తోక తలను ఆడిస్తుందా?

“పత్రికలు ప్రజల తరపున పాలకులను నిలదీసే ప్రజాస్వామ్య పాత్రకు బదులు ఇప్పుడు మీడియా అబద్ధాలు,కట్టు కధలు తాము పల్లకి గా మోసే రాజకీయ పక్షాల కోసం కట్టుకథలు వండడానికి వెనుక ఆడడం లేదు.పాలకపక్షాల తరపునైతే తమ అధికార పక్షాన్ని ఆకాశానికి ఎత్తేసేయడం,ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నెత్తికెత్తుకొని కాపాడడం, ప్రతిపక్షాలను జనంలో పలుచనచేసే చర్చలు వందిమాగాదులతో నిర్వహించడం సర్వసాధారణం. పొరపాటున అధికార పక్షం ప్రతిపక్షం లోకి వెడితే చిత్రంగా వారిని సమర్థించే పత్రికలు ప్రతిపక్ష పాత్రలోకి వారితో పాటు మారిపోతున్నాయి.”
‘మాయా’దర్పణం-2  
thirumal rao (1)
ఎన్.తిర్మల్, (సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త)
సెల్:9441864514.
ఇమెయిల్:Thirumala.1960@gmail.com

ఇప్పుడు తెలుగు నాట ఇదే ట్రెండ్ నడుస్తోంది.ప్రభుత్వం అనబడే దేహానికి తల రాజకీయ నేతలైతే,తోకలు వారి మీద ఈగ వాలకుండా చూసే మీడియా! ఒకప్పుడు మీడియా సామాజిక దర్పణం అయితే, ఇప్పుడు అధికార అర్పణంగా మారింది. అప్పనంగా రాజకీయ పక్షాలతో కుమ్ముకై అక్రమంగా ఆస్తులు కూడగట్టడం రివాజుగా మారింది. ఒకప్పుడు జర్నలిజమే ఊపిరి గా బ్రతికిన ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక , ఉదయం, లాంటి పత్రికలు అర్థాంతరంగా మూతపడి పోగా, ఇప్పుడు పత్రిక, మీడియా యాజమాన్యాలు ఆస్తులు పెంచుకునే హస్తాలాఘవంగా తన మీడియాను వాడుకొని పారిశ్రామిక వేత్తలుగా, అత్యంత ధనవంతులుగా, చివరకు రాజకీయ బ్రోకర్ పాత్రలోకి మారిపోయి జర్నలిస్టు అనే పాత్రను జోకర్ స్థాయి కిదిగజార్చుతున్నారు.

యాజమాన్యాలు ప్రాధమిక స్థాయి జర్నలిస్టులకు రెన్యూమరేషన్ గానీ,కనీసం లైన్ అకౌంట్ గానీ ఇవ్వడంలేదు..!గతంలో కేవలం వార్తా సేకరణకు మాత్రమే పరిమితమైన జర్నలిస్టులకు యాజమాన్యం టార్గెట్స్ పెట్టి వారినే పత్రికల ఏజెంట్లుగా ,యాడ్ కలెక్షన్స్ ఏజెంట్లుగా మార్చి వేయడం వలన సమాజంలో మీడియా అంటే వ్యాపారం, బెదిరింపులు, చివరకు బ్లాక్ మెయిలింగ్ దందాల వరకు ఎగబాకడంతో జర్నలిజం విలువలు దిగజారాయి. యాజమాన్యాల పాత్రనే సింహ భాగంగా మారింది.ఫళితంగా ఆన్లైన్ పేర పత్రికలు, యూట్యూబ్ ఛానళ్లు కుప్పలు,తెప్పలుగా వెలిశాయి.ఓ కధనమో, నాలుగు లైన్లు వార్త రాసి ఆ మేరకు ఎవరికి వారు వసూలు చేసుకునే దందాకు తెరలేపారు.పత్రికలు ప్రజల తరపున పాలకులను నిలదీసే ప్రజాస్వామ్య పాత్రకు బదులు ఇప్పుడు మీడియా అబద్ధాలు,కట్టు కధలు తాము పల్లకి గా మోసే రాజకీయ పక్షాల కోసం కట్టుకథలు వండడానికి వెనుక ఆడడం లేదు.పాలకపక్షాల తరపునైతే తమ అధికార పక్షాన్ని ఆకాశానికి ఎత్తేసేయడం,ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నెత్తికెత్తుకొని కాపాడడం, ప్రతిపక్షాలను జనంలో పలుచనచేసే చర్చలు వందిమాగాదులతో నిర్వహించడం సర్వసాధారణం. పొరపాటున అధికార పక్షం ప్రతిపక్షం లోకి వెడితే చిత్రంగా వారిని సమర్థించే పత్రికలు ప్రతిపక్ష పాత్రలోకి వారితో పాటు మారిపోతున్నాయి.
రెండు వైపూలా పత్రికల పాత్ర ఆయా పార్టీలకు నమ్మకమైన రాజకీయ ఏజెంట్లుగానే వ్యవహరిస్తున్నాయి.అధికారపక్షం అయితే గుడ్డిగా సమర్థించడం, ప్రతిపక్షం అయితే అదే గుడ్డిగా విమర్శలకు దిగడం సర్వసాధారణం అయ్యింది. స్వతంత్రతతో పాటు,జర్నలిజం పదకోశాలు కూడా మారిపోయాయి.ఎవరెక్కువ బూతులు మాట్లాడగలిగితే  వారికే జై కొడుతున్న పరిస్థితి ఉంది.ఇక సోషల్ మీడియా పేరుతో పరోక్షంగా పెంచి పోషిస్తున్న యూట్యూబ్ చానెళ్ళు మరింత బట్టలిడిసి,బరితెగించి కట్టుకథలు ఇష్టారాజ్యంగా ప్రసారం చేస్తున్నాయి.ప్రత్యర్థిని నైతికంగా కోలుకోకుండా దెబ్బ తీయాలనే ఏకైక లక్ష్యంతో అర్థం పర్థం లేని అసభ్య కథనాలు ప్రచారం చేయడానికి వెనుకాడడం లేదు.విస్తరిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేది జర్నలిజం రూపురేఖలు దినం దినం మార్చివేస్తుంది.చేతిలో సెల్ పోన్ అనేది వేగాన్ని అందుకొని జర్నలిజం పరిధిని,పదాలను దాటిపోయింది.పైగా అధికార క్రీడలో అంతర్భాగం అయిన మీడియా దాడులు జరిగినప్పుడు, కేసులు మీద పడినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటారు..జర్నలిజానికి హద్దులు, సరిహద్దులు  ఎప్పుడో మారి పోయిన రాజకీయ కర పత్రికలు అవసరాన్ని బట్టి ఇట్లాంటి అస్త్రాలు బయటకు తీస్తుంటాయి. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా పైస్థాయి,దిగువస్థాయిలో ఎవరిదందా వారిదే అన్న విధంగా మారిపోయింది.
పత్రికల్లో రాజకీయ నాయకుల పరోక్ష,ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి జర్నలిజం పరాయి కరణకు దారితీయడం తోపాటు, పత్రికల తటస్థీకరణ ,మధ్యేవాదం అనే విధానపరమైన పదాలకు కాలం చెల్లేలా చేసింది.జర్నలిజం ప్రజలకు దూరంగా జరిగి పోతుంది.వారిని మౌన ప్రేక్షకులుగా నిర్ధాక్షిణ్యంగా మార్చివేసింది.ఇప్పుడు పాత్రికేయ వృత్తిలో సమర్థతకు అర్థం మారింది.తస్మదీయులను రక్షించడం,అస్మదీయులను ఆడిపోసుకునే పోసుకోలు విద్య తెలిసుంటే చాలు,నలుగురు రెగ్యులర్ వంది మాగధులను టేబుల్ ముందు పెట్టుకొని చిత్ర, విచిత్రమైన చర్చలతో ప్రత్యర్థులను వీరోచితంగా చీల్చి చెండాడుతుంటారు.ఇప్పుడు ఇలాంటి అబద్ధాలు అందంగా అల్లి చెప్పించ గలిగిన సమర్థత ఉన్నవారే సీనియర్ జర్నలిస్టులుగా, ప్రతిష్టాత్మక మైన యాంకర్లు గా మీడియాలో రాణిస్తున్నారు.ఏరోజుకారోజు ఎన్నిక చేసుకునే కధనాలు కూడా ఆయా రాజకీయ పక్షాల అడుగుజాడల్లోనే ప్రసారం అవుతుంటాయి.అవి మద్దతు దారులకు ఆనందం,ప్రజలకు గందరగోళంగా మారడం తప్ప మరో ప్రయోజనం లేదు.ఒకప్పుడు తప్పుచేస్తే పాలకులను ప్రజల తరపున నిలబడే మీడియా ఇప్పుడు పూర్తిగా ఆశ్రిత రాజకీయ కధనాలుతో ప్రజల్ని మభ్యపెట్టే స్థితికి దిగజారాయి. రాజకీయ పక్షాలకు కూడా పత్రికాధిపతులకు లొంగిపోయి వ్యవహరించేలా, ఊడిగం చేసేవిగా మారిపోవడంతో పాటు విధానపరమైన నిర్ణయాలలో కూడా తోక తలను ఆడించే స్థితికి తెలుగునాట ,ఆమాటకొస్తే దేశవ్యాప్తంగా మారిపోయింది.
గతంలో పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు అయితే, ఇప్పుడు రాజకీయ కుంటి తనం మోసే ఊతకర్రలు,చంక పీటలు గా పరిణతి చెందాయి. పెట్టుబడులు, కట్టుకధలకు పరస్పర పోషకాలుగా మారిపోయాయి.జర్నలిజంలో మధ్యే వాదం ఎప్పుడో మాయం అయ్యింది ఇప్పుడు జర్నలిజం స్వతంత్రత అర్థం మారిపోయింది. ఇప్పటివరకు పత్రికలకు కొన్ని పరిమితులు ఉండేవి..!ఒక మీడియా సంస్థను మరో మీడియా సంస్థను విమర్శించడం లో విజ్ఞత కనపరిచేవారు.ఆంధ్రప్రదేశ్ లో పత్రికలే నేరుగా రాజకీయ ప్రచ్చన్న యుద్ధం కు తెరలేపడం తో ఏపత్రిక కు ఆ పత్రిక తమకు తాముగా రాజకీయ ముద్రలు వేసుకున్నాయి.రాజకీయ కుమ్ములాటలు కాస్తా భావ పరంగా మీడియా కుమ్ములాట గా మారింది.అదే సంస్కృతి ఇంచుమించు తెలంగాణాలో కూడా వేళ్ళు ఊనుకుంటుంది.ఇటీవల యన్.టీవీ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఓ  కథనం ప్రసారం చేయడం,దాన్ని ఆసరాగా చేసుకొని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన ‘కొత్తపలుకు’తో మరో మీడియా కధనాన్ని నీచమైనదిగా వర్ణిస్తూ బొగ్గు శాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిపి యన్.టీవి కధనాన్ని ఉటంకిస్తూ నైనీ బొగ్గుగనుల టెండర్లు అక్రమాలు బయటపెట్టారు.దీనితో అధికారపక్షంలో విబేధాలు రచ్చకెక్కాయి.బొగ్గుమసి ఖద్దరు బట్టలను పలుచని చేయడమే కాక,నలుపు కూడా చేసింది.ఆరాజుకూమన్న కుంపట్లు ఎవరికొంప అంటిస్తాయో తెలియదు.
వాటితోపాటు రాజకీయ పక్షాలు -మీడియా యూజమాన్యలకు ఉన్న అక్రమ చుట్టరికాలు, ఆశ్రిత పక్షపాతాలు కూడా క్రమంగా బయటపడుతున్నాయి.ఇది ఒకరకంగా మంచి పరిణామమే..!ఎప్పుడో ఒకనాడు మీడియా, రాజకీయ పక్షాల అక్రమ సంబంధాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.సోషల్ మీడియాను ఉద్దేశ్య పూరితంగా కేంద్రంలోఉన్న ప్రభుత్వ పెద్దలే నేరుగా పుకార్లు, అబద్ధాలు,సెంటిమెంట్లు,ట్రోలింగ్ లద్వారా మీడియా అర్థం మార్చి వేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ తెగులు కాస్తా ముదిరి రాజకీయాలు -జర్నలిజం మధ్య సరిహద్దు రేఖ చెరిపివేసింది.దీనికి ఆజ్యం పోసింది మాత్రం తెలుగు నాట విశాఖలో చిన్న పత్రిక గా మోదలై తెలుగు నాట పత్రికా, జర్నలిజం గుత్తాది పత్యానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి పేరు ప్రదానంగా చెప్పవచ్చును.
పచ్చళ్ళ వ్యాపారం నుండి వేల కోట్ల రూపాయల పెట్టుబడితో వందల ఎకరాల ఫిల్మిసిటీ ఏర్పాటు వరకు ఆయన వ్యాపారసామ్రాజ్యం జర్నలిజం-రాజకీయాలు ఊతంగా జరిగిందే! ఎవరికీ ఇందులో అనుమానం లేదు.పెట్టుబడీ,కట్టుకథలకు కట్టుబాట్లకు ఆద్యుడు ఆయనే. ఆయన1982లో ఎన్టీఆర్ ను అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర నిర్వర్తించారు.అటు తర్వాత 1994 తర్వాత ఎన్టీఆర్ తో విభేదించి ఆయనను అధికారం నుంచి దించడం లో కూడా ఆయనే కీలకపాత్ర నిర్వహించారు.దీనితో ప్రత్రికలు ఏమైనా చేయగలవనే భావన తోపాటు, జర్నలిజంకు రాజకీయ రంగు ,రుచి,వాసన అంటుకున్నది.ఈ అనుభవాల తర్వాత నే పాలకులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మీడియా రంగంలోకి తమ అక్రమ సంపదలు పెట్టుబడులు గా తరలించి జర్నలిజం విలువలను విధ్వంసం చేశారు.దీనితో ఇప్పుడు వీరు వారు,వారు వీరయ్యారు.తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను బట్టి “రాజకీయ పక్షాలు కోడెదూడలైతే, మీడియా దిగ్గజాలు ఇప్పుడు ఆంబోతులు,పోట్ల గిత్తలు”గా ఆయన పోల్చారు.అంటే ఆయన మాటల గూడార్థం ,నిగూడార్థం సారాంశం ఒక్కటే తలను, దేహాన్ని కూడా ఇప్పుడు ఆడిస్తున్నది తోక మాత్రమే!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *