నల్లపూసల దండ

తెల్లారే, పొద్దుకూకే

నీ ఎంట వచ్చిన వాళ్లంత ఇల్లు చేరిరి

ఏ దిక్కున వినాలయ్య నీ అడుగుల శబ్దం

తాగి ఇంటికొస్తుంటే

ఏ గుంతల పడుతావోనని భయం

ఏ బండి అయిన గుద్దిపోతుందేమోనని

దిగులుతోని సగం సచ్చి జీవిస్తున్న

సెకండ్ల ముల్లులెక్క ఒళ్ళుమర్చి కష్టంచేసి

ఎవడో బతుకుకొరకు

తయారు చేసుకున్న ఎర్రమందుకు

నీడొక్కలు ఎండకట్టి దోసిట్ల

పైసలు ధారపోస్తివి

కడుపులో పేగులు తెగిపోయి

నొప్పితోని తిప్పల పడుతుంటే

చిన్నాభిన్నమైన సంసారాన్ని

ఏ సర్కారు ఆదుకోదు

ఏ చెట్టునీడ దొర్కదు

ఇంట్లో సరుకులు నిండుకున్నప్పుడల్లా

చలిజ్వరంపట్టి ఒళ్ళంత కాలిపోతున్నా

సంసారాన్ని నెట్టుకొస్తున్న

మిణుకుమిణుకుమని వెలిగే

దీపంలాంటి జీవితాన్ని

తాగి ఊర్లో వీధి కథలు

చెప్పుకున్నట్లు ఎండకట్టకు

కండ్లకద్దుకొని మురిసిపోనీక

రెండు మొలకలు కడుపులో మొలిసినవి

వాటిని ఎడారి ఇసుకలో కమ్మి

నా మెడలో ఉన్న నల్లపూసల దండ తెంపకయ్య

-పిల్లి బాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *