మరణాల భారాన్ని నేను మోయలేను
పునరుక్తిగా సాగుతున్న మృత్యువు నృత్యాలని చూడలేను
ఈ అకారణపు అకాల చావులు నిర్లక్ష్యపు నీడలు
ఎక్కడినుంచి ఎట్లా ఆక్రమిస్తాయో
ఊహించలేకున్నాను
‘మరణం’
ఈ పదాన్ని ఎంత తక్కువగా వింటే
అంత హాయిగా వుంటాను
ఈ పదాన్ని ఎంతగా వింటే
లోకం అంత వెలితిగా మారుతుంది
మనుషుల స్మృతుల భారం కల్లోలపరుస్తుంది
ఆగిన ప్రతి ఊపిరిలో ఆ ఒక్క ప్రాణమే కాదు
అనేకానేక జీవితాలు ఆవిరయిపోతాయి బూడిదయిపోతాయి
కట్టుకున్నవాళ్ళు కన్న బిడ్డలూ బంధువులు స్నేహితులు
అంతా ఒంటరి వాళ్ళయిపోతారు
కూలిన శిథిలాల కింద శవాలు, బూదడియిన దేహాలు
ఆసుపత్రిలో అనాధలు
పొగా ధూళితో ఆవరణ నిండిపోతుంది
మరోపక్క వూరు లేని పేరులేని శవదహనాలు
చిరునామా తెలీని స్మశానాలు
నిశ్శబ్దంగా నేను చూస్తూ నిల్చుంటాను
ధ్వంసావశేషాల నడుమ దుఖాన్ని దాచలేను
జాలి దయలతో కూడిన పలువురి మాటల భారాన్ని
గురించి నేను ఆలోచిస్తాను
అవన్నీ నిజాల్ని పాడేవారే లేని యుద్ధగీతాలు
ఇంకోవైపు మాట్లాడడానికి భయపడే నోట్లు.
అందరూ విడిచి పెట్టబడిన అనాధలు
గాలంతా రోదనలు
అందరి కళ్ళల్లో నల్లని వర్షం
మన శోకాన్ని చావు పాడుతున్న భాషలో
మనమే చెక్కుకుంటున్నాం.
ప్రతి పదం ఒక ద్రోహం,
ప్రతి నిశ్శబ్దం ఒక గాయం.
మరణాల్ని ఆపలేని భాషలో
మృతుల్ని బతికించలేని మాటల్లో
ఏమి మిగిలింది?
అయినా నేను ఇంకా రాస్తాను రాస్తూనే వుంటాను
క్షమించటానికి కాదు
జ్ఞాపకం కోసం
(పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాద మృతులకు నివాళి)
-వారాల ఆనంద్