పున్నమినాడే అమావాస్య వచ్చినట్టుంది. మబ్బులు కమ్మి కాదు. చీకటి కమ్మి. వెన్నెల వెలసిపోయింది. చందమామ మెల్లమెల్లగా భూమికి దూరంగా జరుగుతున్నాడు. చాలాకాలం క్రితం నుంచీ శాస్త్రజ్ఞులు చెపుతూనే వున్నారు. చెప్పిందే జరిగింది. కొన్నాళ్ళకు చందమామ కనిపించదని. మాట జవదాటనట్టు కనిపించకుండా పోయాడు. ాకనబడుట లేదు్ణ అని యెవరూ పేపర్లో వెయ్యలేదు. ాఎక్కడున్నా తిరిగి రావలెను్ణ అని టీవీలో ప్రకటనలు యివ్వలేదు. కొందరు చీకట్లో కొవ్వొత్తులు వెలిగించి చూశారు, వెతుకుతున్నట్టు. తప్పిపోయిన తండ్రి యింటికి రానట్టు చందమామ రానేలేదు. ాచందమామ రావే జాబిల్లి రావే్ణ అని అమ్మలు పాడడమూ మానలేదు. చందమామని చూపిస్తేగాని గోరుముద్దలు తినమని పిల్లలు మారామూ మానలేదు. చందమామను తనలో చూపించడం లేదని అద్దం భళ్ళున బద్దలైంది. చందమామ లేకుండా వర్ణించడం మావల్ల కాదని కవులు చేతులెత్తేశారు. కవిత్వం కుప్పకూలిపోయింది. చందమామలో వుండే పొన్నచెట్టూ కుందేలూ చిన్నికృష్ణుడూ మాయమయిపోయి యెటువెళ్ళారో తెలీదు. పేదరాసి పెద్దమ్మ జాడ కూడా లేదు. కాని చందమామ మీద చెప్పిన కథలు అలాగే వున్నాయి, కలతలు లాగ. చుక్కలయితే అలిగి ఆకాశం వొదిలి వెళ్ళిపోయాయి. తామరలయితే వీడనేలేదు.
ఇప్పుడు వొక్కరోజు చంద్రగ్రహణం కాదు. కారు శోకంలో లోకం వుండగా, వొకడు ాఅదిగో చందమామ్ణ అన్నాడు. అంతా అటు చూశారు. ఎటు చూస్తే అటు చీకటి. ాఇందూ యిటు రా్ణ అన్నాడు. ానీ రేరాజు పిలుస్తున్నాడు్ణ అన్నాడు. ానా వెన్నెలగుత్తీ నా వెన్నెలపాపా్ణ అని ముద్దు చేశాడు. పిచ్చివాడన్నారు కొందరు. లేదు, మత్తులో వున్నాడన్నారు యింకొందరు. లేదు లేదు, ప్రేమికుడన్నారు మరికొందరు. ానా విలాసీ వేల్పులబువ్వా రా దగ్గరగా రా్ణ పిలుస్తున్నాడు. ాశశీ్ణ అని పరవశిస్తున్నాడు. పేరు పలికినప్పుడల్లా తను దగ్గరగా యింకా యింకా దగ్గరగా వస్తున్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అలా దగ్గరగా వస్తున్నది ప్రేయసి మోమో చంద్రబింబమో అనుభవజ్ఞులు కూడా ఆనవాళ్ళు పట్టలేకపోయారు. ాఎక్కడ?్ణ అన్నారు. ాప్రేమలో ములిగి చూడు, జాబిలి దక్కుతుంది్ణ ప్రేలాపనగా అన్నాడు ఆ ప్రేమికుడు. తప్పి దిగంతాల ఆవలకు జారిపోతున్న చంద్రము ఆ సంధ్యవేళ కక్ష్యలోకి తిరిగి రావడం మొదలుపెట్టాడు. చుక్కలా, బంతిలా, బంతిపువ్వులా, పూబంతిలా, పసిడి ముద్దలా, మిసిమి కాంతిలా. చీకటిని మింగుతూ వెలుగు. అవని మీద వెన్నెల వర్షం. తడుస్తూ జనం.
బమ్మిడి జగదీశ్వరరావు