దోమల రాష్ట్రం

రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దోమల విజృంభణ ప్రజలకు నరకం చూపిస్తున్నది  . పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఇల్లూ ఒక ‘ఫీవర్ వార్డు’లా .. డెంగ్యూ, మలేరియా, చికెన్ గన్యా వంటి వ్యాధులు సామాన్యుడి నడ్డి విరిచే   ప్రమాదం పొంచి ఉన్నది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అన్నింటికంటే విస్మయకరమైన విషయం ఏమిటంటే.. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను మున్సిపల్ శాఖ తుంగలో తొక్కడం. ఇది కేవలం ఒక శాఖ వైఫల్యం మాత్రమే కాదు, ప్రస్తుత ప్రభుత్వ అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనం.

నగరంలో పారిశుధ్య పరిస్థితి బాగా లేదని, డ్రెయినేజ్ నీరు రోడ్లపైకి వొస్తోందని ముఖ్యమంత్రి అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి   మూసీ నదిలో పెరుగుతున్న కాలుష్యం, దోమల విజృంభణపై వొచ్చిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ, చెత్త సేకరణ కోసం సుమారు 5,000 ఆటోరిక్షాలు వినియోగిస్తున్నప్పటికీ పారిశుధ్య కార్మికులు వ్యర్థాలను సమర్థంగా సేకరించడం లేదన్నారు. పారిశుధ్య కార్మికులు సమర్థవంతంగా పనిచేసేలా మున్సిపల్ పరిపాలన శాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పారిశుధ్య కార్మికులపై చేసిన విమర్శలు ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర నిరసనలకు  దారితీశాయి. మున్సిపల్ పరిపాలన మరియు హోం వంటి కీలక శాఖలు తన ఆధీనంలో ఉన్నప్పటికీ బాధ్యతను కార్మికులపై నెట్టివేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తూ నిరసనలు వ్యక్తం చేసాయి. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా ఒక శాఖపై అసహనం వ్యక్తం చేశారంటే, ఆ శాఖలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవొచ్చు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య పనులపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి పదే పదే ఆదేశించినా, మునిసిపల్ శాఖలో కదలిక లేకపోవడం ఆశ్చర్యకరం.

తెలంగాణలో ఇటీవల కనిపిస్తున్న దోమల విజృంభణ, పారిశుధ్య సమస్యలు మరియు ప్రజారోగ్య ఆందోళనలు ఒక కీలక హెచ్చరికగా భావించాలి. నగరాల్లోనే కాదు, పట్టణాలు–పల్లెల్లో కూడా పారిశుధ్య వ్యవస్థలో ఉన్న లోపాలు బహిర్గతమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో మూసీ నది కాలుష్యం, డ్రెయినేజ్ నీరు రోడ్లపైకి రావడం, చెత్త నిర్వహణలో లోపాలు ప్రజా ఆందోళనలకు కారణమవుతాయి. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నగర పారిశుధ్యంపై ఉన్న వాస్తవ పరిస్థితిని వెలుగులోకి తెచ్చాయి. ఒక రాష్ట్ర రాజధానిలోనే డ్రైనేజీ నీరు రోడ్ల పైకి రావడం, చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడం, దోమలు విపరీతంగా పెరగడం వంటి పరిస్థితులు కొనసాగుతున్నాయంటే అది ఒక పరిపాలనా లోపాన్ని సూచిస్తుంది. దోమలు కేవలం ఇబ్బందికరమైన కీటకాలు మాత్రమే కావు; అవి డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి.
హైదరాబాద్‌కు జీవనాడిగా భావించిన మూసీ నది ఇప్పుడు కాలుష్యానికి ప్రతీకగా మారింది. పరిశ్రమల వ్యర్థాలు, మురుగు నీరు, చెత్త మూసీ లోకి వదలడం వల్ల దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నదులు, కాలువలు, చెరువులు మురుగు నిల్వ కేంద్రాలుగా మారితే దోమల పెరుగుదల సహజం. మూసీ నది పునరుద్ధరణపై ఎన్నో ప్రణాళికలు ప్రకటించినా వాటి అమలులో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు; ఇది ఆరోగ్య సమస్య కూడా.

హైడ్రా  చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ చర్యలు మరియు అన్యక్రాంతమైన ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే క్రమంలో కూడా    దోమల వ్యాప్తి జరుగుతుంది. చెరువుల పునరుద్ధరణలో భాగంగా హైడ్రా చేపడుతున్న  గుర్రపుడెక్క  తొలగింపు కూడా దోమల వ్యాప్తి పై   ప్రభావం చూపుతుంది  గుర్రపుడెక్క అనేది చెరువులపై ఒక దట్టమైన పొరలా పేరుకుపోతుంది. దీనిని తొలగించే క్రమంలో దోమల ఉధృతి పెరగడానికి ప్రధాన కారణాలు: గుర్రపుడెక్క ఆకుల కింద, వేర్ల మధ్య లక్షలాది దోమల లార్వాలు (గుడ్లు) పెరుగుతాయి. యంత్రాలతో ఈ మొక్కలను బయటకు తీసినప్పుడు, అక్కడ నిద్రాణంగా ఉన్న దోమలు ఒక్కసారిగా పరిసర ప్రాంతాలకు విస్తరిస్తాయి.

మొక్కలు తొలగించిన తర్వాత నీరు నిలకడగా ఉన్న చోట, సూర్యరశ్మి నేరుగా తగిలి నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది కొన్ని రకాల దోమల పునరుత్పత్తికి అనుకూలంగా మారుతుంది. చెరువుల్లో పేరుకుపోయిన దశాబ్దాల నాటి మురికిని, పూడికను కదిలించినప్పుడు కూడా దోమల సమస్య తీవ్రమవుతుంది: పూడిక తీసేటప్పుడు నీటి అడుగున ఉన్న కుళ్ళిన పదార్థాలు పైకి వొస్తాయి. ఇది దోమల లార్వాలకు పోషకాహారంగా మారుతుంది.  పునరుద్ధరణ పనుల కోసం నీటిని మళ్లించినప్పుడు లేదా పాక్షికంగా ఎండబెట్టినప్పుడు, అక్కడక్కడా చిన్న చిన్న నీటి కుంటలు ఏర్పడతాయి. ప్రవహించని ఈ ‘స్టాగ్నెంట్ వాటర్’ దోమల ఉత్పత్తి కేంద్రాలుగా  మారుతాయి. చెరువుల్లో గుర్రపుడెక్కను తొలగించినప్పుడు, వాటిపై ఆధారపడి జీవించే కొన్ని కీటకాలు లేదా కప్పలు వంటివి కూడా దూరమవుతాయి. దోమలను తినే సహజ సిద్ధమైన జీవులు తగ్గడం వల్ల, దోమల సంఖ్య అదుపు తప్పుతుంది. నీరు పూర్తిగా శుద్ధి అయ్యే వరకు  ఈ మధ్యంతర కాలం  ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది.

చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు దోమల నియంత్రణకు  గుర్రపుడెక్క తొలగించిన వెంటనే ఆ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా యాంటీ-లార్వా కెమికల్స్ స్ప్రే చేయాలి. నీటిలో దోమల లార్వాలను తినే గంబూసియా చేపలను వదలడం లేదా నీటిపై ఆయిల్ లేయర్స్ వేయడం వల్ల లార్వాలు శ్వాస తీసుకోలేక చనిపోతాయి. గుర్రపుడెక్కను తీసి ఒడ్డున పడేయడం వల్ల కూడా దోమలు వొస్తాయి. కాబట్టి తీసిన వ్యర్థాలను వెంటనే అక్కడి నుండి తరలించాలి. పునరుద్ధరణ పనులు జరుగుతున్న చెరువుల చుట్టుపక్కల ఉన్న బస్తీల్లో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలి.
చెరువుల పునరుద్ధరణ అనేది దీర్ఘకాలంలో మంచిదే అయినప్పటికీ, పనులు జరిగే సమయంలో శాస్త్రీయ జాగ్రత్తలు తీసుకోకపోతే అది ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతుంది. హైడ్రా కేవలం కూల్చివేతలు, పునరుద్ధరణపైనే కాకుండా.. ఆ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే దోమల వంటి సైడ్ ఎఫెక్ట్స్‌ను నియంత్రించడానికి ఎంటమాలజీ  విభాగంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  దోమల విజృంభణ పెరిగితే మొదట ప్రభావితమయ్యేది పేద ప్రజలే. బస్తీలు, డ్రైనేజీ పక్కన ఉన్న కాలనీలు, నీరు నిలిచే ప్రాంతాలు ఎక్కువ ప్రమాదంలో ఉంటాయి.  పారిశుధ్యం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకోవాలి. ఇంటి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో పడేయడం వంటి చర్యలు చివరకు మనకే హానికరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *