డమ్మీ హామీల్లా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా?
రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ అడుగడుగునా రైతులను దగా చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ప్రభుత్వ చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో రైతు విజయోత్సవాల్లో 2750 కోట్లు రుణమాఫీ కోసం ముఖ్యమంత్రి విడుదల చేశారు. రెండు నెలల కిందట రైతు రుణమాఫీ కోసం ఇచ్చిన చెక్కు ఇప్పటివరకు ఇంకా సంగారెడ్డి రైతులకు చేరలేదని తెలిపారు.
రాష్ట్రంలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 24 లక్షల 57,000 మంది ఉన్నారు. ఇందులో ఎక్కువ శాతం దళితులు, గిరిజనులు, బీసీలు మాత్రమే ఉన్నారు. దళిత గిరిజన బీసీ రైతుల కడుపు కొట్టడమేనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? అని హరీష్ రావు ప్రశ్నించారు. కోటిమంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. కూలీల కడుపు కొట్టేందుకు మీకు చేతులు ఎలా వొచ్చాయి? అని అన్నారు.కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే పది లక్షల మందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామంటున్నారు.
సోమవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. 90 శాతం ఎగ్గొడుతున్నారు. రకరకాల కారణాలతో కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మట్టి పనికి వెళ్లే 90 లక్షల మంది రైతు కూలీలకు పథకం ఎగ్గొట్టడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే దిక్కు లేకపోతే ఎలా? నవంబర్ 30న ముఖ్యమంత్రి చెక్కు ఇస్తే ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ కాలేదు. ఎన్నికల్లో డమ్మీ హామీలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి అయ్యాక కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా రేవంత్ రెడ్డి? అనిహరీష్ రావు నిలదీశారు. అందరికీ రుణమాఫీ అని కొందరికి మాత్రమే చేశారన్నారు. రెండు లక్షలపైగా రుణమున్న రైతులు ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం ఆ పైన ఉన్న అప్పును కట్టారు.ఇంకా వారికి రుణమాఫీ కాలేదు.
పంటల బీమా విషయంలో కూడా రైతులను దగా చేశారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఉపాధి హామీ కూలీలను కూడా దగా చేస్తున్నారు. అడుగడుగునా రైతులను మోసం చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వమని వారు చెప్పకనే చెప్తున్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎన్నికల్లో రైతులకు అరిచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి మొండి చేయి చూపిస్తున్నారని అన్నారు. రైతులందరం కలిస్తే ప్రభుత్వం మెడలు వంచి ఈ పథకాలన్నీ అమలు చేసుకోవచ్చని అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో వ్యవసాయ కూలీలకు నెలకు ₹1000 చొప్పున సంవత్సరానికి 12000 ఇస్తామని చెప్పారు. వ్యవసాయ కూలీలను గుర్తించేది ఎలా? అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి.
కోటి 2 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ కార్డుల ద్వారా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క సెంటు భూమి ఉన్న మీరు కూలి కాదు అని చెబుతోంది. ఉపాధి హామీ పథకంలో ఈఏడాది 20 రోజులు పని చేసి ఉంటేనే కూలిగా గుర్తిస్తామని ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. అనారోగ్య సమస్యలతోనూ ఇతర సమస్యలతోనూ పనికి వెళ్ళని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించరని అనుమానం వ్యక్తం చేశారు. మీ హయాంలో పడావు బడ్డ భూములకు నీళ్లు ఇచ్చామని హరీష్ రావు తెలిపారు. తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. చెక్ డ్యాములు, చెరువులు బాగు చేసి నెట్టెంపాడు,బీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తిచేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం అని హరీష్ రావు డిప్యూటీసీఎం కు సవాల్ విసిరారు. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మధిరకు రమ్మంటారా, సెక్రటేరియట్ కి రమ్మంటారా? మీ ప్రగతి భవన్ కి రమ్మంటారా? అని ప్రశ్నించారు.



ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే