సమానత్వం దిశగా ప్రపంచ దేశాల మహిళల నడక ఇంకా ప్రారంభం కాలేదన్న దిగ్భ్రాంతికర వాస్తవం తెలిసి వచ్చాక యునైటెడ్ నేషన్స్ (యుఎన్) జనరల్ అసెంబ్లీ జెండర్ సమానత్వం, స్త్రీల హక్కులు, సామాజిక రంగాలలో స్త్రీల భాగస్వామ్యం అనే భావనల ప్రచారం లక్ష్యంగా 1975 ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. 1976 నుండి 1985 వరకు అది అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా కొనసాగింది. జెండర్ సమానత్వం, స్త్రీల హక్కులు, సామాజిక రంగంలో స్త్రీల భాగస్వామ్యం రాజ్యాంగబద్ధమైనవే అయినా ఆచరణలో కనబడకపోవటానికి పితృస్వామ్య రాజకీయాలు కారణమని నిరూపించిన స్త్రీవాద సిద్ధాంత అవగాహన నుండే భావజాల రంగంలో సాంస్కృతిక పోరాటానికి అటు సాహిత్య సృజనకు కొత్త వనరులు ఇటు సాహిత్య విమర్శకు కొత్త పరికరాలు సమకూడి వచ్చాయి. వెరసి స్త్రీవాద చైతన్యంతో తెలుగు సాహిత్యం కొత్త పుంతలు తొక్కింది.
స్త్రీ శరీరం, మనసు, మెదడు ఇంటా, బయటా ఎన్ని సంప్రదాయ సూత్రీకరణల చట్రంలో, విధినిషేధాల ఒత్తిడిలో నలిగిపోతున్నాయో సూక్ష్మస్థాయిలో గుర్తించి గుట్టు విప్పి చెప్పే రచనలు వచ్చాయి. స్త్రీకి కొరవడిన లైంగిక, సామాజిక స్వేచ్ఛలను చర్చలోకి తెచ్చాయి. స్వేచ్ఛ కోసం తపన, అన్వేషణ స్త్రీ జీవిత గమనం, గమ్యం అవుతున్న దృశ్యాన్ని ఆవిష్కరించాయి. ఊడలు దిగిన మర్రిచెట్టు వంటి పితృస్వామ్యం నీడలో సూర్యరశ్మి సోకనియ్యని కుటుంబం ఒక్కటే కాదు, కులం, మతం, రాజ్యం కూడా స్త్రీల జీవితంపై పెత్తనం సాగించే అధికార వ్యవస్థలే అని తెలిసివచ్చే కొద్దీ స్ర్తీజాతి అన్న ఏక ముఖ అస్తిత్వం భిన్న కుల మత ఆర్ధిక స్థాయీ భేదాల వల్ల బహుళ సమూహాలుగా విడిపోయింది.
బహుళ సమూహాల స్త్రీల అనుభవాలు సమస్యలు మరింత సూక్ష్మస్థాయిలో సాహిత్య వస్తు గౌరవాన్ని పొంది స్త్రీవాద సాహిత్య పరిధిని పెంచాయి. దళిత బహుజన ముస్లిం క్రైస్తవ మైనారిటీ, ఆదివాసీ స్త్రీల అనుభవాలతో వైవిధ్యభరితమైన స్త్రీల జీవిత వాస్తవికత అర్ధం కావటమే కాక ఆయా సమూహాల మధ్య ఏదో ఒక మేరకు సంభాషణకు, సానుభూతికి, సహానుభూతికి, స్నేహపూర్వక సంబం





