‘సార్ మీరు కాల్ చేసినప్పుడు యిందాక వాష్ రూమ్ లో వున్నా సార్, సారీ సార్ లూజ్ మోషన్స్, ఫోను తియ్యొస్తలేదు, మాటాడొస్తలేదు.’ అని రొప్పుతూ చుట్టూ చూసిన జీన్స్‌గాడు ‘ప్రామిస్ సార్, నా ఫోను డెడ్ అయింది సార్ లేకపోతే వీడియో కాల్ చేసేవాణ్ణి సార్ అందుకే నా పక్క పేషెంట్ ఫోన్ తీసుకొని… అమ్మా…’ రొష్టుతూ ఆగాడు. పక్కనే వున్న పేషెంట్ కాని పేషెంట్ జీన్స్‌గాణ్ణి యెగాదిగా చూశాడు. ప్లీజింగుగా ముఖం పెట్టిన జీన్స్‌గాడు పేషెంట్ కాని పేషెంట్ గెడ్డం నిమిరి ప్రాధేయపడ్డాడు.

‘ఇప్పుడెక్కడున్నావ్?’ అవతల బాస్ వాయిస్. బస్టాపులో వుండి ‘హాస్పిటల్లో బెడ్ మీదవున్నా’ అనేసరికి అందరూ జీన్స్‌గాడివంక చూశారు. అందర్నీ నవ్వూ యేడుపు కలగలిపిన ఫేస్ పెట్టుకు చూశాడు జీన్స్‌గాడు. ‘ఫిష్ మార్కెట్‌లా గోలగోలగా వుంది?’ మళ్ళీ అవతల బాస్ వాయిస్.

‘మీరు చెప్పింది నిజం సార్, యిప్పుడు హాస్పిటల్స్ అన్నీ ఫిష్ మార్కెట్ కంటే అన్యాయంగా వున్నాయి సార్’ జీన్స్‌గాడి మాటలకు పలురకాలుగా చూశారంతా. ‘ప్లీజ్ సార్ మీరు సేవ్ చెయ్యకపోతే నా జాబ్ పోతుంది సార్’ అటు ఫోన్లోనూ యిటు చుట్టూ వున్నవాళ్ళతోనూ వొకేసారి అన్నాడు.
‘నేను మాట్లాడుతానియ్యి’ సైగ చేస్తూ మెల్లగా అన్నాడు వొక టక్కుగాడు. ఫోను యిచ్చేశాడు జీన్స్‌గాడు. ఫోనందుకున్న టక్కుగాడు ‘వీడియో కాల్ చెయ్యమంటారా? ఇక్కడ జరిగింది కళ్ళతో చూడలేక మేమందరం వాంతులు చేసుకున్నాం,’ అనేసరికి, ‘కండిషన్ యెలా వుంది?’ అవతలి వాయిస్. ‘మాదా?’ అని టక్కు. ‘మీది కాదయ్యా’ విసుక్కున్న అవతలి వాయిస్. ‘సెలైన్లు యెక్కిస్తున్నారు సార్’ యేడుపుగొంతుతో అని ‘మా ఆవిడ మాట్లాడుతుంది’ అని పక్కావిడకు ఫోను యిచ్చేశాడు టక్కుగాడు. ఆవిడ సిగ్గుపడి ఫోను పక్కనున్న అమ్మాయికి యిచ్చేసింది.

ఆ అమ్మాయి ‘సార్, మీరు పేషెంటుని డిస్టర్బ్ చేస్తే యెలా?’ అంది సీరియస్సుగా. పక్కనే వున్న మరో టైగాడు ఫోను తను లాక్కున్నాడు. ‘మీరెవరు?’ అవతలి వాయిస్ విని ‘తను మా నర్స్, నేనెవరు అని అడుగుతారేమో?, నేను డాక్టర్ని,’ అన్నాడు. ‘సారీ,’ అవతలి వాయిస్ కంప్లీట్ కాకముందే ‘మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ యిస్తారు కదా? వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ యివ్వొచ్చు కదా?’ అన్నాడు డాక్టర్ హోదాలో టై.
రియల్ నటుల మధ్య పోటీ పెరిగినట్టుంది.

‘అందుకే, బావా ఆ వుద్యోగం మారిపోమని చెప్పా, వింటేగా? ప్రతీ అడ్డమైన లోఫర్‌గాడికీ ఎక్ష్ప్లనేషన్ యిచ్చుకోవాలంటే’ అంది ఫోనుకు దగ్గరగా వచ్చిన మరో అమ్మాయి. టాలెంట్ యెలా చూపించాను, బెస్టా- అన్నట్టు కళ్ళెగరేస్తూ చూసింది. ఆపై నవ్వుతూ భుజాలెగరేసింది.
జీన్స్‌గాడికి జీన్స్ జారిపోయాయి. ఆపబోయాడు. ఫోను అతని చేతికి రాలేదు. ఓ నడీడు ఆవిడ ఫోను అందుకొని ‘యేరా?, నీకు మోషన్స్ అవ్వా? ఎమోషన్స్ లెవ్వా? మనిషి పుట్టుక పుట్టావా? లేక మరేదైనా పుట్టుక పుట్టావా? బ్లడీ’ ఆమె నోటిగట్లు తెగాయి.

అవతల బాస్‌కు వాయిస్ లేదు. లేదు, ఫోను కట్టయింది. జీన్స్‌గాడు కుప్పకూలినట్టు కూర్చుండి పోతే, ‘నీ ప్రాంక్ వీడియోస్ నా దగ్గరా?’ అంటున్న ఆవిడను చూస్తూ ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలాగుంది’ అనుకున్నారు చూస్తున్నవాళ్ళు. ఇది ప్రాంక్ కాదని తన ప్రాణ సంకటాన్ని చెప్పడానికి జీన్స్‌గాడికి మాటలు రాలేదు?!
– బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *