అచ్చు కాయిదం కింద దాగిన అక్షరాలు
ఒకే తీరుగా రాలిపడ్డట్టుగ సాదృశ్యాలు
తెల్లారేసరికి తీగ మల్లె చెట్టుకు
పూసిన తెల్లని పూలన్నీ ఏకరీతి పరిమళం
మూలాలన్నీ ఒకటే వాటి కణాలు వేరువేరు
జన్యుపటం ఒకటే సంస్కృతీ ఒక్కటే
ముద్రలన్నీ ఒకే స్వభావ ఆకృతులు
****
ఆ కనురెప్పల సుతి మెత్తని కదలికల్లోనో
సుకుమార నవ్వుల పలు వరసల్లోనో
ఏక ప్రకారంగా మెరుపుల పలుకులు
నున్నటి గుండ్రని గుండు ఆకారమో
బూడిద గుమ్మడికాయ తలకాయో
ఏదో ఏక ముఖ కవలికల పోలికలు
నడ్డి ముక్కో, నిటారై నిలిచిన నాసికమో
చేతలో చేష్టలో నడతల్లోనో మరెక్కడనో
చూడంగనే ఒకే కొమ్మ రెమ్మలనే స్పురణ
తోడబుట్టిన అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెల్లు
వేర్వేరు పుష్పాలైనా ఒకే తీరైన సువాసనలు
తండ్రీ కొడుకుల ఏకరూప సోయగం
తల్లీ బిడ్డలు నోట్ల కెల్లి ఊడి పడ్డట్టే
అమ్మమ్మా మనవరాళ్ళు అచ్చు కొట్టినట్టు
తాతా మనుమలు తధాస్తు తరీఖ
చూస్తే వేరు కావచ్చు గాని జాడలన్నీ ఒక్కటే
ఒకరినొకరిని పసిగట్టుకొని భద్రపరచాలి
కిలుక్కుమనగానే వెలిగిన నవ్వులే కావచ్చు
నయనాల నుంచి ఒలికిన కన్నీళ్లు కావచ్చు
ఒకే నడక ఒకే నడవడిక , తీగల మొదల్లు ఒకటే
తరతరాల బంధాల జీవితం ఒక వారసత్వం.
-అన్నవరం దేవేందర్





