“ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాల్ని మరాఠీలోకి శబ్ద, నాద, అర్థ, భాష సౌందర్యం చెడిపోకుండా అనువదించిన తీరు అపూర్వం. అలాగే తెలుగు కవులు, మరాఠీ కవులకు మధ్య గల దగ్గర సంబంధాన్ని పోల్చి చెప్తూ ఆయన రాసిన వ్యాసాలు అలరిస్తాయి. పోతనని మరాఠీ కవి జ్ఞానదేవ్‌తో, వేమనని తుకారాంతో, దార్ల సుందరమ్మని సంత్ జానాబాయితో, హరి సర్వోత్తమరావుని లోకమాన్య తిలక్‌తో, బైరాగిని మర్దేకర్‌తో, గురజాడ అప్పారావుని కేశవసుత్‌తో, రామదాస్‌ని దామాజీతో, అక్కన్న మాదన్నల్ని సంతాజీ, ధనాజీలతో పోల్చి తెలుగు సాహిత్యవేత్తల్ని మరాఠీ ప్రజలకి అతి సన్నిహితం చేసిన ఘనత లక్ష్మినారాయణదే.”
అతను తెలుగువాడు కానీ, మరాఠీ కావ్యాలు రాశాడు. అతడు చదివింది స్కూల్ ఫైనలే కానీ తన కావ్యాలు ఎమ్.ఏ.మరాఠీ విద్యార్థులకు పాఠ్యాంశాలు. కరీంనగర్‌లో పుట్టి పరాయి భాష మీద పట్టు సాధించి సాహిత్యకెరటమై నిలిచిన ఒక తెలుగువాడి.. ఒక తెలంగాణ వాడి ఘనత ఇది..! సోలాపూర్ పేరు చెప్పగానే సామాన్యుడికి దుప్పట్టు గుర్తొస్తే, సాహితీవేత్తలకు మాత్రం ఒక సాహిత్య శిఖరం గుర్తొస్తుంది. ఆ శిఖరం పేరు డా.బొల్లి లక్ష్మినారాయణ. 15 ఎప్రిల్ 1944న జన్మించిన లక్ష్మినారాయణ పూర్వీకులు కరీంనగర్ జిల్లా గుండారం నుంచి బతుకాటలో సోలాపూర్ చేరారు. వాళ్ళ కుటుంబం కష్టాలని కన్నీళ్ళని కడతేర్చుకుంటూ స్థిరపడుతుంటే, లక్ష్మినారాయణ మాత్రం సాహిత్యమే సర్వస్వంగా బతికిన ఆచరణవాది. తండ్రికేమో బతుకుపోరాటం చేయాలనే తపన. కొడుక్కేమో సాహిత్యమే ఆరో ప్రాణం. సాహిత్యం కూడు పెట్టదని తండ్రి హితవు. సాహిత్యమే తన శ్వాసగా చేసుకున్నాడు కొడుకు. పదవ తరగతి చదివే ఓ కుర్రాడు పరాయి భాషా సాహిత్యం పట్ల కుటుంబంతో ఒంటరి పోరాటం చేస్తుంటే చుట్టుపక్కల మరాఠీలకు ఆశ్యర్యం కలిగేది.
తెలుగు మరాఠీల మధ్య ఏదో తెలియని అనుబంధం వుందని, దాన్ని పసిగట్టి అక్షరరూపం ఇవ్వాలనీ లక్ష్మినారాయణ మనసు ఆరాటపడేది. తెలుగు-మరాఠీ సాహిత్యాలు విడిపోయిన అన్నదమ్ముల్లా ఉన్నప్పటికీ అంతరంతరాల్లో ఒకే రక్తసంబంధం వుందనేది కొన్ని వందల పుస్తకాలు చదివాక లక్ష్మినారాయణకు ప్రగాఢ నమ్మకం ఏర్పడింది.
ఈ అధ్యయన కాలంలోనే లక్ష్మినారాయణకు మరాఠీలో సుప్రసిద్ధ సాహితీవేత్త పి.ఎల్.దేశ్‌పాండేతో సన్నిహిత పరిచయం ఏర్పడింది. దేశ్‌పాండే లక్ష్మినారాయణలోని సాహితీ తృష్ణను గమనించి ఎన్నో మరాఠీ పుస్తకాలు చదివేందుకు ఇచ్చేవాడు. అవి చదివిన లక్ష్మినారాయణ వాటికి విషయ పరంగా దగ్గరగా ఉన్న తెలుగు పుస్తకాల గురించి పి.ఎల్.దేశ్‌పాండేకు వివరించి చెప్పేవారు. తెలుగు మరాఠీ సాహిత్యంలో తులనాత్మకత గురించి వారిద్దరూ ఎంతో చర్చించుకునేవారు.
లక్ష్మినారాయణ రాసిన ‘తెలుగు ఫులాంచ మరాఠీ సుగంధ్’ (తెలుగు పూల మరాఠీ పరిమళం) అనే రెండు వందల పేజీల పుస్తకం మరాఠీ సాహిత్య చరిత్రలో ఒక సంచలనం సృష్టించింది. ఆ పుస్తకంలో మరాఠీ సాహిత్యానికి ఆద్యులు మన తెలుగువారైన పాల్కూరి సోమనాథుడని, క్రీ.శ. 1135 ప్రాంతంలో సోమనాథుడు ‘వృషాధిప శతకం’ అని మరాఠీ-తెలుగు కావ్యం రాశాడని, మరాఠీ సాహిత్యకారుడు ముకుంద్ రాజ్ 1185 ప్రాంతంలో మొదటి మరాఠీ కావ్యం రాశాడని చరిత్ర చెబుతుంటే, మరాఠీవారికంటే ముందే మన తెలుగువాడు మరాఠీ సాహిత్యానికి శ్రీకారం చుట్టాడని ఆధారాల్తో సహా పుస్తక రూపంలో ప్రకటించడం పరాయి గడ్డ మీద సాహసోపేతమే..!
‘వృషాధిప శతకం’ లో మొదటి రెండు చరణాలు మరాఠీలో ఉంటే, తర్వాత రెండు చరణాలు తెలుగులో ఉండటం విశేషంగా లక్ష్మినారాయణ పేర్కొన్నారు. మరాఠీ రాజులు తెలుగు కావ్యాలు రాశారని లక్ష్మినారాయణ పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ సోదరుడు సంస్కృతాంధ్ర భాషలతో సహ ఇరవై తెలుగు పుస్తకాలు, యక్షగానాలు రాశారని లక్ష్మినారాయణ దృవీకరించారు. ఇంకెందరో మరాఠా మహరాజులు సర్పోజి రాజ్ భోస్లే, ప్రతాప్‌సింహ్ రాజ్ భోస్లే, రెండవ ఏకోజీ తదితరులు తెలుగులో కావ్యాలు రాసిన వైనాన్ని లక్ష్మీనారాయణ సోదాహరణంగా వివరించారు. తెలుగు నుంచి మరాఠీలోకి ఎన్నెన్నో అనువాదాలు చేసి, తెలుగు మరాఠీ సాహిత్యాల మధ్య అనుబంధాన్ని, సామ్యాన్ని సోదాహరణంగా వివరించి ఈ రెండు భాషల మధ్య సాహిత్య వంతెన కట్టిన లక్ష్మీనారాయణకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించారు.
ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాల్ని మరాఠీలోకి శబ్ద, నాద, అర్థ, భాష సౌందర్యం చెడిపోకుండా అనువదించిన తీరు అపూర్వం. అలాగే తెలుగు కవులు, మరాఠీ కవులకు మధ్య గల దగ్గర సంబంధాన్ని పోల్చి చెప్తూ ఆయన రాసిన వ్యాసాలు అలరిస్తాయి. పోతనని మరాఠీ కవి జ్ఞానదేవ్‌తో, వేమనని తుకారాంతో, దార్ల సుందరమ్మని సంత్ జానాబాయితో, హరి సర్వోత్తమరావుని లోకమాన్య తిలక్‌తో, బైరాగిని మర్దేకర్‌తో, గురజాడ అప్పారావుని కేశవసుత్‌తో, రామదాస్‌ని దామాజీతో, అక్కన్న మాదన్నల్ని సంతాజీ, ధనాజీలతో పోల్చి తెలుగు సాహిత్యవేత్తల్ని మరాఠీ ప్రజలకి అతి సన్నిహితం చేసిన ఘనత లక్ష్మినారాయణదే.. ఆయన మరాఠీలోకి అనువదించిన ‘స్వప్న వాసవదత్త’ రచనకు ఇప్పటికి పందొమ్మిది సార్లు బహుమతులు లభించాయంటే అతిశయోక్తి కాదు.
అంతర్జాతీయ తెలుగు కథల్ని ‘రాత్ర ఏక్ హౌడతలీ’ అనే పేరుతో లక్ష్మినారాయణ అనువదించిన సంకలనానికి ప్రముఖ మరాఠీ రచయిత విజయ్ తెండూల్కర్ ముందుమాట రాయడం విశేషం. ఆయన రాసిన ఎన్నో రచనలు మహారాష్ట్రలో పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు దశాబ్దాల కాలంగా పాఠ్యాంశాలుగా కొనసాగుతున్నాయి. సినారె రాసిన ‘ప్రపంచపదులు’ ని ‘పంచపది’ గా గోపీచంద్ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’ ని ‘ఏక్ పండితాచే మృత్యు పత్ర్’గా మరాఠీలోకి అనువదించారు. లక్ష్మినారాయణ సొంతూరు గుండారం, పి.వి.నరసింహరావు గ్రామమైన వంగరకి సమీపంలో ఉండడం కూడా ఒక విశేషమే..! వీరిద్దరూ ఒక మరాఠీ వేదికపై పరిచయం కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి.
లక్ష్మినారాయణకి ఎన్నో అవార్డులు లభించాయి. గురు మహాత్మ పురస్కార్, పి.వి.గాడ్గిల్ పురస్కారం, లోక్ హిత్ వాది పురస్కారం లాంటి అవార్డులు ఆయన సాధించారు. మరాఠీ గడ్డ మీద ఎన్నో సాహిత్య పదవులు కూడా ఆయన అలంకరించారు. పలు ప్రభుత్వ సాహిత్య కమిటీల్లో సభ్యుడిగా, ప్రపంచ తెలుగు పరిషత్ సభ్యుడిగా, పాఠ్యాంశాల సమితి అధ్యక్షులుగా, దమాణీ సాహిత్య పురస్కార్ కమిటీ సభ్యుడిగా, మరాఠీ సాహిత్య పరిషత్ సోలాపూర్ అధ్యక్షులుగా ఆయన సేవలందించారు. దూరదర్శన్‌లో అనేక ప్రసంగాలు చేశారు. ఆయన ఆత్మకథాంశంగా రాసిన ‘ఏక్ శాల్యానీ’ అనే గ్రంథం ఎంతో ప్రసిద్ధి చెందింది. డా.బొల్లి లక్ష్మీనారాయణ మరాఠీ సాహిత్యంలో తనదైన స్థానంతో పాటు రెండు సాహిత్యాల్లోని అనుబంధాల్ని పటిష్టం చేస్తూ తెలుగు వాడి కీర్తిని, తెలంగాణ వాడి సాహిత్య దీప్తిని విరజిమ్మి, విరాజిల్లడం ఎంతో గర్వకారణం.
డా.బొల్లి లక్ష్మినారాయణ 23 ఫిబ్రవరి, 2018 నాడు గుండెపోటుతో చివరి శ్వాస వదిలారు.
– సంగెవేని రవీంద్ర
– 99871 45310





