ఎడారి కాగితం మీద
పలు ప్రణాళికలుగా విస్తరించాను
సూది రాతిమొనతో
చీకటిరాత్రుల కళ్ళుపొడిచాను
నాలుక తిప్పి భాషని లొంగదీసి
వేల అబద్దాల్ని పోగుచేశాను
ఎద్దుమెడలో కుండ పెంకునికట్టి
వాణిజ్యప్రకటనని తయారు చేసుకున్నాను
కాలికి చక్రం తొడిగి తెగ తిరిగాను
గాలిని తెరచాపకి ముడివేసి
సముద్రం మీదకి ఉసిగొలిపాను
నీటిమీద కనబడని హద్దుల్ని గీశాను
పేరులేని దేవుళ్ల జాబితా రాసుకున్నాను
ఆకాశాన్ని చీల్చి చందమామ మీద
మచ్చలా మిగిలాను
వెలుగుపుల్లతో అజంతా గుహలో
తొలిచిత్రాన్నై  మిగిలాను
సింధూ నదీ పాయనుంచి
లుంబిని వనం గుమ్మం నుంచి
సైబీరియన్ వలసవాదినై
బుసెఫాలస్ గుర్రమెక్కి
యుగాలమధ్యన తిరుగుతూ ఉన్నా
కాలం మొత్తం నడుస్తూ
పక్కనే మెసులుతున్న వాడ్ని
నమ్మడంలో తడబడి
ఎప్పటికీ మెలకువ రాని
ఈజిప్ట్ పిరమిడ్ లో మమ్మీలా
నిస్తేజంగా మిగిలిపోయున్నా

-అనిల్ డ్యాని 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *