ఎప్పుడూ అద్దంలో ముఖం చూసుకోవడమే అలవాటు. కాని యీ మధ్య స్టీల్ ప్లేట్లో ముఖం చూసుకుంటున్నా. అదీ భోజనానికి కూర్చున్నప్పుడు. వడ్డించడానికి ముందు. ఈ విషయం మా ఆవిడ కనిపెట్టినట్టే వుంది.
“దువ్వెన తెచ్చి యివ్వనా?” అడిగింది.
నేను నవ్వలేదు. ‘ఉన్నవి నాలుగు వెంట్రుకలు గాని, వో యిదైపోతారు’ గొణుగుతూ వడ్డించబోతున్న మా ఆవిడ వంక ఆగమన్నట్టు చూశాను.
ప్లేటులోకి చూశాను. చూస్తూనే వున్నాను. ఓపిక నశించిన మా ఆవిడ అద్దం తెచ్చి నా చేతిలో పెట్టింది. అద్దాన్ని పక్కన పెట్టి ప్లేటుని నా ముఖానికి యెదురుగా పెట్టుకున్నాను.
“ముస్తాబవుతారా? భోంచేస్తారా?” మా ఆవిడ గోల మా ఆవిడది.
“ష్…” అన్నాను. ప్లేటులోకి చూడమన్నట్టు సైగ చేశాను. మా ఆవిడ వచ్చి ప్లేటులోకి చూసింది. బోధపడక తన చేతిలోకి తీసుకొనిమరీ చూసింది. “శుభ్రంగా వుంది, పనిమనిషి రాలేదు, నేనే తోమాను, లేదంటే మీరే తోముకోండి” అప్పజెప్పినట్టు చెప్పేసి వెళ్ళబోతుంటే, చెయ్యి పట్టుకు ఆపాను.
“సరిగ్గా చూడు, యేం కనిపిస్తోంది? ఐ మీన్ యెవరు కనిపిస్తున్నారు?” అన్నాను.
“ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు, పాతాళభైరవిలో మాంత్రికుడు ఎస్వీఆర్ మీరు, యిదేమో దర్పణం… హు…” నిట్టూర్చింది మా ఆవిడ.
“ప్చ్… అదికాదు, నాకు యెవరెవరో కనిపిస్తున్నారు…” అన్నాను.
“ఎవరెవరూ?” మా ఆవిడ దీర్ఘం తీసింది, నడుంమీద చెయ్యి పెట్టుకు నిగ్గదీస్తూ.
“నీకు కనపడడం లేదా?” అన్నాను. “మీకు కనిపిస్తున్నారు కదా?, చెప్పండి” అంది మా ఆవిడ.
చెప్పాను. మా ఆవిడకే కాదు. మా ఆవిడ నన్ను తీసుకెళ్ళి చూపించిన డాక్టరుకు కూడా.
“ఒక్కోసారి వొక్కొక్కరు. మావాడి ఫ్రెండ్స్. లేదా పక్కింటి వాళ్ళు. ఎదురింటి వాళ్ళు. మా మేడ్… వూ…” చెపుతూ ఆలోచిస్తున్నాను.
“మీ యింటికి యెవరు వచ్చి భోంచేస్తే- వాళ్ళు! యామ్ ఐ రైట్?” అన్నాడు డాక్టరు నవ్వుతూ. నేను తలూపాను.
“మీ ఆయన టీవీలో యాడ్స్ బాగా చూస్తారా?” డాక్టరు అడిగాడు. “ఆ… యూ ట్యూబ్‌లో కూడా, ‘సినిమాల్లో సీరియల్లోకన్నా యాడ్సే బాగున్నాయ్’ అంటారు. ‘యాడ్సే లేకపోతే బోరు కొట్టేది’ అని కూడా అంటారు…” మా ఆవిడ చెప్పడం పూర్తికాలేదు.
“ఆ తోమే యాడ్ వచ్చినప్పుడు కాస్త మార్చండి…” అని చెప్పి ఆ మానసిక వైద్యుడు అయిదువేలు తీసుకోవడమే కాదు, మరో నాలుగు సిటింగులకు హాజరు కావాలని, నయం కాకపోతే సిటింగ్స్ ఎక్స్‌టెన్షన్ చేద్దామని చెప్పాడు.
ఆ తర్వాత యెప్పుడూ ఖాళీ ప్లేటు పెట్టకుండా ముందే వడ్డించి పెట్టడం కూడా మా ఆవిడ అలవాటు చేసుకుంది.
-బమ్మిడి జగదీశ్వరరావు




