ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా

పుష్య అమావాస్య నాగోబా కొలువు

నాగోబా జాతర ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగో బా జాతరలో సర్పజాతిని పూజించ డమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేష నారాయణ మూర్తి) పురివిప్పి నాట్యమాడు తాడని గిరిజనుల నమ్మకం. అమా వాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందిం చే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్య మవుతాడని గిరిజనులు విశ్వసి స్తారు. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత. నాగోబా దేవాల యం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ ‌దగ్గర కెస్లాపూర్‌ ‌గ్రామంలో ఉంది. కెస్లాపూర్‌లో జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కెస్లాపూర్‌ ‌జనాభా 400కు మించదు. కాని పండగ నాడు లక్షలాది మందితో అది జనా రణ్యంగా మారుతుంది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 4వరకు నిర్ణీత రోజుల పాటు గిరిజ నులు ఈ పండుగ జరుపు కుంటారు. ఏటా పుష్యమాస అమావాస్య రోజున జాతర ప్రారంభ మవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమ వుతాయని గిరిజనుల నమ్మకం.

నాగోబా చరిత్రను గోండు గిరిజ నులు రకరకాలుగా చెప్పు కుంటారు. పూర్వం మేస్రం కుటుం బానికి చెందిన నాగాయి మోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా, ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైందని చెపుతారు. ఆ తరువాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్ఠలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చు కోమ నగా గౌరి సంప్రదాయాలను లెక్క చేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తరువాత ఉడుంపూర్‌ ‌నుంచి గరిమెల వరకు అతనికోసం వెతికిన గౌరి గోదావరి లోనే సత్యవసి గుండంలో కలిసి పోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తరువాత పెళ్ళి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని (పేథికొరి యాక్‌) ‌చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ ‌గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. అదే కెస్లాపూర్‌ ‌గ్రామంగా మారి పోయింది. నాగేం ద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మిం చారు. ప్రతి ఏటా పుష్ట మాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమ వుతాడని గిరిజనుల నమ్మకం. నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మేస్రం వంశంలో వస్తారు.

వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిన మోస్త్రం వంశస్థులలోని కటోడా దివాకర్‌ ‌గారికి , ఘాడియా సంకేపాయిలర్‌ ‌వాడే శాఖల వారు కేస్లాపూర్‌ ‌జాతరకు 16 రోజుల ముందు పుష్యమాస పౌర్ణమికి ఒక రోజు ముందు తమ కులదైవాన్ని పుష్య అమావాస్య రోజున అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరి వెళతారు. కేస్లాపూర్‌కు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న కలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నదిలో హస్తమడుగు వరకు అరణ్యం గుండా నడచి వెళ్లి గోదావరి జలం కలశంతో తీసు కుంటారు. హస్తమడుగులో గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్ష మయి దర్శన మయిందనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తుం టారు.పుష్య పౌర్ణమినాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలం లోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకు వచ్చేందుకు బయలు దేరుతారు.

దీంతో జాతర ప్రారంభమైనట్టే. జలాన్ని తీసుకు రావడానికి కెస్లాపూర్‌ ‌నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు. కెస్లాపూర్‌ ‌చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారు చేయడం ఆచారంగా వస్తోంది. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిల్ల వంశస్థుడైన కుమ్మరి ఇళ్ళకు వెళ్లి, కుండలు తయారు చేయాలని కోరుతారు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, (కాగులు), వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర (చిప్పలు), దీపాంతలు, నీటికుండలు కలిపి తయారీకి ఆర్డర్‌ ఇస్తారు. మేస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా, వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు.

కేస్లాపూర్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి, అక్కడ వెలిసిన ఇంద్రాదేవికి సామూహికంగా పూజలు జరుపుతారు. ఇక్కడి నుంచి కేస్లాపూర్‌ ‌చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద నాలుగు రాత్రులు, ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్‌ ‌మందిరానికి వాయిద్యాలతో ఊరే గిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రి చెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి, పది కిలోమీటర్ల దూరం లోని సిరికొండ చేరుకుంటారు. సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలశం భద్ర పరిచిన మర్రిచెట్టు దగ్గర బావినీరు మట్టి కలిపి ఒక పుట్టను తయారు చేసి ఆలయం పక్కన ఉన్న పూల మందిరాన్ని ఆ మట్టితో అలికి అమావాస్య అర్థ రాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు.

గోదావరి నదినుంచి తెచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్ర పరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్య క్రమాలకు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవ ధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవ ధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటికీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్టమీది రుమాలు ‘పైకెత్తినట్లు’ కనిపిస్తే పూజా కార్యక్రమాలను ఆరం భిస్తారు. ఇప్పటికీ నాగ దేవుడు రాగి చెంబులోని పాలు తాగు తాడనే విశ్వాసం వారిలో ఉంది. మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్‌లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళతారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్‌ ‌కీయ్‌వాల్‌’ అం‌టారు. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు బుట్టలో పూజ సామాగ్రిని ఉంచుకుని, కాలినడకన బయలు దేరతారు. కేస్లాపూర్‌లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను ‘భేటి కొరియాడ్‌’ అని పిలుస్తారు. పూజలకు ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌ ‌లోని (బోడుందేవ్‌) ‌జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళతారు.

గతంలో మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరి కులంటేనే ఆదివాసులు పరుగెత్తే వారు. గిరిజనుల వద్దకు అధికారు లెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించాడు. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థి తులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ‌హైమన్‌డార్ఫ్ ‌ను ఆదిలాబాద్‌ ‌జిల్లాకు పంపగా, కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసు కొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ను ప్రొఫెసర్‌ 1942‌లో మొదట నిర్వహించాడు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో జనవరి 28 నుంచి 8 రోజుల వరకు నిర్వహించ నున్నారు. మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్‌రావ్‌ ‌పటేల్‌, ‌పెద్దలు చిన్ను పటేల్‌ ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలు, కార్యక్ర మాలు, మెస్రం వంశీయులు నిర్వహించే మహా పూజలతో పాటు రోజువారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *