“మార్వాడీ గోబ్యాక్”ఉద్యమం తెలంగాణాలోఈ నినాదం తారాజువ్వలాగా ఇప్పుడు దూసుకుపోతుంది. తెలంగాణాలోని”ఆమనగల్లు”అనే ప్రాంతంలో ఇదే సమస్యపై బందుకు సైతం పిలుపు నిచ్చారు. ఎందుకంటే పదేళ్ళ క్రితం నిధులు,నియామకాలు,నీళ్ళు పేరుతో మోదలైన ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. దీనికి అధికారం ఎలగబెట్టిన,పెడుతున్న రాజకీయ పార్టీలు అన్నీ జవాబుదారీ కావాల్సిందే..!ఈ ఉద్యమం మూలాలు అన్వేషణ చేయాలంటే ముందుగా అసలు ఈ మార్వాడీలు ఎవరు? ఎక్కడినుండి వచ్చారు?ఎందుకు తెలంగాణా కు వచ్చారు? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలి.
ఓ చిన్న అగ్గిపుల్ల పెద్దదావానలంకు కారణం అయినట్లు ఓ కారు పార్కింగ్ వివాదం కాస్తా ” మార్వాడీ గోబ్యాక్” అనే ఉద్యమానికి తెలంగాణా రాష్ట్రం లో అంకురార్పణ జరిగింది.ప్రభుత్వం దీన్నొక చిన్న సంఘటన గా తీసుకుని సరైన పరిష్కారం చూపి ఉంటే,ఈ సమస్య “కోతి పుండుగోకిగోకి బ్రహ్మ రాక్షసిలా”మారేది కాదు? ఇంతపెద్ద గా మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం ఉనికి లోకి వచ్చేది కాదు. కానీ, ప్రభుత్వం మార్వాడీ గోబ్యాక్ పాట”పోరా మార్వాడీ, మా రాష్ట్రం విడిచి మీ రాష్ట్రం పోరా మార్వాడీ”అన్న పాట పాడినందులకు గోరటి రమేష్ ను పోలీసులు ఆగమేఘాల మీద ఎత్తుకెళ్ళడం మరో పెద్ద రాద్దాంతం కు దారితీసింది. సోషల్ మీడియా లో మార్వాడీలు తెలంగాణావాదులు మధ్య కొన్ని బూతు పురాణాలు ఉద్దేశపూర్వకంగానే ప్రసారం అయ్యాయి. ఈ రెండుసంఘటనలతో తెలంగాణా రాష్ట్రంలో “ఆంద్రా గోబ్యాక్”ఉద్యమం లాగా “మార్వాడీ”గోబ్యాక్ ఉద్యమం వస్తుందా అన్న అనుమానం కలుగుతుంది. తోటి తెలుగు వారి పైనే ఉద్యమం చేసిన అనుభవం ఉన్న తెలంగాణా ఉద్యమకారులు రాజస్థానీల విషయంలో వెనకడుగు వేస్తారని భావించరాదు.
ఉద్యమాలు కేవలం చిన్న సెంటిమెంట్ తోనే మోదలౌతాయి. కానీ,దానికి”నిప్పు లేకుండా పొగ రాదు”అనే సామెత గుర్తు తెచ్చుకుంటే దీనికి ఏమైనా రాజకీయ ఆజ్యం తోడయ్యిందా? అన్న అనుమానం కలుగుతోంది. సహజంగా ఇలాంటి ఉద్యమాలు పాలకపక్షాలే రగిలిస్తాయి. చిన్నగీతపక్కన పెద్ద గీత పెట్టినట్లు! పాలక కాంగ్రెస్ పార్టీ అంతర్గత గొడవలతో సతమతమౌతుంది. కాంగ్రేస్ లో అంతర్గత సమస్యలు ముదిరి నప్పుడు ఏదోఒక సమస్యను రెచ్చగొట్టిన చరిత్ర,అలవాటు ఆపార్టీకి ఉంది..అంతేకాదు ఆరు గ్యారంటీల వ్యవహారం అటక ఎక్కింది? అటు తర్వాత 42శాతం బిసి రిజర్వేషన్ ఉద్యమం ప్రక్క దారిపడుతుంది. ఆ సమస్యా కనుచూపు మేరలో పరిష్కారం కు నోచుకోవడంలేదు. కీలకమైన కాంగ్రెస్, బిజేపి, టిఆర్ఎస్ లు ఒకరిపై ఒకరు ఆరోపణలతో సరిపెట్టుకుంటున్నారు తప్ప పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ఎవరికి లేదు..ఎత్తుగఢల సమస్యగానే అన్ని పార్టీలు తీసుకుంటున్నాయి. అదే సమయంలో ఉపాధి,ఉద్యోగ అవకాశాలు లేని యువత దిక్కుతోచని స్థితిలో ఉంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు. ప్రైవేటు రంగం ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతుంది. నిరుద్యొగ సమస్య అయినా పరిష్కారం చేయాలి లేదా,యువత దృష్టి నైనా మరల్చాల్సిన అవసరంఉంది,సమస్య ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిందే కావచ్చును.

“మార్వాడీ గోబ్యాక్”ఉద్యమం తెలంగాణాలోఈ నినాదం తారాజువ్వలాగా ఇప్పుడు దూసుకుపోతుంది. తెలంగాణాలోని”ఆమనగల్లు”అనే ప్రాంతంలో ఇదే సమస్యపై బందుకు సైతం పిలుపు నిచ్చారు.ఎందుకంటే పదేళ్ళ క్రితం నిధులు,నియామకాలు,నీళ్ళు పేరుతో మోదలైన ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. దీనికి అధికారం ఎలగబెట్టిన,పెడుతున్న రాజకీయ పార్టీలు అన్నీ జవాబుదారీ కావాల్సిందే..!ఈ ఉద్యమం మూలాలు అన్వేషణ చేయాలంటే ముందుగా అసలు ఈ మార్వాడీలు ఎవరు? ఎక్కడినుండి వచ్చారు?ఎందుకు తెలంగాణా కు వచ్చారు? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలి. మార్వాడీలు రాజస్థాన్ రాష్ట్రంకు చెందిన ఒక అగ్రవర్ణ ధనికతెగ! వీరు మొదటి నుండి వ్యాపారం నే ప్రదాన వృత్తి గా చేపట్టి దేశం మోత్తం మీద విస్తరించారు. వీరి మాతృభాష మార్వారీ,మార్వారీ మాతృభాష మాట్లాడేవారిని మార్వాడీలు అంటారు. రాజస్థాన్ రాష్ట్రం లో ఏర్పడిన కరువుకాటకాలు మూలంగా నైజాం పరిపాలనా కాలంలోనే పొట్ట చేత పట్టుకొని,పెట్టేబేడా సర్థుకొని తెలంగాణా రాష్ట్రంలో అడుగు పెట్టారు. అంటే, తెలంగాణా మార్వాడీ ల వలస చరిత్ర వంద సంవత్సరాల పైమాటే అన్న మాట.
వాస్తవంగా వీరు తొలుత నైజాం రాచరిక పాలనలోనే వజ్రాల వ్యాపారం తో ప్రవేశించి తెలంగాణా రాజధాని హైదరాబాద్ లోని బేగం బజార్,గన్నీ బజార్,షంషేర్ గంజ్,కబుర్తా ఖానా,చార్కమాన్,పాతబస్తీ తదితర ప్రాంతాల్లో చిన్నాచితకా వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు వీరి సంఖ్య హైదరాబాద్ లోనే ఓ15వేల మంది జనాభా ఉంటుందనే అంచనా ఉంది.గడచిన ఇరవై ఏళ్ళలో వీరు జిల్లా కేంద్రాల్లో, అక్కడినుండి చిన్న పట్టణాలకు సైతం విస్తరించారు.వీరు ప్రధానంగా టెక్స్ టైల్, సిమెంట్,లోహ, రసాయనిక,జ్యుట్ పరిశ్రమలలో స్థిర పడ్డారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారాలతో పాటు వడ్డీ వ్యాపారం లో సైతం వీరికి అనుభవం ఉంది. ఆహారం,నగలు,విద్యా,తదితర రంగాల వరకు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని తెలంగాణాలో విస్తరించారు.మార్వాడీలు ప్రధానంగా పేరు చివరన అగర్వాల్,గుప్తా,బన్సాల్ తదితర పేర్లతో పిలవబడతారు.అంతేకాదు పెద్ద పారిశ్రామిక వెత్తలుగా పేరుపడ్డ బిర్లా,బజాజ్ తదితరులు మార్వాడీలే, కావడం మరో విశేషం..
వీరు ప్రాథమికంగా ఉత్తరాది రాష్ట్రాల కు చెందిన హిందువులు కనుక వీరు తెలంగాణా రాష్ట్రం లో గతరెండు దశాబ్దాలుగా హిందూ ఆలయాలు పునరుద్దరణ,గోరక్షణ సమితిల ఏర్పాటు పేరుతో పట్టణాల్లో తమదైన సాంస్కృతిక సేనకు రూపకల్పన చేశారు. ఈ విధంగా మార్వాడీలు తెలంగాణా రాష్ట్రం లో ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా కూడా తమ పునాదులు విస్తరింప చేసుకున్నారు. ఒక ఆర్థిక సౌకర్యవంతమైన శక్తిగా కూడా ఎదిగారు.ఇదే సమయంలో వ్యాపార రంగంలో వస్తున్న మార్పులు, తక్కువ ధరలకు లభిస్తున్న డూప్లికేట్ వస్తువులు లభ్యత గుట్టు,మట్టు తెలుసుకోవడం వలన అనాది నుండి తెలంగాణా వ్యాపారవర్గలైన వైశ్య,కోమటి,బనియా తదితర కమ్యునిటీలను సైతం కొన్నిచోట్ల వ్యాపార పోటీ లో దాటిపోయారనడంలో వాస్తవం ఉంది. అయితే, ఇక్కడ మనమొక విషయం గుర్తించాలి. ప్రపంచం గ్లోబరీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ ధోరణులు విస్తరించి ప్రపంచం ఓ కుగ్రామం గా మారినప్పుడు వ్యాపారంలోమార్పులు, చేర్పులు సహజం. ఆయా సమాజం గమనాన్ని దృష్టి లో పెట్టుకుంటే వ్యాపార వర్గలే నిలదొక్కుకుంటాయి.
అలా తెలంగాణా లోనిలదొక్కుకున్న ప్రదాన వ్యాపార వర్గాల లో మార్వాడీ కమ్యూనిటీ ఒకటి. అయితే పెరిగిన మార్వాడీల లో , రాజకీయ నాయకుల తో ఉన్న, సంబంధాలు, బంధుత్వాలు ఉపయోగించుకొని కొందరు దొడ్డిదారిన తెలంగాణాలో రాజకీయ రంగప్రవేశం కు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకముందు ప్రయత్నం చేయాలనే గ్యారంటీ ఏమీలేదు..ఈ సమస్య విషయంలో బిజేపి ప్రదానం గా మార్వాడీలను వెనుకేసుకురావడం వెనుక ఆంతర్యం.వీరు ప్రాథమికంగా హిందూ మూలాలు కలిగి ఉండడమే! కాంగ్రెస్ కూడా మార్వాడీలను సమర్థించింది. బి ఆర్ ఎస్ ప్రస్తుతం మౌనగర్బితంగా ఎదురుచూస్తుంది. అయితే,మార్వాడీ గోబ్యొక్ ఉద్యమాలకు ప్రతిగా బిజేపి రోహింగ్యాలను గుర్తుచేస్తుంది.అయితే మార్వాడీలు వందేళ్ళ క్రితం వలసవాదులు వచ్చి స్థిరపడితే,రోహింగ్యాలు అనబడే ముస్లీం తెగ కూడా ప్రాణభయంతో బంగ్లాదేశ్ నుండి వచ్చి కాందిశీకులు గా దేశమంతా చెట్టుకొకరు,పుట్టుకొచ్చారు కేవలం జీవించడానికి వచ్చిన తెగే అనే విషయం మానవతా దృక్పథంతో చూడడం లేదు.
చావు బ్రతుకుల సమస్యలో కూడా మనం మనిషి వాదానికి బదులు,మతవాదాన్ని వెతుక్కోవడం ఈ మధ్య రాజకీయాలకు ప్రధానమైంది. మార్వాడీలు,రోహింగ్యాలు ఇరువురు వలస జీవులే అయినా సమస్య లో తేడా ఉన్నా విషయం మనం గమనంలో కి తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణా లో నిరుద్యోగం,ఉపాధి ,తదితర సమస్యలు వలన పేల్చడానికి సిద్దం అయిన నాటు బాంబు మాదిరిగా ఉంది. ఊదరగొట్టిన వాగ్దానాలు,ఆశలు నెరవేరని పరిస్థితి లోయువతలో తెగింపు ధోరణలు సహజం.కనుక ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా ఆయా వర్గాల సమస్యలు సామరస్యంగా పరిస్కరం కొరకు ప్రయత్నం చేయాలి తప్ప నిర్బంధాలు, అరెస్టులు,జైళ్ళు సమస్యలను ఎప్పుడూ పరిష్కారం చేయవు. కనుక ఇప్పుడు తెలంగాణా ముళ్ళ కంపమీద ఆరేసిన బట్టను చినిగి పోకుండా బయటకు తీసుకోవడం వివేకం తో కూడిన రాజకీయం అవుతుంది. మీనమేషాలు లెక్కించి ఎగదోస్తే అదే దావానలం అయి తెలంగాణా మరో మారు రావణా కాష్టం అవుతుంది కనుక ప్రభుత్వం ,ఉద్యమకారులు ఈ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.

సెల్:9441864514.





