- జీతాల చెల్లింపులో ఆలస్యం చేయొద్దు..
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
- సంక్రాంతి వేళ జీపీ సిబ్బందికి తీపి కబురు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 9 : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 9,2351 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, వీరికి ప్రతినెలా రూ.116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. వీరందరికీ జీతాల చెల్లింపులో ఆలస్యం కాకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీ రాజ్, ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ చానెల్‌లో వీరికి జీతాలు చెల్లించాలని చెప్పారు. గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని .. వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
కేంద్రం నుంచి పంచాయతీ లకు విడుదల అయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు రాబట్టుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.




