‘నిన్ను నువ్వు యెప్పుడైనా అద్దంలో చూసుకున్నావానే?’
‘ఊ… నాకేం తక్కువ?’
‘బంగారం బొమ్మలా వుంటావు కదనే?’
‘యా…’
‘మరి గా కోతిగాడికి యెట్ల పడినావే?’
‘మన పూర్వీకులనంటే మంచిగుండదు!’
‘చాల్లే, గా బద్మాష్‌గాడు నీకెట్ల నచ్చిండే?’
‘బద్మాష్‌గాడు కాబట్టి…’
‘నవ్వకు, గాడు నీకు నచ్చనీకి నాలుగు కారణాలు జెప్పే?’
‘పైసలుండి కూడా లేనోళ్లని ఫీల్‌ గానీకుండా ఆడు చినిగిన జీన్‌ఫాంటులేసుకుంటాడు!’
‘ఆహా…’
‘సెలూన్‌కెళ్ళి రోజుకో స్టయిల్ కటింగ్ చేపిచ్చుకోవచ్చు, కాని…’
‘జుట్టుపోలిగాని లెక్క వుంటడేగాని చేపిచ్చుకోడు… యింక?’
‘గుడికి దర్శనానికి పోతడు, కాని…’
‘గుడిలోకి పోకుండా నీ దర్శనం కోసమే జూత్తడు!’
‘ఔనే, బిచ్చగాళ్ళయినా మెట్లమీద కూసుంటరు, వీడు నేను అచ్చేదాక నిలబడే వుంటడు!’
‘పాపం… నీకు కాళ్ళనొప్పులు అచ్చిన్నట్టున్నాయ్…’
‘గ పోరడు పరీక్షలల్ల యెందుకు ఫెయిలయిండు?’
‘నీ యెనక తిరిగి తిరిగి ఆడి చదువెళ్ళి సంతల గూకుంది…’
‘నాది కూడా!’
‘నీకేం అనిపించడం లేదానే?’
‘మస్త్ కుష్ అయితాంది…’

‘అవ్వదా, క్లాసు పస్టు రమేష్‌గాడు పొట్టు పొట్టు యేడస్తాండు!’
‘నువ్వు గ కోతిగాణ్ణి ప్రేమించుడేంది? గీ గుడ్డుబోయ్ యేడుసుడేంది?’
‘అమ్మాయిలు బ్యాడ్‌బోయ్స్‌కే పడతారని ఆడు యేడుస్తాండు!’
‘మరి నువ్వు కుష్ అవుడేంది?’
‘చిన్నప్పుడు కాన్నుంచి ఆడివల్ల యెన్ని దెబ్బలు కాసిన్నే? ఆడికన్ని మార్కులు వచ్చుడేంది… నీకిన్ని మార్కులు వచ్చుడేంది అని యింట్ల వొకటే లొల్లి, నన్ను వొక్కరోజన్నా ప్రశాంతగ వుంచిండే? గందుకే కచ్చ తీర్సుకున్న!’
-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *