలు చేస్తున్నారు. సీఎంగా నితీశ్ కుమార్ చేస్తున్న తప్పులకు తమ పార్టీకి ఏ సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించడం ఎన్‌డీఏలోని లుకలుకల్ని బయటపెడుతున్నాయి. నితీశ్ కుమార్ బీహార్ సీఎం అభ్యర్థి కాదంటూ బీజేపీ సన్నాయినొక్కులు నొక్కుతున్నది. ఈ పరిణామాలు అధికార కూటమిలోని పార్టీల మధ్య ఉన్న అసంతృప్తులను వెల్లడిస్తున్నాయి. ఇదే తరుణంలో గత ఎన్నికల్లో మంచి ఫలితాలు పొందినా ప్రతిపక్షంలోనే ఉండిపోయిన ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రతిపక్ష నేతగా మంచి ఊపుమీదున్నారు. 2020 ఎన్నికల్లో 144 సీట్లలో పోటీ చేసిన ఆర్‌జేడీ అత్యధికంగా 75 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసినా కేవలం 19 సీట్లు మాత్రమే గెలిచింది. కమ్యూనిస్టు పార్టీలు తమకు కేటాయించిన సీట్లలో మంచి ఫలితాలనే రాబట్టాయి. అయినా మహాఘట్ బంధన్ అధికారానికి దూరమైంది. అయినా నిరుత్సాహానికి తావులేకుండా తేజస్వీ ప్రతిపక్ష నేతగా తన పాత్ర పోషిస్తూ వచ్చారు. నితీశ్ కుమార్ సీఎంగా ఉన్న ఎన్‌డీఏ డబల్ ఇంజన్ సర్కారు వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్నారు. గతంలో ఉపముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవంతో నితీశ్ పాలన మొత్తం కేవలం నినాదాలకే పరిమితమైందని ప్రజలకు దగ్గరగా అర్థమయ్యేరీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆర్‌జేడీతో కలసి ఏర్పాటైన మహాఘట్ బంధన్ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉపాధి, అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తామని ప్రజల్లో నమ్మకాన్ని నింపుతున్నారు. మహిళల కోసం ఐదేళ్ల కాలానికి ప్రత్యేకంగా లక్షన్నర రూపాయలు అందిస్తామని హామీ ఇస్తున్నారు. తమ పోరాటాల కారణంగానే నితీశ్ ప్రభుత్వం పేదలకు పెన్షన్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నదని గుర్తు చేస్తున్నారు. తామే అధికారంలో ఉంటే ఆ పథకాలు మరింత ఘనంగా ప్రజలకు చేరతాయని భరోసా కల్పిస్తున్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం 80 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిరదని, అందుకే ఆ లెక్కలు చూపడం లేదని తేజస్వి ఆరోపణల్లో నిజం ఉందని బీహార్ ప్రజలు నమ్ముతున్నారు. నితీశ్ పాలనలోని అవినీతికి కూలుతున్న కొత్త వంతెనలే నిదర్శనమని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు.ఇక రాష్ట్రంలో నిరుద్యోగుల్లో నితీశ్ పాలనపై తీవ్రమైన అసంతృప్తి ఉన్నది. ఇటీవల జరిగిన పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో అవినీతిపై పెద్ద దుమారం చలరేగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలోనూ ప్రభుత్వం పౌరసమాజం నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నది. మాజీ సైనికులు నితీశ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. నితీశ్ కుమార్‌పైనే ఏకంగా విమర్శలు చేస్తూ ఊరేగింపులు తీయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ప్రధాని మోదీ స్వయంగా బీహార్‌లో పర్యటిస్తున్నా వస్తున్న స్పందన అంతంత మాత్రంగానే ఉన్నది. ఎన్నికల కోసమే ఆయన అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు, గతంలో ఇలా అనేక సార్లు హడావిడి చేసిన దక్కిన ఫలితాలేవీ ప్రజలకు కనిపించడం లేదు. జీఎస్‌టీ పన్నుల తగ్గింపు కూడా బీహార్ ఎన్నికల స్టంట్ గానే దేశ ప్రజలు చూస్తున్నారంటే ఆయనపై ఉన్న విశ్వాసం ఏపాటిదో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాలన్ని నితీశ్‌తో పాటు ఆయన ద్వారా రాష్ట్రాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీకి కూడా మింగుడుపడని అంశాలు.
ఎన్నికల కమిషన్ బీహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆ రాష్ట్రంలో ప్రకంపనలకు కారణమైంది. ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్రంలో సుమారు 65 లక్షల వోటర్లను తొలగించడం పెనుదుమారాన్ని రేపింది. ఇందులో 18 లక్షల మంది చనిపోయారని, 52 లక్షల మంది బీహార్‌లో లేరని వచ్చిన లీకుల వైనంపై ప్రతిపక్షాలు ఆరా తీశాయి. ఇదే సందర్భంలో అసెంబ్లీ సమావేశాల్లో నితీశ్ కుమార్ మాట్లాడుతూ బీహార్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళుతున్న వలసదారులు తగ్గారని ప్రకటించడం, రాష్ట్రంలో లేనందునే 52 లక్షల మంది వోటర్లను తొలగించినట్టు ఈసీ చెప్పడం పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయి. ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ తాము ఎవరి వోట్లు ఎందుకు తొలగించారో ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని వ్యాఖ్యానించి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు చందంగా వ్యవహరించడమే. ఈ తరుణంలోనే ఈ విషయంపై ప్రతిపక్షాలు, మీడియా కూడా సీరియస్‌గా దృష్టి సారించాయి. గత లోక్‌సభ ఎన్నికల వోటరు లిస్టులను చేతబట్టుకుని ఇంటింటికీ తిరగడంతో అసలు నిజాలు బహిర్గతమయ్యాయి. వోటర్లను తొలగించడం కోసం ఎన్నికల సంఘం చేసిన కుట్ర బయటకు వచ్చాయి. పార్కులో ఆడుకునే చిన్న పిల్లలతో సంతకాలు చేయించి వేల మందిని వోటరు లిస్టుల నుంచి తొలగించిన ఘటనలు వెలుగుచూశాయి. వివిధ ఛానళ్లు వోటరు లిస్టులో మృతి చెందిన వారు వీరేనంటూ ఏకంగా వారితోనే ఇంటర్యూలు చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి.
వోటు చోరీ ద్వారానే బీజేపీ గెలుపంటూ రాహుల్ గాంధీ పేల్చిన బాంబు ప్రకంపనలు కూడా తోడవడంతో బీజేపీ గెలుపుకోసం భారత ఎన్నికల కమిషన్ కంకణం కట్టుకుని పని చేస్తున్నదనే నిర్ధారణైంది. సరిగ్గా అదే సమయంలో సుప్రీం కోర్టు కూడా తొలగించిన వోటర్ల వివరాలను, తొలగించడానికి కారణాలను స్పష్టం చేస్తూ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌తో పాటు పత్రికలు, వివిధ మాధ్యమాలతో పాటు అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిస్ప్లే చేయాలని ఆదేశించింది. రాహుల్ గాంధీ బీహార్‌లోనే వోటరు అధికార యాత్ర చేపట్టి దేశ ప్రజల్ని బీహార్‌లో రాజకీయ మార్పువైపు చూసేలా చేశారు. మహాఘట్ బంధన్‌లోని అన్ని పార్టీల నేతలను కలుపుకుని మొత్తంగా 16 రోజుల పాటు 25 జిల్లాలో 1300 కిలో మీటర్లు పైగా చేసిన యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసింది. ఎస్‌ఐఆర్‌లోని అవకతవకలను ఎత్తి చూపుతూ ఎన్నికల కమిషన్, బీజేపీ ఓక్కటే అని నిరూపించడంలో రాహుల్ విజయం సాధించారు.
ఈ వోటర్ అధికార్ యాత్ర లో కేవలం ఆ విషయానికే పరిమితం కాకుండా రాష్ట్రంలో మహిళా, రైతుల సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలను లేవనెత్తారు. బిహారీ పద్దతులను అనుసరించడం, వారిలా టవల్ ను మెడపై వేసుకోవడం, ద్విచక్రవాహనాలను స్వయంగా నడుపుతూ, హైవే వెంట దాబాలు సందర్శిస్తూ స్థానికులతో మమేకమయ్యారు. మహిళలు, దళితులు, ముస్లింలు, యాదవులు, గిరిజన, ఓబీసీ, ఈబీసీ వర్గాల వారి సమస్యలను ప్రస్తావిస్తూ ముందుకు కదులుతూ ఆయా వర్గాల్లో విశ్వాసాన్ని నింపారు. తమిళనాడు సీఎం స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, వామపక్ష పార్టీల నేతలు, కాంగ్రెస్ సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్దరామయ్య తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రంలో యాదవులు, ముస్లింల మద్దతున్న పార్టీగా ఆర్జేడీ. గత ఎన్నికల్లో ఏకంగా 12 సీట్లను గెలుచుకున్న సీపీఐ(ఎంఎల్) సహా ప్రధాన పక్షాలైన సీపీఐ, సీపీఎంలు పేద, అణగారిన వర్గాల పార్టీలుగా మరింత పట్టు పెంచుకున్నాయి. ఈ పరిణామాల కారణంగా రాష్ట్రంలో పని చేస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా, లోక్ జనశక్తి పార్టీ వంటి కొత్త పార్టీలు కూడా ఈసారి మహాఘట్ బంధన్ కూటమిలో భాగమవడంతో రాష్ట్రంలోనూ, అనంతరం దేశంలోనూ మార్పు తథ్యమే.