కొండవీటి సత్యవతి
ట్రాన్స్ కమ్యూనిటి పట్ల తెలుగుసమాజమే స్తబ్దంగా ఉంది. వారిమీద జరుగుతున్న లైంగికహింస, హత్యలు, అరాచకాల గురించి చెదురుమదురు రచనలు తప్ప ఇంకా మౌనంగానే ఉంది. మానస ఎండ్లూరి, విజయ కుమార్. చిలుకూరి రామ ఉమామహేశ్వరశర్మలాంటి వారిరచనలు తప్ప పెద్దగా సాహిత్యం రాలేదు. తెలుగులో ట్రాన్స్ కమ్యూనిటీ గురించి రాయాలంటే మొదట వారి బీభత్స జీవితాల గురించి, సెక్స్ వర్క్, భిక్షాటన తప్ప వేరే దారిలేని దయనీయమైన జీవన విధానాల గురించి సానుకూల దృక్పధం ఉంటే తప్ప రాయడం సాధ్యంకాదు.
ఒకరిద్దరు తప్ప రచయితలెవ్వరూ వారి సమావేశాల్లో కనిపించలేదు. ట్రాన్స్ మహిళల్ని రౌడీలు క్రూరంగా హత్యలు చేసినప్పుడు రచయితలెవ్వరూ వారిమీద అమలయ్యే హింస గురించి నోరు విప్పలేదు. ఇప్పుడిప్పుడే మొదలైన కొన్ని ప్రయత్నాలు ట్రాన్స్ జెండర్ కమ్యూనిటి జీవనవిధానాల్లో మంచిమార్పుకు నాంది అవుతున్నాయి. రచయితలు వాటిని అర్ధం చేసుకుంటే వారి గురించి రచనలు వస్తాయి.
తెలుగుసమాజం మెల్లగా ట్రాన్స్ వ్యక్తులపట్ల తనధోరణులను సవరించుకుటూ చిన్నప్రయత్నాలు చేస్తున్నది. ఇవన్నీ చాలావరకూ ప్రభుత్వపరంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ట్రాన్స్ జెండర్ మహిళలు, ట్రాన్స్ మెన్ పరంగానే ఉంటున్నాయి. ఎన్నో అస్తిత్వాలతో ఉన్న ఎల్జిబిటి కమ్యూనిటీ ఇంకా చీకట్లోనే ఉంది. రచయితల పని ఈ చీకట్లమీద వెలుతురు ఫోకస్ చేసి ఆయాజీవితాల గురించి ప్రపంచానికి తమ రచనల ద్వారా తెలియచెప్పడం. వారిపట్ల ఉన్న అసహనం, అనుమానం, స్టిగ్మాలను బద్దలు కొట్టాలంటే రచయితలు విస్తృతంగా వారి గురించి రాయాలి.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల