Meta writing మరియు ఇద్దరి స్త్రీ అస్తిత్వవాదాలలో భిన్నత

‘Mother Mary Comes To Me’ పుస్తకం కవర్ లోపలివైపు ‘Memoir’ అని రాసి ఉంది. పుస్తకాన్ని లాంచ్ చేసినప్పుడూ, ఆ తర్వాత దాని గురించిన ఇంటర్వ్యూలలో ‘‘మా అమ్మ, ఆమెతో నా బంధము ఇందులోని విషయాలు‘‘ అని చెప్పింది రచయిత్రి. నిజమే, ప్రధానంగా వాళ్ళ అమ్మ వ్యక్తిత్వం (అదే ఆమె జీవితం కూడా) గురించి ఈ రచన అంటున్నప్పటికీ,  అరుంధతి రాయ్, తను ఇప్పటివరకూ వ్రాసిన రెండునవలల, పలు రాజకీయ వ్యాసాల నేపథ్యాన్ని, వాటి రచనా నిర్మాణక్రమాన్ని, అవి వ్రాసేందుకు తనను ప్రోద్బలించిన సంఘటనల వివరాలను వీలైనంత విశదంగా చెప్పబూనిన పుస్తకం కూడా ఇది.

తన వ్రాతలపైన వ్రాత, ఈ రచన. వేరే చాలా ప్రస్తావనలు ఈ పుస్తకంలో లేకపోలేదు, ఉదాహరణకు:  కమ్యూనిస్ట్, కాపిటలిస్ట్ , ప్రజాస్వామ్య, ప్రభుత్వాలలో తేడాలేకుండా దాక్కుని ఉండే  ప్రభుస్వామ్యం, కాశ్మీర్లో అణచివేతలు, దండకారణ్యంలో నక్సల్స్ ఎన్కౌంటర్లూ ఇలా ఎన్నో అంశాలను, వాటితో తన ముఖాముఖి అనుభవాలను కూడా ఆమె మాటల్లో చూస్తాము. అయితే ఏదోవిధంగా ప్రతి సంగతినీ అమ్మ ప్రస్తావనతో లంకె వేస్తూ ఉండటం గమనార్హం. తల్లినుండి ఇవతలికి వచ్చిన తరువాత కూడా తన జీవితానికి సంబంధించి ప్రతి అడుగులో తల్లి ఉనికి లేదా ఆ ఉనికి లేకపోవడం ఈమె గమనింపుకు వస్తునే ఉంటాయి. ఒకరికొకరు ఎంతదూరాల్లో ఉన్నా తల్లికథలో తను, తనకథలో తల్లి అంతర్లీనంగా అల్లుకుపోయి కనపడకతప్పదు. తల్లీకూతుళ్ళ ఆత్మకథ అనగానే తల్లిప్రేమ, ఆమెతో ఎడబాటు, పేగుబంధం ఇలాంటివి ఉంటాయనుకుంటే, మోసపోతారు పాఠకులు.

“నాకు ఆశ్రయమూ దాన్ని నాశనం చేసే తుఫానూ రెండూ మా అమ్మే” అని ప్రకటించిన కూతురు ఈ రచయిత్రి. ‘‘గెటౌట్, నీ మొహం చూడ్డం కూడా నాకు ఇష్టం లేదు‘‘ అని నిజంగానే చాలా సందర్భాల్లో ఇంట్లోకి కూడా రానీయని తనతల్లి దగ్గరకు చాలాసార్లు వస్తూనే ఉండిన కూతురు కూడా ఈమె. పుట్టాక పాతికేళ్ల తర్వాత మొదటిసారి కలుసుకున్న తండ్రి చనిపోబోతున్నపుడు ఆయన పక్కనే అంతదాకా ఉండి కూడా, తల్లి పరిస్థితి కొంచెం విషమంగా ఉందని తెలియగానే తండ్రిని వదిలేసి తల్లి దగ్గరకు రెక్కలు కట్టుకుని వాలిన కూతురు కూడా ఈమె. అమ్మతో ఈమెది సాదాసీదా సంబంధం కాదు. ఆమెను ఆలింగనం చేసుకోవాలో, విసిరేసి పారిపోవాలో తెలియని సంధిగ్ధమే చివరివరకూ ఈమెకు.

అటువంటి తుఫానుకూ తనకూ మధ్య బంధమూ యుద్ధమూ ఎటువంటివో వీలైనంత తటస్థంగా చెప్పటానికి ప్రయత్నం చేసింది రచయిత్రి ఈ మెమ్వార్లో. సౌష్టవశిల్పం, చదివించే శైలి, అందుకు ఎంచుకున్న సరైనభాషతో, మంచి ఆత్మకథాత్మక నవల అనిపించేట్టు సాగింది రచన, ఎక్కడో రెండుమూడుచోట్ల కాస్త అతిశయ ఛాయలు (రైటర్ గా రాయ్ కు సహజశైలి) కనపడినా. తుదిమొదలు ఉన్న చరిత్ర ఉన్నది ఈ రచనలో. తల్లి మరణంతో మొదలౌతుంది పుస్తకం. అప్పటినుండి రెండు జీవితాల పునశ్చరణ. ‘మిసెస్ రాయ్’ అని పిలిపించుకునే రచయిత్రి తల్లిది ఉక్కువంటి వ్యక్తిత్వం, ఆమెది ప్రచండ క్రోథగుణం, ఏ పూటకాపూట ప్రాణాంతకంలా పరిణమించగల ఆస్త్మా జబ్బు, దానివల్ల చుట్టూ ఉన్నవారిపై పెద్ద చికాకు ఆమెకు. కానీ, ఇవేనా ఆమెను అరుంధతికి, ఈమె నాకు అమ్మా? శతృవా? అనిపించేందుకు కారణాలు?

అలా అయితే ఇవే కాదు, అందరికిలాగే ఆమె ప్రవర్తనకు దోహదం చేసే బోలెడు బాహ్యకారణాలు కూడా ఉన్నాయి మిసెస్ రాయ్ కు! బ్రతకటానికి ఎంతో పోరాటం చేయవలసి వచ్చిన జీవితం ఆమెది. బాధ్యతలేని తాగుబోతు భర్తతో (He is nothing) తనకు మనుగడ లేదని త్వరగానే తెలుసుకుని అతని నుంచి కట్టుబట్టలతో ఇద్దరు చంటిపిల్లలతో పారిపోయి వచ్చింది ఆమె అస్సాము నుంచి ఊటీకి. ఆ సంఘటన తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు. ఆమె మళ్ళీ భర్తను కనీసం తలుచుకోలేదు తను తొంభై ఏళ్ళకు మరణించే దాకా, పుస్తకంలో ఎక్కడానూ. (She hates to love anyone and be sentimental) తన ఆ వైఖరిని ఆమె పతకంలా తగిలించుకుని తిరిగింది చివరివరకూ, ఎప్పుడూ ఎక్కడా దాచుకోలేదు.

వివాహం నుంచి విడాకుల సహాయం కూడా లేకుండా బయటపడి వచ్చిన ఆమె ఊటీలో తనతండ్రి కట్టించిన గెస్ట్ హౌస్ లాంటి రెండురూముల షెడ్ తాళాలు పగలగొట్టి ప్రవేశించి అందులో ఉండటం మొదలుపెట్టింది. కానీ, కొన్నాళ్ళు కూడా కాకుండానే ఆమె తల్లి, తమ్ముడూ వచ్చి తననూ పిల్లలనూ అక్కణ్ణించి కూడా వెళ్ళగొట్టారు, ‘‘పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన నీకు, మాకు సంబంధించిన ఆస్తిని అనుభవించే హక్కు లేదు’’ ఆమె బెదరలేదు. ఎలా కాదంటారు నన్ను అని కేరళలో తల్లి తమ్ముడూ ఉన్న ఇంట్లోకే వెళ్ళింది, అక్కడ అందరి నిరాదరణను సహించింది, ఇంట్లో అందరూ తనని తనపిల్లలను పరాన్నభుక్కులు అని అంటుంటే తన కాళ్ళమీద తాను నిలబడేందుకు త్వరగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

మొదట నలుగురు విద్యార్థులతో బడి ఆరంభించింది. ‘‘ఇటుక మీద ఇటుక పేర్చినట్లు‘‘ శ్రద్ధగా కొన్నేళ్ల కష్టంతో, రాష్ట్రంలోనే మేలైన శ్రేణికి చెందిన బోర్డింగ్ స్కూల్ ఈమె బడి అనే గుర్తింపు వచ్చేస్థాయికి దాన్ని తీసుకెళ్ళింది. కఠిన పారిశ్రామికురాలు మిసెస్ రాయ్. కేరళ హై కోర్టులో సిరియన్ క్రిస్టియన్ కుటుంబాలలో ఆడపిల్లలకు నిరాకరింపబడ్డ పుట్టింటి ఆస్తిహక్కులను సుప్రీంకోర్ట్ కు పోయి పోరాడి గెలుచుకు వచ్చిన రాక్షసమైన దీక్ష, పోరాట పటిమ ఆమెవి. చేపట్టిందల్లా విజయమే.

ఇంత చేవ ఉండి, తనబడిని నమ్మి వచ్చిన వేలమంది పిల్లలకు భద్రమైన భవిష్యత్తును ఇవ్వగల ప్రమాణాలతో విద్య, రక్షణ, శిక్షణలను అందించుతూ వచ్చిన మిసెస్ రాయ్, తన స్వంతపిల్లలు ఇద్దరికీ  మటుకు పీడకలలా, “అవకాశం దొరికితే చాలు బ్రతుకుజీవుడా ఈమె నుండి పారిపోదాము” అనిపించే విధంగా ఎందుకు ఉంది?
అదే అసలు ఆసక్తి కలిగించే విషయం. కథను తలదన్నగలదే వాస్తవం. పిల్లల్లో చురుకైన తెలివి, పనిలో, చదువులో వందశాతం నైపుణ్యం ఎదురుచూసే తల్లికి తనపిల్లలు ఏమాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయినా విపరీతమైన ఆగ్రహం వచ్చేది. దూరం అలా మొదలైంది. తనకు స్వేచ్ఛ స్వాతంత్రం ముఖ్యం అనుకునేవారు అవతలివాళ్ళకూ అది అవసరం అని మరిచిపోవడం లోకంలో సహజం.
ఈ ఇద్దరు స్త్రీలకూ ఆక్సిజన్ కన్నా తమ స్వేచ్ఛ ముఖ్యం. అట
– పద్మజ సూరపరాజు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *