ప్లేటో తన రిపబ్లిక్ గ్రంధంలో ‘తత్వవేత్తలు పాలకులుగా ఉంటే ఒనగూరే ప్రయోజనాలను ఈ విధంగా చెప్పారు’ తత్వవేత్తలు సునిశిత మేధో శక్తిని, లోతైన అవగాహనని, విజ్ఞతని కలిగి ఉంటారు, హేతువు, తర్కం, వాస్తవికతల ఆధారంగా నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి వారి వ్యక్తిగత ప్రయోజనాలకు, దురాశకు కాకుండా, అవి అంతిమంగా ప్రజల విశాల ప్రయోజనాలకు తోడ్పడతాయి’. స్వతంత్ర భారత్‌లో అధికారాన్ని చేపట్టిన ప్రధాన మంత్రులలో నెహ్రూ, పీవీల తర్వాత పై దార్శనికత అమలుకు నిలువెత్తు రూపంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిలుస్తారు. అవిభక్త భారత్ లో పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని ఘా అనే గ్రామంలో జన్మించిన మన్మోహన్ తన పాఠశాల విద్యను పెషావర్ లో పూర్తి చేసుకున్నాడు. దేశ విభజన కాలంలో కుటుంబంతో పంజాబ్‌కు చేరుకున్నారు. ఎకనామిక్స్‌లో ఉన్నత విద్యను ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇతిహాసిక ఆర్థికవేత్తలు రాబిన్సన్, నికోలాస్‌ల మార్గదర్శనంలో పూర్తి చేసుకున్నారు. ప్రాచీన మధ, ఆధునిక భారతంలో, ప్రపంచ మార్కెట్‌లో భారత్ వాటా. ఎగుమతులపై తన పిహెచ్‌డి పట్టాను పొందాడు. పంజాబ్ యూనివర్సిటీలో అధ్యాపక వృత్తిని చేపట్టాడు, అనతి కాలంలో అతని ప్రతిభ కేంద్ర పాలకులకు చేరింది.1972లో ఇందిర గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న యశ్వంత్ చవాన్ తన ఆర్థిక సలహాదారుగా నియమించుకున్నాడు.
ఆ తర్వాత ఆర్థిక శాఖా కార్యదర్శిగా, ప్రణాళిక సంఘ సభ్యుడిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా కొనసాగాడు. పి.వి ప్రధాని హయాంలో (1991-1996) ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగాడు. పారిశ్రామిక అనుమతులపై ఉన్న కఠిన ఆంక్షలను తగ్గించాడు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాడు. పడిపోతున్న రూపాయి విలువను నిలువరించి విలువను పెంచాడు. ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా నిలిచాడు. సరళీకృత విధానాలతో పెట్టుబడులను, నాణ్యత కోసం పోటీని కల్గి ఉండే మార్కెట్ విస్తృతిని పెంచాడు. వీటితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనూహ్యంగా పెరిగాయి. 1991లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ చేసిన వ్యాఖ్యలు తన ఆత్మ విశ్వాసానికి, అచంచల దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తాయి. కాలం నిర్ణయించిన, కాలం అందించిన గొప్ప భావనను భూమిపై ఏ శక్తి ఆపలేదు. ఆ భావన ఏమిటంటే ‘‘ప్రపంచమా చెవులు రిక్కరించి వినండి, ఆత్మ న్యూన్యత నుండి, అభివృద్ధి మందగమనం నుండి భారత్ మేల్కొంది, మేము అధిగమిస్తాము. మేం విజయం సాధిస్తాము’’ 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ కుటుంబము మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా చేసింది. ఆక్సిడెంటల్ ప్రధానిగా ముద్రపడిన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ విజన్‌ను. ఐక్య ప్రగతిశీల కూటమి అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ సలహామండలి సహకారంతో పలు విప్లవాత్మక పాలన మార్పులను, పథకాలను ప్రవేశపెట్టారు. ఇవి చరిత్రలో నిలిచిపోయే మైలు రాళ్ళుగా నిలిచిపోతాయి. కమ్యూనిస్ట్ భావజాలం ప్రజలకు గొప్ప మంచిని ఇవ్వడానికి ఉద్దేశించినది. కావున వారి మద్దతు. వారితో కలిసి పనిచేయడం ఇష్టాంగ అనిపించిందని పేర్కొన్నాడు.
అభివృద్ధి కోసం, పరిశ్రమలు, పలు ప్రాజెక్టులు అమలు కోసం భూమి సేకరణ కీలకం. భూ సేకరణ ప్రక్రియ రైతాంగం నుండి తీవ్ర ప్రతిఘటన రావడం జరుగుతుంది. హింసాత్మక సంఘటనలు జరుగుతున్న కాలం. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ తీసుకవచ్చిన చట్టం ప్రజాస్వామిక చరిత్రలో అపురూప ఘట్టం. భూ సేకరణ ,పరిహార పునరావాస చట్టం 2013 తీసుకవచ్చారు, దీని ప్రకారం సాగు భూములు సేకరించరాదు. సేకరించిన భూములకు మార్కెట్ విలువ కంటె నాలుగు రేట్లు ఎక్కువ నష్ట పరిహారం ఇవ్వాలి. నిరాశ్రయులకు మళ్లీ అన్ని సౌకర్యాలతో పునరావాసం కల్పించాలి. దీనిని ఆచరిస్తే శాంతియుత అభివృద్ధి వికాసంకు దోహదపడుతుంది. గ్రామీణ రైతాంగ కూలీల వినియోగ శక్తిని పెంచడానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ కల్పన పథకాన్ని ఏర్పాటు చేసి అమలు చేసారు. వంద రోజుల పని తో గ్రామీణ శ్రామికులలో వినియోగ సామర్థ్యం పెరిగి, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. పరోక్షంగా గ్రామీణ రైతాంగ సాగునీరు సౌకర్యాలు, అటవీ పెరుగుదలతో పాటు పారిశ్రామిక రేటు పెరగడానికి దోహదపడిరది. పలు సామాజిక సూచికలలో మెరుగైన స్థానాలకు చేరుకుంది.
ఆర్థిక ప్రగతి ఫలాలు చిట్ట చివరి ప్రజానీకానికి చేరాలని భావించాడు. తన పాలన కాలంలో 27 కోట్ల మంది ప్రజలను పేదరికము నుండి గట్టెక్కించాడు. మన్మోహన్ కాలంలో మరో విప్లవాత్మక చట్టం.. సమాచార హక్కు చట్టం. పాలనలో పాలకుల పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం కోసం ఏర్పాటు చేసారు. దీనితో పాటు భారత రాజ్యాంగములో ప్రకరణ 21 జీవించే హక్కు అర్థాన్ని మరింత విస్తృతం చేస్తూ విద్యా హక్కు చట్టం ఆహార భద్రత చట్టంను దానిలో భాగం చేస్తూ ప్రాథమిక హక్కుగా మార్చి అమలు చేసి ప్రజల జీవించే హక్కును, సంక్షేమాన్ని సమున్నతంగా నిలబెట్టారు. ఈ రెండు చట్టాలు తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చినవిగా పేర్కొన్నాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తన సహచర మంత్రులను అరెస్ట్ చేసి విచారించడానికి పూనుకున్న అరుదైన అంశాలకు సింగ్ తార్కాణంగా నిలిచారు.1984 ఇందిరా గాంధీ హత్య తర్వాత సిఖ్ ప్రజలపై జరిగిన అమానుష మారణ కాండకు క్షమాపణ చెప్పి ఆ వర్గ ప్రజల ఆవేదనను ఉపశమనం కలిగించారు. విదేశాంగ విధానంలో పాకిస్థాన్ తో సత్ సంబంధాలు.
అమెరికాతో అణు ఒప్పందం మైలురాళ్లుగా నిలిచిపోతాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి జి -20 ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించాడు. యూరోపియన్ యూనియన్ ఆర్థిక సంక్షోభాల సమయంలో అక్కడి నేతలు మన్మోహన్ సింగ్ సలహాలను తీసుకొని గట్టెక్కామని అప్పటి జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ పేర్కొన్నారు. ఒకానొక సందర్భంలో సింగ్ మాట్లాడుతూ ‘మీడియా,ప్రతిపక్షాలు తన పై నిర్దయగా ప్రవర్తించిన ..చరిత్ర మాత తన పట్ల దయ చూపిస్తుంది.’’తన బిడ్డ జ్ఞానంతో, అంతరంగం ఆచరణతో భూతల్లి ఎదపై నడయాడిన, భూతల్లి ఒడిలో చేరిన తన అపురూప ప్రియతమ పుత్రుడిని చరిత్ర మాత మురిసిపోతున్నది. ముద్దాడుతున్నది. తను మన పై ఉంచిన భాద్యతలను మోయమంటున్నది. కొనసాగించమంటున్నది. తాను దేశానికి అందించిన ప్రజా అనుకూల చట్టాలను, ఇచ్చిన మార్గాన్ని విస్మరిస్తున్నవారిని, బలహీనం చేసిన వారిని నిర్మోహటంగా ఈసడిరచుకోవడమే మనం మన్మోహనుడికి ఇచ్చే గొప్ప నివాళి.
-అస్నాల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
సెల్: 9652275560





