పల్లె, బస్తీ దవాఖానలను భ్రష్టు పట్టిస్తున్నారు..
మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : పేదలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడ్చల్ జిల్లా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ కు తాళం వేసే దుస్థితి వొస్తే ప్రభుత్వం,వైద్యారోగ్య శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. హైదరాబాద్ సహా నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో బస్తీ దవాఖానల పనితీరు దుర్భరంగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానల్లో ఎందుకు ఓపీ పడిపోయింది? పల్లె,,బస్తీ దవాఖానలు ప్రారంభించి ప్రజల సుస్తీని బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోగొడితే,ఆ దవాఖానలకే సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పట్టణ పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన దవాఖానలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దిక్కు మొక్కు లేక మూతబడటం దురదృష్టకరం.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రేటర్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 500 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది. ఇదేవిధంగా గ్రామాల్లో పల్లె దవాఖానలు ప్రారంభించింది. 15వ ఆర్థిక సంఘం ప్రశంసలను సైతం మన బస్తీ దవాఖానలు అందుకున్నాయి. కేసీఆర్ పదేళ్లలో తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశానికే రోల్ మోడల్ గా నిలిపితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తున్నది. రోగనిర్ధారణ పరీక్షల భారం కూడా పేదలపై లేకుండా ఉండాలని టి డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసి, 134 రకాల ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు పేద ప్రజలకు అందించింది. బీఆర్‌ఎస్ హయాంలో అద్భుతంగా పని చేసిన పల్లె, బస్తీ దవాఖానలు, టి డయాగ్నోస్టిక్ సెంటర్లు కాంగ్రెస్ హయాంలో ప్రజాదరణ కోల్పోతున్నాయి.14 నెలలు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం, వైద్యాధికారుల అలసత్వం పేద ప్రజలకు శాపంగా మారుతున్నదని అన్నారు. దీంతో పేదలు ప్రైవేటు హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవాల్సి వొస్తోందని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలందించాల్సిన బస్తీ దవాఖానలు మధ్యాహ్నం వరకే మూతబడుతున్నాయని ఆరోపించారు.
కొన్ని చోట్ల ల్యాబ్ టెక్నీషియన్ లేక,మరికొన్ని చోట్ల సర్వర్ సమస్యల వల్ల ఉచిత పరీక్షలు పేదలకు అందటం లేదన్నారు. బస్తీ దవాఖానల్లో మందులు కొరత వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీపీ, డయాబెటిస్, థైరాయిడ్ మెడిసిన్స్ సరఫరా జరగటం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి, వైద్యారోగ్య మంత్రి ఇప్పటికైనా పల్లె, బస్తీ దవాఖాన, తెలంగాణ డయాగ్నొస్టిక్ సమస్యలను పరిష్కరించి, పేద ప్రజలకు వైద్యం అందేలా చూడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. .





